సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ పరిపక్వతలో భారతీయ చిన్నారులు ముందంజలో నిలుస్తున్నారు. 10–14 ఏళ్ల వయసు పిల్లల్లో ఫోన్ వినియోగం 83 శాతంగా ఉంది. ఇది ప్రపంచ సగటుతో పోలిస్తే 7 శాతం అధికంగా నమోదవటం విశేషం. కాగా, ఇతర దేశాలతో పోలిస్తే ఆన్‌లైన్ అపాయాల(రిస్క్)కు గురవుతున్న చిన్నారుల్లో అత్యధికులు భారతీయులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. స్మార్ట్ ఫోన్ వినియోగంలో 10నుంచి 14ఏళ్లలోపు భారతీయ చిన్నారులు 24 శాతం ఆన్‌లైన్ ముప్పునకు గురైనట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆన్‌లైన్ భద్రతపై అవగాహన లేమి
దేశంలో 47 శాతం మంది తల్లిదండ్రుల్లో సైబర్ బెదిరింపులు, సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆందోళన పెరుగుతోంది. ఇక్కడ చిన్నారులు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నపుడు రక్షణ కల్పించడంలో అవగాహన లేమి ఆన్‌లైన్ ముప్పునకు కారణాలుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా దేశంలో 33 శాతం తల్లిదండ్రుల ఆన్‌లైన్ ఖాతాలు సైతం సైబర్ దాడికి గురైనట్టు గుర్తించారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల సగటుతో పోలిస్తే 13 శాతం ఎక్కువ. ప్రపంచ సగటులో 15 శాతం మంది చిన్నారులు ఆన్‌లైన్ ముప్పునకు గురైతే.. మన దేశంలో అది 28 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇందులో భాగంగా సైబర్ బెదిరింపులు, వ్యక్తిగత సమాచారం చోరీ, ఆర్థిక సమాచారం లీకేజీలను అరికట్టడానికి చిన్నారులకు ఫోన్ ఇచ్చేముందు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ తప్పనిసరిగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్లలోనే షాపింగ్, అపరిచిత వ్యక్తుల సందేశాలకు దూరంగా ఉండటంపై తరచూ పిల్లలను హెచ్చరించాలని చెబుతున్నారు. చిన్నారులకు ప్రత్యేకంగా ఫోన్ ఇవ్వకపోవడం మంచిదని, తమ ఫోన్లలోనే వారికి అవసరమైన యాప్‌లు మాత్రమే ఓపెన్ అయ్యేలా పర్యవేక్షించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
(చదవండి: హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment