ఒక ఈవీఎం లెక్కింపు పూర్తయిన తర్వాతే మరో ఈవీఎం తీసుకోవాలి
వీలైనంత త్వరగా కచ్చితమైన ఫలితాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేయండి
పాస్‌లు లేని వారిని కౌంటింగ్ సెంటర్ల వద్దకు రానివ్వద్దు
ఇందుకోసం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయండి
రాష్ట్రాల సీఈవోలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశం
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని.. ఇందుకు అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాల సీఈవోలు, ఎన్నికల అధికారులకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆదేశించారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సందుతో కలసి రాజీవ్‌కుమార్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అందరి సమిష్టి కృషితో దేశవ్యాప్తంగా ఎన్నికలు విజయవంతంగా జరుగుతున్నాయని అభినందించారు. అదే స్ఫూర్తితో వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద క్రౌడ్ మేనేజ్‌మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పాస్‌లు లేకుండా ఎవరినీ అనుమతించవద్దని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ పరికరాలను, అంబులెన్సులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.
ఫలితాల ప్రకటనలో ఆలస్యం చేయొద్దు..
ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపు గురించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇవ్వాలని రాజీవ్‌కుమార్ ఆదేశించారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు వంటి పరికరాలను కౌంటింగ్ కేంద్రాల్లో సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా.. ఒక క్రమ పద్ధతిలో తీసుకురావాలని స్పష్టం చేశారు. ఒక ఈవీఎం లెక్కింపు పూర్తయిన తర్వాతే మరో ఈవీఎం తీసుకోవాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత.. ‘లెక్కింపు పూర్తి అయినట్లుగా’ ఆయా ఈవీఎంలపై మార్క్ చేయాలని ఆదేశించారు.
ఆ వెంటనే సీల్ చేసి ఒక క్రమపద్ధతిలో సురక్షితంగా భద్రపరచాలని ఆదేశించారు. అనవసరంగా ఈవీఎంలను అటూ, ఇటూ కదిలించవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపు కోసం ప్రత్యేకంగా టేబుళ్లు, స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయొద్దని.. డిస్‌ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా, అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, హరేంధిర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment