యంత్ర సేవా కేంద్రం వద్ద అద్దెకు తీసుకున్న ల్యాండ్ లెవెలర్‌తో పొలాన్ని చదును చేస్తున్న దృశ్యం
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో 980 మంది రైతులు 2,450 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. సీజన్‌లో కూలీలు దొరక్క ఇబ్బందిపడేవారు. చిన్నచిన్న యంత్రాల కోసం కూడా దళారీలను ఆశ్రయించేవారు. సీజన్‌లో బెంగళూరు, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చే యంత్రాలకు వేలకు వేలు పోయాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆర్బీకేల పరిధిలో ఏర్పాటైన యంత్ర సేవా కేంద్రాల ద్వారా ట్రాక్టర్, కంబైన్ హార్వెస్టర్, ఇతర యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల ఒక్కో సీజన్‌లో పంటను బట్టి ఒక్కో రైతుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఆదా అవుతోందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు..
సాక్షి, అమరావతి: ఇలా ఈ ఒక్క గ్రామమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటైన వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు రైతుల కష్టాలకు చెక్ చెబుతున్నాయి. కూలీల కొరతను తీర్చడమేకాదు.. పెట్టుబడి ఖర్చును తగ్గిస్తున్నాయి. ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను సన్న, చిన్నకారు రైతులకు తక్కువ ధరకే అద్దెకు ఇచ్చేందుకు ఆర్బీకే, క్లస్టర్ స్థాయిల్లో వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రూ.15 లక్షల అంచనా వ్యయంతో ఆర్బీకే స్థాయిలో వివిధ రకాల పరికరాలను 6,781 కేంద్రాల్లో.. రూ.25లక్షల అంచనా వ్యయంతో క్లస్టర్ స్థాయిలోని 391 కేంద్రాల్లో మరికొన్ని పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
40 శాతం సబ్సిడీపై రైతు గ్రూపులకు ఈ కేంద్రాల ద్వారా దుక్కి యంత్రాలు, దమ్ము, చదును చేసే పరికరాలు, వరి నాటే, నూర్పిడి యంత్రాలు.. విత్తనం, ఎరువు పరికరాలు, కలుపుతీసే పరికరాలు, సస్యరక్షణ పరికరాలు, కోతకోసే యంత్రాలను అందించింది. వీటితోపాటు ఇటీవలే ఆర్బీకే స్థాయిలో రైతు గ్రూపులకు 3,800 ట్రాక్టర్లను కూడా అధికారులు అందించారు. పంటల సరళి, స్థానిక డిమాండ్‌ను బట్టి యంత్ర పరికరాల ఎంపిక, నిర్వహణ, అద్దెలు నిర్ణయించే బాధ్యత రైతు కమిటీలకు అప్పగించారు.
వీటి ధరలు, సంప్రదించవలసిన వారి వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మిగిలిన ఆర్బీకేల్లో సెప్టెంబర్ నెలాఖరులోగా ఈ కేంద్రాలు ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది రైతులకు వ్యక్తిగత యంత్ర పరికరాలు కూడా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు.. సూక్ష్మ ఎరువులు, పురుగు మందులను పిచికారీ చేసేందుకు వీలుగా మండలానికి మూడు చొప్పున ఈ ఏడాది రెండువేల గ్రామాల్లో రైతుసేవా కేంద్రాలకు డ్రోన్స్ సరఫరాకు చర్యలు చేపట్టింది.
యంత్రాలతో పెట్టుబడి ఆదా
నిజానికి.. దుక్కి దున్నేందుకు ఎకరాకు రూ.600, దమ్ముకు రూ.1,000లు తీసుకునేవారు. అలాంటిది ప్రస్తుతం ఆర్బీకేల్లోని ట్రాక్టర్లను అద్దెకు తీసుకుంటే రూ.ఐదారు వందలకు మించి అవడంలేదంటున్నారు.
► అలాగే.. సీడ్ కం ఫెర్టిలైట్ డిల్లర్ ద్వారా విత్తనాలతో పాటు మందును ఒకేసారి చల్లేందుకు ఎకరాకు రూ.300 వరకు మిగులుతోందని రైతులు అంటున్నారు.
► జొన్న, మొక్కజొన్న కట్టలు కట్టేందుకు గతంలో ఎకరాకు కూలీలకు రూ.1,500లు ఖర్చయ్యేది. అలాంటిది ప్రస్తుతం కట్టలు కట్టే మిషన్‌వల్ల రూ.ఐదారు వందలు మించి కావడంలేదు.
► మినుము పంటకు పురుగుల మందు పిచికారి కోసం ఎకరాకు ఒక్కో కూలీకి రూ.600 ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.200కు మించి కావడంలేదు.
► ఇక గతంలో కోత మిషన్‌కు ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేలు చెల్లించే వారు. కానీ, ఇప్పుడు రూ.2,500 నుంచి రూ.3వేల లోపే అవుతోందని రైతులు చెబుతున్నారు.
..ఇలా ఇతర పరికరాల ద్వారా పొందే ఆదా లెక్కిస్తే రెండు సీజన్లు కలుపుకుని పంటను బట్టి ఎకరాకు రూ.10 వేలకు పైగా ఆదా అవుతోందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
రైతు గ్రూపునకు ఆదాయం
గ్రామంలో ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడి ట్రాక్టర్–టిల్లర్ తీసుకున్నాం. మేం వాడుకోగా గ్రామంలో రైతులకు అద్దెకిస్తున్నాం. బయట ఎకరాకు రూ.1,300–రూ.1,500 తీసుకుంటున్నారు. మేం రూ.900–రూ.1,100కు ఇస్తున్నాం. ఎకరాకు రూ.400 వరకు ఆదా అవుతుండడంతో మా వద్ద అద్దెకు తీసుకునేందుకు గ్రామంలో మెజార్టీ రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.
– పత్తి వెంకటబ్రహ్మయ్య, ఆలమూరు, నంద్యాల జిల్లా
పెట్టుబడి ఖర్చు తగ్గుతోంది
మా గ్రూపు తరఫున రెండు రోటేవేటర్లు, రౌండ్ పీలర్, థ్రషర్స్ తీసుకున్నాం. రోటోవేటర్‌కు బయట ఎకరాకు రూ.1,800 వరకు తీసుకుంటున్నారు. మేం రూ.900కే అద్దెకిస్తున్నాం. థ్రషర్‌కు బయట రూ.2వేలు తీసుకుంటే. మేం రూ.1,600కే ఇస్తున్నాం. రౌండ్ పీలర్‌కు కట్టకు రూ.30లు తీసుకుంటే మేం రూ.25లకే ఇస్తున్నాం. వీటివల్ల మాకే కాదు.. గ్రామంలో మెజార్టీ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.
– పగిడి శివరామయ్య, రుద్రవరం, నంద్యాల జిల్లా
ఎవరిపైనా ఆధారపడాల్సిన పనిలేదు
మా గ్రూపు ద్వారా ట్రాక్టర్ తీసుకున్నాం. మేం మిరప, మినుము సాగుచేస్తున్నాం. మేం వినియోగించుకోగా గ్రామంలో మిగిలిన రైతులకు అద్దెకిస్తున్నాం. ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా అన్ని రకాల పనులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.
– జమ్మి సురేష్, దేవరపల్లి, ఏలూరు జిల్లా
రూ.3.64 లక్షలు సబ్సిడీ జమైంది
మా గ్రూపు కింద ఇటీవలే తైవాన్ స్ప్రేయర్లు, న్యూ హాలాండ్ ట్రాక్టర్ తీసుకున్నాం. వీటి ఖరీదు రూ.9.57 లక్షలు కాగా.. రూ.3.64 లక్షల సబ్సిడీ జమైంది. ఖరీఫ్ సాగు వేళ ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మా గ్రూపులో రైతులందరి అవసరాలు పూర్తికాగానే ఇతర రైతులకు అద్దెకిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది.
– భీమవరపు శివరామకృష్ణ, పెనుమూలి, గుంటూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment