తెలీదు.. గుర్తు లేదు: సీఐడీ విచారణలో ఇదే ‘నారాయణ’ మంత్రం | CID Interrogates TDP Leader P Narayana In Amaravati Land Scam Case | Sakshi
Sakshi News home page

తెలీదు.. గుర్తు లేదు: సీఐడీ విచారణలో ఇదే ‘నారాయణ’ మంత్రం

Published Sat, Nov 19 2022 3:38 AM | Last Updated on Sat, Nov 19 2022 3:38 AM

CID Interrogates TDP Leader P Narayana In Amaravati Land Scam Case - Sakshi

హైదరాబాద్‌లో నారాయణ ఉంటున్న అపార్ట్‌మెంట్‌

సాక్షి, అమరావతి/హైదరాబాద్‌:  టీడీపీ  హయాంలో అమరావతిలో భూ కుంభకోణాల కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత పి.నారాయణను సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో శుక్రవారం విచారించారు. అమరావతిలో ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారులో టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతో పాటు మొత్తం 14 మందిపై కొన్ని నెలల క్రితం సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో నారాయణను ఆయన నివాసంలో విచారించేలా న్యాయస్థానం ఇటీవల అనుమతిచ్చింది.

దాంతో సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించింది. కాగా, సీఐడీ విచారణకు నారాయణ ఏమాత్రం సహకరించలేదని సమాచారం. సీఐడీ అధికారులు ఏం అడిగినా ‘తెలియదు.. గుర్తు లేదు’ అంటూ సమాధానం దాటవేసేందుకు యత్నించారని తెలిసింది. ఈ కేసులో నారాయణను మరికొన్నిసార్లు విచారించాలని సీఐడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నారాయణకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటీషన్‌ న్యాయస్థానంలో విచారణలో ఉంది.  

ఇటూ అటూ బాబు బినామీలే  
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో టీడీపీ పెద్దలు యథేచ్ఛగా సాగించిన భూ దోపిడీలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ కూడా ప్రధానమైంది. అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ.. అమరావతి మాస్టర్‌ ప్లాన్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ డిజైన్ల ముసుగులో భారీగా భూ దోపిడీకి పాల్పడ్డారన్నది సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు డిజైన్‌ను ముందుగానే మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చిన విషయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. ఆ రోడ్డు అలైన్‌మెంట్‌ను డిజైన్‌ చేసేందుకు ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించినట్టు కథ నడిపించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణలు తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్‌ సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు.

ముందుగానే ఖరారు చేసిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు డ్రాఫ్ట్‌ ప్లాన్‌ను చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించిన సమీక్షలో ఆమోదించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామని చేసిన పదవీ స్వీకార ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించి, వారి బినామీలకు అక్రమంగా భారీ ప్రయోజనం కలిగించారు. దాంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది. సీఆర్‌డీఏ ఫైళ్లు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు, ఇతర ఆధారాలను సీఐడీ విభాగం సేకరించి కేసు నమోదు చేసింది.

ఇదీ చదవండి: Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement