‘వైఎస్సార్ అవార్డుల’ సభలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
దశాబ్దాలుగా మన సంస్కృతి, సాంప్రదాయాలకు వారధులుగా నిలుస్తున్న వారిని ఈ అవార్డులతో సత్కరిస్తున్నాం. సమాజం కోసం శ్రమించిన మానవతామూర్తులు, మహనీయులను రాష్ట్ర అత్యున్నత అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. సామాన్యుల్లోని అసామాన్యులకు, మానవతామూర్తుల సేవలకు వందనంగా ‘వైఎస్సార్’ అవార్డులు నిలుస్తాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన వైఎస్సార్ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వకంగా అభినందనలు.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సమాజంలో మానవత్వపు పరిమళాలు, ఎల్లలు దాటిన కీర్తి పతాకాలు పురస్కారాల పండుగలో పులకించాయి. నిలువెత్తు వ్యక్తిత్వం, మహోన్నత కీర్తి శిఖరం ‘వైఎస్సార్’ పురస్కారాలతో సగౌరవంగా సత్కరించి ప్రభుత్వం తన వినమ్రత చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మానవతామూర్తులు, విశిష్ట వ్యక్తులను వరుసగా రెండో ఏడాది రాష్ట్ర అత్యున్నత పురస్కారం ‘‘వైఎస్సార్’’ అవార్డులతో ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.
వ్యక్తులుగా, సంస్థలుగా సమాజంలో గొప్ప పనులు చేస్తున్న ప్రతి ఒక్కరినీ గౌరవించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను నెలకొల్పింది. వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం విజయవాడలో నిర్వహించారు. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు, దివంగత వైఎస్సార్ విగ్రహాలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం 2022 సంవత్సరానికి గానూ వ్యవసాయం, కళలు–సంస్కృతి, సాహిత్యం, మహిళా – శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమల రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు మొత్తం 30 అవార్డులను గవర్నర్, ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. వీటిల్లో 20 వైఎస్సార్ జీవిత సాఫల్య, 10 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలున్నాయి. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. వైఎస్సార్ అవార్డులను నెలకొల్పడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం, అవార్డు గ్రహీతల గొప్పతనాన్ని వివరించారు.
వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు అందుకున్న వారితో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సీఎం మాతృమూర్తి వైఎస్ విజయమ్మ
పురస్కారం సాధించిన ‘దిశ’
వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేశారు. వ్యవసాయంలో 5, కళలు– సంస్కృతిలో 5, సాహిత్యంలో 3, మహిళా, శిశు సాధికారతలో 3, విద్యలో 4, జర్నలిజంలో 4, వైద్యంలో 5 అవార్డులు, పరిశ్రమల విభాగంలో ఒక అవార్డును అందజేశారు. వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డు కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ సాఫల్య అవార్డు కింద రూ.5 లక్షల నగదుతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.
కళలు, సంస్కృతి రంగంలో కళాతపస్వి కె.విశ్వనాథ్ తరఫున వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆయన తనయుడు కాశీనాథుని నాగేంద్రనాథ్ అందుకోగా వైద్య రంగంలో ప్రతాప్ సి.రెడ్డి తరఫున వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆయన కుమార్తె సంగీతారెడ్డి స్వీకరించారు. వ్యవసాయంలో వైఎస్సార్ సాఫల్య పురస్కారాన్ని కట్టమంచి బాలకృష్ణారెడ్డి తరఫున ఆయన కుటుంబ సభ్యులు అందుకున్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక ‘దిశ’ ద్వారా మహిళా రక్షణకు కృషి చేసిన ఐదుగురు పోలీసులకు ఉమ్మడిగా అవార్డులను బహూకరించారు.
హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు
కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానమ్, హోంమంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా, తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ప్రభుత్వ కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్), వైఎస్సార్ అవార్డుల కమిటీ కన్వీనర్ జీవీడీ కృష్ణ మోహన్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, సాధారణ పరిపాలన (రాజకీయ) కార్యదర్శి రేవు ముత్యాలరాజు, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మన కీర్తికి సత్కారం: సీఎం జగన్
దశాబ్దాలుగా మన సంస్కృతి, సాంప్రదాయాలకు వారధులుగా నిలుస్తున్న వారిని ఈ అవార్డులతో సత్కరిస్తున్నాం. సమాజం కోసం శ్రమించిన మానవతామూర్తులు, మహనీయులను రాష్ట్ర అత్యున్నత అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. సామాన్యుల్లోని అసామాన్యులకు, మానవతామూర్తుల సేవలకు వందనంగా ‘వైఎస్సార్’ అవార్డులు నిలుస్తాయి. తమ శ్రమ, స్వేదంతో రాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలను ఎక్కడా లేనివిధంగా ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్’ అవార్డులతో ప్రభుత్వం సత్కరిస్తోంది.
మహిళా రక్షణకు నిరంతరం పాటుపడే రక్షణ సారథులను, వెనుకబాటు, అణచివేత, పెత్తందారీ పోకడలపై ఎలుగెత్తిన సామాజిక ఉద్యమకారులను సవినయంగా గౌరవించుకుంటున్నాం. భిన్న కలాలు, గళాలు, పాత్రికేయులు, మన గడ్డపై పుట్టి వైద్య ఆరోగ్య రంగంలో ప్రపంచ కీర్తి గడించిన మహామహులు, అంతర్జాతీయంగా పేరొందిన మన పారిశ్రామిక దిగ్గజాలకు అవార్డులను అందజేస్తున్నాం.
వైఎస్సార్ ఆచరించిన విధానాల స్ఫూర్తితో..
వ్యక్తులుగా, సంస్థలుగా సమాజంలో గొప్ప పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. అందుకు సంకేతంగానే ఏటా నాన్న (దివంగత వైఎస్సార్) పేరుతో ఈ అవార్డులను అందజేస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న 5.3 ఏళ్ల స్వల్ప కాలంలోనే వైఎస్సార్ ఆచరించి చూపిన రైతు, మహిళా, నిరుపేద పక్షపాత విధానాలు, సామాజిక, ప్రాంతీయ న్యాయం, వైద్య రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, మనదైన తెలుగుతనం, మన కళలు, సాంప్రదాయాలు, శ్రమ, పరిశ్రమకు నిదర్శనంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నాం. ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన వైఎస్సార్ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వకంగా అభినందనలు తెలియచేస్తున్నా.
మహోన్నత వ్యక్తి వైఎస్సార్: గవర్నర్
సామాజిక సేవా స్ఫూర్తితో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్’ అవార్డులతో సత్కరించడం సంతోషంగా ఉందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు, వారి సమస్యలను దగ్గరగా చూసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు ప్రజా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు.
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా అవార్డులతో గౌరవించడం సముచితంగా ఉందన్నారు. రాష్ట్రం గొప్ప కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతకు నిలయంగా వెలుగొందుతోందన్నారు.
ఎందరో మహనీయుల త్యాగఫలాలతో ఏర్పడిన రాష్ట్రంలో సామాజిక స్పృహతో నిరంతరం సేవలందిస్తూ మన ఖ్యాతిని చాటిన వారిని అవార్డులకు ఎంపిక చేయడం మంచి సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. వైఎస్సార్ బాటలోనే ఆయన తనయుడు సీఎం జగన్ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రంగాలవారీగా అవార్డులు ప్రదానం ఇలా..
వ్యవసాయం (అందరికీ వైఎస్సార్ అఛీవ్‌మెంట్ అవార్డులు
1) ఆదివాసీ క్యాష్యూనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ
– సోడెం ముక్కయ్య – బుట్టాయగూడెం, ఏలూరు జిల్లా
2) కుశలవ కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ
– ఎ.గోపాలకృష్ణ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
3) అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్
– జయబ్బనాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా
4) అమృతఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ,
–కె.ఎల్.ఎన్.మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లా
5) కట్టమంచి బాలకృష్ణారెడ్డి, కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా
కళలు–సంస్కృతి
1) కళాతపస్వి కె.విశ్వనాథ్, సినీ దర్శకుడు (లైఫ్ టైం)
2) ఆర్.నారాయణమూర్తి, సినీ నటుడు, దర్శకుడు (లైఫ్ టైం)
3) సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీ (అచీవ్‌మెంట్)
4) పెడన కలంకారీ నేతన్న పిచుక శ్రీనివాస్ (అచీవ్‌మెంట్)
5) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఉదయగిరి ఉడెన్ కట్లరీ– షేక్ గౌసియా బేగం (అచీవ్‌మెంట్)
సాహిత్య సేవ (అందరికీ లైఫ్ టైం అవార్డులు
1) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ (మనోహర్ నాయుడు అవార్డు అందుకున్నారు)
2) ఎమెస్కో పబ్లిషింగ్ హౌస్ – సంస్థ సీఈవో విజయకుమార్ అవార్డును అందుకున్నారు
3) రాయలసీమ ప్రసిద్ధ రచయిత డాక్టర్ శాంతి నారాయణ
మహిళా సాధికారత–రక్షణ
1) ప్రజ్వల ఫౌండేషన్– సునీతా కృష్ణ్ణణ్ (లైఫ్ టైం)
2) శిరీషా రిహేబిలిటేషన్ సెంటర్, ఉయ్యూరు – ఎం.సోమేశ్వరరావు అవార్డును అందుకున్నారు (లైఫ్ టైం)
3) దిశ పోలీసింగ్– రవాడ జయంతి, ఎస్‌వీవీ లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రహ్మణ్యం, హజరత్తయ్య, పి.శ్రీనివాసులు (ఉమ్మడిగా వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డు)
విద్యా రంగం
1) మదనపల్లి – రిషీ వ్యాలీ విద్యా సంస్థ – అనంత జ్యోతి అవార్డును అందుకున్నారు (లైఫ్ టైం)
2) కావలి– జవహర్ భారతి విద్యా సంస్థ– వినయ్‌కుమార్‌రెడ్డి అవార్డును అందుకున్నారు (లైఫ్ టైం)
3) వ్యక్తిత్వ వికాస నిపుణుడు బి.వి.పట్టాభిరాం (లైఫ్ టైం)
4) బ్యాంకింగ్ రంగంలో వేలాది మందికి దారి చూపిన నంద్యాలకు చెందిన దస్తగిరిరెడ్డి (అచీవ్‌మెంట్)
జర్నలిజం (అందరికీ లైఫ్‌టైం అచీవ్‌మెంట్
1) భండారు శ్రీనివాసరావు
2) సతీష్ చందర్
3) మంగు రాజగోపాల్
4) ఎంఈవీ ప్రసాదరెడ్డి
వైద్య రంగం (అందరికీ లైఫ్ టైం అచీవ్‌మెంట్
1) డాక్టర్ బి.నాగేశ్వరరెడ్డి, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ
2) డాక్టర్ వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్ (హెపటైటిస్–బి వ్యాక్సిన్)
3) భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లా (కోవ్యాగ్జిన్) (కృష్ణా ఎల్లా అవార్డు అందుకున్నారు)
4) అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి (ఆయన తరఫున కుమార్తె సంగీతా అవార్డు అందుకున్నారు)
5) ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్– గుళ్లపల్లి నాగేశ్వరరావు
పారిశ్రామిక రంగం
అంతర్జాతీయ పారిశ్రామిక వేత్త గ్రంథి మల్లికార్జునరావు (లైఫ్ టైం)
Comments
Please login to add a commentAdd a comment