సమావేశంలో మాట్లాడుతున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి
తిరుమల: అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్, టీటీడీలోని అన్నివిభాగాల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 18న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా శ్రీనివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనం, తిరుమలలో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయన్నారు.
సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, వారికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనంతోపాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామని చెప్పారు. బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించమని, స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్టు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లోని భక్తులకు రోజుకు వెయ్యి మంది చొప్పున బ్రహ్మోత్సవ దర్శనం చేయిస్తామని తెలిపారు.
భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరిత, ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, డీఎల్వో వీర్రాజు, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆర్టీసీ ఇన్‌చార్జ్ ఆర్‌ఎం జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment