సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి (చెస్), జ్యోతి యర్రాజీ (అథ్లెట్), బి.అనూష (క్రికెట్) శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
ప్రపంచ క్రీడా వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతూ రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చారని సీఎం జగన్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు తాము గెలుచుకున్న పతకాలను సీఎంకు చూపించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేలా క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు.
ఏపీకి 11 పతకాలు..
ఆసియా క్రీడల్లో మన దేశం తొలిసారిగా 107 పతకాలను సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 13 మంది క్రీడాకారులు దేశం తరఫున వివిధ క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించారు. వీరిలో ఎనిమిది మంది క్రీడాకారులు 11 పతకాలను (5 గోల్డ్, 6 సిల్వర్) సాధించారు. రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీ ప్రకారం ఆసియా క్రీడల్లో పతకాల విజేతలకు ప్రభుత్వం రూ.2.70 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసింది.
వీటితో పాటు గతంలోని ప్రోత్సాహక బకాయిలతో కలిపి మొత్తం రూ.4.29 కోట్లు క్రీడాకారుల ఖాతాల్లో జమ చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్విసులు, క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఎండీ హెచ్.ఎం.ధ్యానచంద్ర, శాప్ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment