
108 వాహనంలో జన్మించిన శిశువుతో ఈఎంటీ రజనీదేవి
కైకలూరు: కరోనా బారినపడిన నిండు గర్భిణికి 108 సిబ్బంది ఆ అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించారు. వివరాల్లోకి వెళితే.. కైకలూరుకు చెందిన గర్భిణి కె.శ్రావణి ప్రసవ నొప్పులతో కైకలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి శనివారం వచ్చింది. వైద్యులు పరీక్షలు చేయగా.. ఆమెకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పారు. దీంతో శ్రావణిని తీసుకుని 108 వాహనంలో ఈఎంటీ రజనీదేవి పీపీఈ కిట్ ధరించి, పైలట్ బోయిన రావుతో కలసి మచిలీపట్నం బయలుదేరారు.
కొద్దిదూరం వెళ్లిన తర్వాత శ్రావణికి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో రజనీదేవి తెగువతో చాకచక్యంగా సుఖ ప్రసవం అయ్యేవిధంగా చేశారు. ఆమె ఆడ శిశువుకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డలను మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. ఎంతో ధైర్యంతో విధులు నిర్వర్తించిన ఈఎంటీని 108 వాహన జిల్లా అధికారి సురేష్‌కుమార్, డివిజనల్ అధికారి ప్రశాంత్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment