అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణలో భాగంగా తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను సీఐడీ ప్రశ్నిస్తోంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకూ లోకేష్‌ను సీఐడీ విచారించనుంది. ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పుపై లోకేష్‌ను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతినిచ్చింది. దీనిలో భాగంగా నిన్న(సోమవారం) మంగళగిరికి చేరుకున్నారు లోకేష్.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం మంగళవారం ఉదయం 10గంటలకు సీఐడీ ఎదుట నారా లోకేష్ హాజరు కావాల్సి ఉంది. కాగా, చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. న్యాయ నిపుణులతో చర్చ పేరిట ఢిల్లీకి నారా లోకేష్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే లోకేష్‌కు ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులిచ్చారు సీఐడీ అధికారులు. ఇన్నర్‌రింగ్ రోడ్ కేసులో ఏ-14గా ఉన్నారు లోకేష్
రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అక్రమాల కేసులో ఈనెల 10వ తేదీన సీఐడీ అధికారుల ఎదుట విచారణకు స్వయంగా హాజరు కావాలని మాజీ మంత్రి నారా లోకేశ్‌ను హైకోర్టు ఆదేశించింది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ లోకేష్‌ను విచారించవచ్చన్న హైకోర్టు.. మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఇవ్వాలని సూచించింది. విచారణ సమయంలో లోకేశ్ కనిపించేంత దూరం వరకు మాత్రమే న్యాయవాదిని అనుమతించాలని నిర్దేశించింది. విచారణకు వచ్చేటప్పుడు నిర్దిష్ట డాక్యుమెంట్లు తీసుకురావాలని లోకేష్‌ను ఒత్తిడి చేయబోమని సీఐడీ చెప్పిన విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. సీఆర్‌పీసీ సెక్షన్ 41 ఏ కింద నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరు కావాలని లోకేశ్‌కు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment