విశాఖ రుషికొండ భవనాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు
రాష్ట్రపతి భవన్‌కంటే అద్భుతంగా కట్టారు
దీనిపై ఎన్జీటీకి, హైకోర్టుకు, కేంద్రానికి అబద్ధాలు చెప్పారు
రూ.500 కోట్ల ప్రజాధనంతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారు
ప్రజలందరి అభిప్రాయాలతో ఏం చెయ్యాలో నిర్ణయిస్తాం
రోడ్ల మరమ్మతులకు రూ.860 కోట్లు
విశాఖ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్
గత ప్రభుత్వం నిర్వాకంతో రైల్వే జోన్ రాలేదు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అనకాపల్లి: విశాఖలో రుషికొండపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖ నిర్మించిన భవనాలు అద్భుతంగా ఉన్నాయని సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు. ఆయన శనివారం సాయంత్రం రుషికొండపై నిర్మించిన భవనాల్ని మంత్రులతో కలిసి పరిశీలించారు. భవనాల్లో ప్రతి గదినీ క్షుణ్ణంగా పరి శీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ.. కొండ చరియలు విరిగి పడకుండా జపాన్ సాంకేతికతను వినియోగించి, నాలుగు బ్లాక్‌లు అత్యా«ధునిక టెక్నాలజీతో నిర్మించారని కితాబిచ్చారు. వీటిని చూస్తే మైండ్ బ్లోయింగ్ అయిందన్నారు.
ఎన్నో దేశాల్లో ప్యాలెస్‌లు చూశానని, ఇలాంటి కట్టడాలు చూడలేదని తెలిపారు. రాష్ట్రపతి భవన్‌కంటే అద్భుతంగా కట్టారని, కారిడార్‌ని చూస్తే.. అమెరికాలోని వైట్‌హౌస్‌లో కూడా ఇలా ఉండదని అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మించిందని అన్నారు. సుమారు రూ.500 కోట్లు ప్రజాధనం వెచ్చించి విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని, ప్రజలంతా ఈ దారుణాన్ని చూశాక, అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని, ఈ భవనాన్ని ఏం చెయ్యాలో నిర్ణయిస్తామని చెప్పారు. రాజధాని నిర్మిస్తామంటూ విశాఖ ప్రజలను జగన్ మోసం చేశారన్నారు.
సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు
రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఉన్న రోడ్లన్నింటినీ సంక్రాంతినాటికి గుంతలు లేని రహదారులుగా చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన శనివారం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నలపాలెంలో రూ.860 కోట్లతో చేపట్టిన గుంతలు లేని రహదారుల కార్యక్రమం ‘మిషన్ ఫర్ పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ ఇన్ ఏపీ’ని ప్రారంభించారు. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.1.25 లక్షల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అదనంగా మరో రూ.50 వేల కోట్లతో భోగాపురం– మూలపేట, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, విజయవాడ ఈస్ట్ బైపాస్ వంటి రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. విశాఖ నుంచి అమరావతికు బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం ముడసర్లోవ వద్ద 52 ఎకరాలు కేటాయించామని తెలిపారు.
3 రోజుల్లో కొత్త ప్రణాళిక
విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో విశాఖ గ్రోత్ హబ్‌పై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెండు మూడేళ్లలో రాష్ట్ర భవిష్యత్తుని మార్చేలా 10 పాయింట్లతో కూడిన కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. దీనిద్వారా 2047 నాటికి రాష్ట్రం అన్నింటా ముందుంటుందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో ప్రత్యేక హబ్‌ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అనిత, కొల్లు రవీంద్ర, జనార్థన్‌రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, బాలవీరాంజనేయ స్వామి, దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment