సాక్షి, అమరావతి/ గాందీనగర్ (విజయవాడ): కేంద్ర చిట్‌ఫండ్ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఈనాడు రామోజీరావుకు రాజ్యాంగం వర్తించదా? ఆయన చట్టాలకు అతీతుడా అని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.
‘చిట్‌ఫండ్స్ సంస్థలు, ఆర్థిక సంస్థల మోసాలు – నివారణ చర్యలు’ అనే అంశంపై ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ సంయుక్తంగా శుక్రవారం విజయవాడలో నిర్వహించిన అవగాహన సదస్సులో కొమ్మినేని శ్రీనివాసరావు ప్రసంగిస్తూ.. అన్ని రాష్ట్రాల్లో చిట్‌ఫండ్స్ సంస్థల మోసాలపై దర్యాప్తు సంస్థలు కఠిన చర్యలు తీసుకుంటుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను ఎందుకు ఉపేక్షించాలని ప్రశ్నించారు.
కేంద్ర చట్టాలు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు వర్తించవా అని సామాన్యులకు సందేహం కలుగుతుండటం న్యాయ వ్యవస్థకు కూడా అపప్రదను తెస్తుందని అన్నారు. రామోజీరావు తప్పు చేయలేదని భావిస్తే సీఐడీ దర్యాప్తునకు ఎందుకు సహకరించడంలేదని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ ఇలాంటి వాటిని నిశితంగా పరిశీలించి అడ్డుకట్ట వేయాలని కోరారు.
♦ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు మాట్లాడుతూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో సీఐడీ విచారణకు రామోజీరావు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రామోజీరావు ఈనాడు పత్రికను కవచంగా వాడుకుంటున్నారని విమర్శించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యాపార ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సహకార వ్యవస్థను కుట్రపూరితంగా దెబ్బతీశారని శారదాంబ మహిళా సహకార బ్యాంకు మాజీ చైర్‌పర్సన్ శిష్టా ధనలక్ష్మి చెప్పారు. ఆర్‌బీఐ ఆడిటింగ్ నిర్వహించే పటిష్ట వ్యవస్థ కలిగిన సహకార బ్యాంకులపై ఈనాడు పత్రిక ద్వారా దు్రష్పచారం చేయించారన్నారు.
♦ ప్రముఖ ఆడిటర్ మండలి హనుమంతరావు మాట్లాడుతూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తోందని విమర్శించారు. చట్టాల అమలుకు అథారిటీ పోలీసు శాఖే అని, ఆ శాఖ ఆధ్వర్యంలోని సీఐడీ దర్యాప్తు చేయకూడదని అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై మేధావులు ప్రజల్ని చైతన్య పరచాలన్నారు. కృష్ణా జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు సైకం భాస్కరరావు మాట్లాడుతూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేంద్రంగా నల్లధనం భారీగా చలామణి చేస్తున్నారని విమర్శించారు. నగదులోనే లావాదేవీలు నిర్వహిస్తూ ఆ పూర్తి మొత్తానికి కూడా రశీదులు ఇవ్వరని చెప్పారు.
♦ న్యాయవాది అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్గదర్శి తరహాలోనే విజయవాడలో 15 ఏళ్ల క్రితం అక్రమాలకు పాల్పడిన సిరి గోల్డ్ వంటి సంస్థలను మూసివేయించారన్నారు. అంతకంటే భారీ మోసాలకు పాల్పడుతున్న మార్గదర్శిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నామో విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సులో ఫోరం ఫర్ బెటర్ సొసైటీ కో కనీ్వనర్ ఎం.కోటేశ్వరరావు, పలువురు న్యాయవాదులు, ఆడిటర్లు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment