Chintamaneni Prabhakar As A1 In Chicken Betting Case - Sakshi
Sakshi News home page

కోడి పందేల కేసులో ఏ1 చింతమనేనే.. 

Published Thu, Jul 7 2022 6:47 PM | Last Updated on Fri, Jul 8 2022 1:17 AM

Chintamaneni Prabhakar As A1 In Chicken Betting Case - Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్‌: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలం చిన్నకంజర్ల శివారులోని ఓ ఫాంహౌస్‌లో కోళ్ల పందేల ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కోళ్ల పందేల స్థావరంపై బుధవారం రాత్రి దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే పందేల ప్రధాన నిర్వాహకుడైన టీడీపీ నేత, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పోలీసుల కళ్లుగప్పి పరారవడంతో ఆయన కోసం గాలిస్తున్నారు.

పందెం నిర్వహణకు చింతమనేనే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలడంతో ఆయన్ను ఏ1 నిందితుడిగా చేర్చామని, ఆయనతోపాటు పరారీలో ఉన్న మరో 40 మందిని పట్టుకొనేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని పటాన్‌చెరు డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. చింతమనేని తన ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నారని చెప్పారు. అయితే పోలీసులు దాడులు నిర్వహించిన కోళ్ల పందేల స్థావరంలో తాను లేనంటూ చింతమనేని సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులపై డీఎస్పీ స్పందించారు. చింతమనేని పోస్టుకు సమయం వచ్చినప్పుడు కౌంటర్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

చింతమనేని కోడి పందేలు ఆడిస్తున్నట్లు వీడియోలు ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు తమ వద్ద ఉన్న సాంకేతిక ఆధారాలను విడుదల చేస్తామన్నారు. అయితే పోలీసులు ఆ వీడియోలను విడుదల చేయకముందే చింతమనేని బుధవారం చిన్నకంజర్ల గ్రామ శివారులో కోళ్ల పందేల్లో పాల్గొన్న ఓ వీడియో ‘సాక్షి’కి చిక్కింది. పోలీసుల దాడి సమయంలో ఆయన అక్కడి నుంచి పారిపోతున్నట్లుగా అందులో స్పష్టంగా కనిపించింది. 

వాట్సాప్‌ ద్వారా సమీకరణ... 
వాట్సాప్‌లో లొకేషన్‌ షేర్‌ చేస్తూ కోళ్ల పందెంలో పాల్గొనే వారిని చింతమనేని సమీకరిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చింతమనేని తొలుత సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ కోహీర్‌ శివారులోని కుంచారంలో కోళ్ల పందేలు ఆడి తిరిగి అక్కడి నుంచి చిన్నకంజర్లలోని 25 ఎకరాల మామిడి తోటలో పందేలు ఆడేందుకు వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. ముందుగా 20 మందితో పందేలు మొదలవగా వాట్సాప్‌ గ్రూప్‌లో చింతమనేని లొకేషన్‌ షేర్‌ చేయడంతో ఆ సంఖ్య 70కి చేరిందన్నారు.

గతంలో సినీ పరిశ్రమలో పనిచేసిన బర్ల శ్రీను అనే వ్యక్తి కూడా పందేల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చింతమనేని నేతృత్వంలో మరికొందరు ఒక ముఠాగా ఏర్పడి ఆ పందేలను నిర్వహిస్తున్నారని... పందేల నిర్వహణ ద్వారా రూ. లక్షల్లో ఆర్జిస్తున్నారని తేల్చారు. ఈ స్థావరంలో రూ. 500 పందెం కాసేవారికి ఒక బరి, రూ. వెయ్యి కాసేవారికి మరొకటి, రూ.2 వేలు కాసే వారికి మరొకటి.. ఇలా స్థాయిని బట్టి బరులను ఏర్పాటు చేశారు. ఈ బరులకు వెళ్లే దారులకు సంబంధించి ఫాంహౌస్‌లో సూచికలను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. 

భారీగా మద్యం... 
పోలీసులు దాడులు నిర్వహించిన చిన్నకంజర్లలో గుట్టలకొద్దీ ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. పందెం రాయుళ్లకు తాగినంత మద్యం కూడా నిర్వాహకులు సరఫరా చేసినట్టు గుర్తించారు. ఘటనా స్థలం వద్ద సీజ్‌ చేసిన వాహనాలను డీఎస్పీ భీంరెడ్డి, పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్‌ రెడ్డి, క్రైం సీఐ బీసన్న, ఎస్‌ఐలు సత్యనారాయణ, రామానాయుడు, ప్రసాద్‌రావు గురువారం తనిఖీ చేయగా అందులో 11 లిక్కర్‌ బాటిళ్లు, రెండు బీర్‌ కాటన్లు లభించాయి. మరోవైపు కోళ్ల పందేల నిర్వహణే కాకుండా ఈ స్థావరంలో పందెం కోళ్ల పెంపకం కూడా సాగుతున్నట్లు పోలీసుల దాడుల్లో వెల్లడైంది.

ఆంధ్రా ప్రాంతం నుంచి వాహనాల్లో కోళ్లను తీసుకొస్తున్నట్లు తేలడంతో కోళ్లను రవాణా చేసిన వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా అక్కడి, ఇక్కడి వారే.. ఈ కేసులో పట్టుబడిన నిందితులను హైదరాబాద్‌తోపాటు ఏపీలోని ఏలూరు, కృష్ణా, రాజమండ్రి, విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

కోడి పందేల స్థావరంలో రేవ్‌ పార్టీలు? 
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న కోళ్ల పందేల స్థావరంలో రేవ్‌ పార్టీలు కూడా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీకెండ్‌లో హైదరాబాద్‌ నగరానికి చెందిన పలువురు యువతీ యువకులను తీసుకొచ్చి ఇక్కడ రేవ్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే రేవ్‌ పార్టీలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని పోలీసులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: లక్షల్లో కోడిపందాలు బెట్టింగ్‌.. పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement