న్యాయమే నెగ్గుతుంది: సీఎం జగన్‌ | CM Jagan Comments Over YSR Housing Scheme In Vizianagaram | Sakshi
Sakshi News home page

న్యాయమే నెగ్గుతుంది: సీఎం జగన్‌

Published Thu, Dec 31 2020 4:17 AM | Last Updated on Thu, Dec 31 2020 10:32 AM

CM Jagan Comments Over YSR Housing Scheme In Vizianagaram - Sakshi

విజయనగరం జిల్లా గుంకలాంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ సభలో ప్రసంగిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రతి కుటుంబం ఆలోచన చేయాలి...
ఏడాది గడిచిపోయింది. క్యాలెండర్‌ మారుతోంది. 2020 తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకునే సమయం వచ్చింది. ఈ ప్రభుత్వం మాకేమిచ్చింది? గత సర్కారుతో పోలిస్తే ఎంత మంచి జరిగిందని ప్రతి కుటుంబం ఆలోచన చేయాలి. మీ బిడ్డ మీకు మంచి చేశాడు. రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలో కూడా లేని విధంగా ఎన్నో చేశాడు. పేదలకు, రైతులకు, అక్క చెల్లెమ్మలకు, విద్యార్థులకు, అవ్వా తాతలకు, వందల సామాజిక వర్గాలకు కనీవిని ఎరగని విధంగా ఉపయోగపడ్డా. మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఈ మాటలు గర్వంగా చెబుతున్నా.

వీళ్లసలు మనుషులేనా..?
చంద్రబాబు, ఆయన సహచరులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ కోర్టుల్లో కేసులు వేయడం, స్టేలు తేవడంతో 30.75 లక్షల మందిలో 10% అంటే 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నాం. పట్టాల పంపిణీకి ముందురోజైన 24న కూడా కోర్టులో పిల్‌ వేశారంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో చూడండి. నా సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా స్టే తెచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుకుంటున్న వీరసలు మనుషులేనా? అనిపిస్తుంది. జాప్యం వల్ల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఇప్పుడు డి–పట్టాలతో ఇస్తున్నాం. న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే సర్వహక్కులతో అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తాం. 

అక్కచెల్లెమ్మలకు విలువైన ఆస్తి...
ఇదే లేఅవుట్‌లో మనం ఇస్తున్న భూమి విలువ రూ.3 లక్షలు ఉంటుందని కలెక్టర్‌ చెప్పారు. రేపు ఇక్కడ ఇల్లు కట్టి అభివృద్ధి చేస్తే కనీసం ఏడెనిమిది లక్షల రూపాయల ఆస్తి అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టినట్లు అవుతుంది. ఇంటికి నలుగురు చొప్పున లెక్కేసుకున్నా ఇక్కడ దాదాపు 45 వేల మంది ఉండబోతున్నారు. అంటే ఒక నగర పంచాయతీ ఏర్పడబోతోంది.
                        – సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, విజయనగరం: సంక్రాంతి ముందే వచ్చిందన్నట్లుగా పేదలకు విలువైన స్థిరాస్తిని అందించే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.  ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా విజయనగరం జిల్లా గుంకలాంలో 397.36 ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన సువిశాల లేఅవుట్‌ను బుధవారం ఆయన విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. విశాఖ నుంచి హెలికాఫ్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ లే అవుట్‌ అంతా చక్కర్లు కొట్టి తిలకించారు. అనంతరం వైఎస్సార్‌ జగనన్న కాలనీ లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. 12,301 మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు తొలిదశలో నిర్మించనున్న గృహ నిర్మాణ పనులను ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం జగన్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. 
భారీ ఎత్తున హాజరైన లబ్ధిదారులు 


అడుగడుగునా అడ్డంకులు
‘‘అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే డెమొగ్రఫిక్‌ ఇంబ్యాలెన్స్‌ వస్తుందంటూ చంద్రబాబు నాయుడు, ఆయన మనుషులు కోర్టుల్లో కేసులు వేస్తే స్టే ఇచ్చాయి. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తోంది. కులాల మధ్య విభేదాలు ఏమిటి? వారు దాన్ని చూపిస్తూ కేసులు వేయడం ఏమిటి? కోర్టులు స్టే ఇవ్వడం ఏమిటి? అని. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత దారుణమైన పరిస్థితులున్నాయో. ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ప్రకటించిన విశాఖలో 1.80 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు సేకరించాం.

ఆ భూములు ఇచ్చిన వారు ఏ అభ్యంతరం లేకుండా భూములు ఇచ్చారు. కానీ ఆ భూములతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి కోర్టులో కేసులు వేయడం, వాటిపై స్టే రావడం చాలా బాధనిపిస్తోంది. రాజమండ్రిలో భూములను ప్రభుత్వమే ప్రజల నుంచి కొనుగోలు చేసింది. అవి ఆవ భూములు కాకపోయినా ఎవరో కేసు వేయడం, స్టే రావడంతో 27 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు  అవరోధం ఏర్పడింది. 1978లో 44వ సవరణ ద్వారా ఆస్తిహక్కును చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. అంటే ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అది చట్టబద్దమైన హక్కు. అయినా కోర్టులకు వెళ్లడం, స్టేలు ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. బాధ కూడా అనిపిస్తోంది. ఇంత భారీగా ఇళ్ల నిర్మాణంతో ఎంతోమందికి పని దొరుకుతుంది. కనీసం 30 రకాల వృత్తుల వారికి ఉపాధి లభిస్తుంది. ముడి పదార్థాల వినియోగంతో ఆర్థికంగా కూడా బూస్ట్‌ వస్తుంది. త్వరలోనే మిగిలిపోయిన 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందిస్తాం. దేవుడి ఆశీర్వాదం, మీ చల్లని దీవెనలు నాకు తోడుగా ఉన్నాయి.
మహిళకు ఇంటి స్థలం పట్టా అందజేస్తున్న సీఎం జగన్‌ 

చెప్పిన దానికంటే మిన్నగా..
అక్క చెల్లెమ్మలకు 25 లక్షల ఇళ్లు కట్టించి వారి పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. అంతకంటే ఎక్కువగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలిస్తున్నాం. తొలివిడత 15.60 లక్షల ఇళ్లు మొదలు పెడుతున్నాం. రూ.7 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మిగిలిన 12.70 లక్షల ఇళ్లు వచ్చే ఏడాది ప్రారంభిస్తాం. . రాష్ట్రవ్యాప్తంగా 68,361 ఎకరాలలో చేసిన లేఅవుట్లు, ప్లాట్ల మార్కెట్‌ విలువ దాదాపు రూ.25,530 కోట్లు ఉంటుంది. 

నవరత్నాల సిరి
ధాన్యం బస్తాలపై నవరత్నాలను పేర్కొంటూ రూపొందించిన ఎడ్లబండి సభలో విశేషంగా ఆకట్టుకుంది. 

నాలుగు జిల్లాల జనాభా..
గత ప్రభుత్వం చివరి రెండేళ్లలో అక్కడో ఇక్కడో మొక్కుబడిగా ఇళ్లు కడితే మనం ఇవాళ ఏకంగా ఊళ్లు కడుతున్నాం. కొన్ని చోట్ల అవి పట్టణాలు కూడా. మన ప్రభుత్వం దాదాపు 31 లక్షల కుటుంబాలకు ఇళ్లు కట్టిస్తోంది. అంటే ఒక కుటుంబంలో సగటున నలుగురు ఉంటారనుకుంటే దాదాపు 1.24 కోట్ల మందికి ఇంటి సదుపాయం కలుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతోపాటు కడపను కూడా కలిపితేనేగానీ అంత మంది ఉండరు. ఏ రకంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారనేది మీదే నిర్ణయం. మూడు రకాల ఆప్షన్లలో మీకు నచ్చింది వలంటీర్‌కు చెప్పండి. 

బాబు స్కీమ్‌ కావాలన్నది ఒకే ఒక్కడు
దాదాపు 2.62 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తాం. 300 చదరపు అడుగుల ఫ్లాట్‌ ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరించి కేవలం ఒక్క రూపాయికే పేదలకు ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.43 లక్షల టిడ్కో ఇళ్లకు సంబంధించి ఏ స్కీమ్‌ కావాలని ఆప్షన్లు కోరితే కేవలం ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్‌ కావాలన్నారు. అది కూడా ఏదో పొరపాటున అయి ఉంటుంది. ఆయన కోరిక ప్రకారమే ఆయనకు ఆ స్కీమ్, మిగిలిన వారికి జగనన్న స్కీమ్‌ వర్తింపచేస్తాం. 365, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులకు కూడా రాయితీ ఇస్తున్నాం. వారు కట్టాల్సిన ముందస్తు వాటాలో 50 శాతం ప్రభుత్వం భరిస్తోంది. ఇలా అదనంగా రూ.4,287 కోట్ల భారం పడినా మీ బిడ్డగా చిరునవ్వుతో భరిస్తున్నాం’’

భారీగా హాజరైన లబ్ధిదారులు..
డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స, చెరుకువాడ, ముత్తంశెట్టి, వెలంపల్లి, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు బెల్లాన, మాధవి, సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు భారీగా లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విజయనగరానికి వరాలు
► రూ.180 కోట్లతో కురుపాం జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ పనులు త్వరలో ప్రారంభం.​​​​​​​
► సాలూరులో ట్రైబల్‌ వర్సిటీ పనులు త్వరలోనే మొదలు.
► విజయనగరంలో రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీ  నిర్మాణానికి జనవరిలో టెండర్లు. మార్చిలో పనులు.
► ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రెండో దశకు రూ.4,134 కోట్లకు టెండర్లు. పనులు పూర్తి చేసి కచ్చితంగా 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు.
► గజపతినగరం బ్రాంచి కాలువతో సహా తోటపల్లిలో అన్ని పనులను రూ.471 కోట్లతో ప్రాధాన్యతగా చేపట్టి రెండేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం.
► తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టుకు మరో రూ.620 కోట్లు. రెండేళ్లలో పనులు పూర్తి.
► వెంగళరాయ ప్రాజెక్టు కింద 5 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీళ్లు. ఏడాది లోపే పనులు పూర్తి.
► రాముడి వలస, లోచర్ల ఎత్తిపోతల పథకాల పనులు ఏడాదిలోగా పూర్తి.
► గుంకలాంలో అన్ని మౌలిక వసతులతో 18 నెలల్లోనే గృహ నిర్మాణాలు పూర్తి.

ఎవరిస్తారన్నా ఇలా..?
‘‘కూలి పనిచేసే నా భర్త చనిపోవడంతో టైలరింగ్‌ చేసుకుంటూ బతుకుతున్నా. నాకొక పాప ఉంది. సొంతిల్లు లేకపోవటంతో 20 ఏళ్లలో 12 సార్లు అద్దె ఇళ్లు మారాల్సి వచ్చింది. జగనన్న నా ఇంటి కలను నేరవేర్చటమే కాకుండా చేదోడు పథకం కింద రూ.18,750, వైఎస్సార్‌ ఆసరా రూ.4 వేలు, పింఛన్‌ రూ.2,250 చొప్పున నాకు సంవత్సరం మొత్తంలో రూ.60 వేలు పైన ఇచ్చారు. ఎవరిస్తారన్నా ఇలా? నాకు, నా కుమార్తెకు మీరున్నారన్న ధైర్యంతో బతుకుతాం’’    
 –కొమరగిరి రత్నకుమారి, పద్మావతినగర్, విజయనగరం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement