సాధికార 'బలగం' | CM Jagan is doing more good than BC declaration | Sakshi
Sakshi News home page

సాధికార 'బలగం'

Published Tue, Mar 5 2024 4:09 AM | Last Updated on Tue, Mar 5 2024 1:02 PM

CM Jagan is doing more good than BC declaration - Sakshi

బీసీ డిక్లరేషన్‌ కంటే మిన్నగా మేలు చేస్తున్న సీఎం జగన్‌ 

కేబినెట్‌ నుంచి స్థానిక సంస్థల దాకా సింహభాగం పదవులు వారికే

1.73 లక్షల కోట్ల మేర డీబీటీ, నాన్‌ డీబీటీతో బీసీలకు లబ్ధి

సామాజిక న్యాయంతోపాటు చదువుల్లోనూ బీసీ బిడ్డలకు ప్రోత్సాహం

విద్యా దీవెనతో పూర్తి ఫీజులు చెల్లిస్తూ ఉన్నత విద్యకు సంపూర్ణ తోడ్పాటు

భోజన ఖర్చుల కోసం విద్యార్థులు ఇబ్బంది పడకుండా ‘వసతి దీవెన’ 

నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియంతో తీర్చిదిద్దిన స్కూళ్లతో బీసీల విద్యా సాధికారతకు బాటలు.. సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దుతున్నారంటూ సామాజికవేత్తల ప్రశంసలు

బీసీ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కి మరోసారి చంద్రబాబు అదే పాట.. బీసీల కంచుకోటలు కుప్పం, మంగళగిరిలో తిష్ట వేసి ఆ వర్గాలకు వెన్నుపోటు

సాక్షి, అమరావతి: బీసీ డిక్లరేషన్‌ పేరుతో ఆ వర్గా­లకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అవహేళన చేస్తే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పిన దాని కంటే మిన్నగా మేలు చేస్తూ సామాజిక, రాజకీయ, విద్యా సాధికా­రతతో బలహీన వర్గాలను సమాజానికి వెన్నె­ముకగా తీర్చిదిద్ది సమున్నత గౌరవం కల్పిస్తున్నా­రని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు బీసీలను దారుణంగా వంచించిన చంద్రబాబు–పవన్‌ కళ్యాణ్‌ ద్వయం ఎన్నికల భయంతో మరోసారి బీసీ డిక్లరేషన్‌ అంటూ నాటకాలకు తెర తీసిందని స్పష్టం చేస్తున్నారు.

బలహీన వర్గాలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతనివ్వడంతోపాటు రాజ్యాధికారంలో సింహభాగం వాటా కల్పించడం, అమ్మ ఒడి, విద్యాదీవెన లాంటి పథకాల ద్వారా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ సాధికారత సాధించేలా ముఖ్యమంత్రి జగన్‌ బాటలు వేశారని విశ్లేషిస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం డీబీటీ రూపంలో గత 58 నెలల్లో రూ.2,58,855.97 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా ఇందులో బీసీ వర్గాలకే రూ.1,22,451.82 కోట్లు అందించడం ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.

డీబీటీ, నాన్‌ డీబీటీతో కలిపి పేదలకు మొత్తం రూ.4,38,102.91 కోట్లను అందించగా అందులో బీసీ వర్గాలకే రూ.1,73,109.21 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టి అమ్మ ఒడి, విద్యా కానుక ఇచ్చి పిల్లలను బడులకు పంపేలా ప్రోత్సహించడంతోపాటు విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా బీసీ బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న 93 శాతం మందికి విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుతుండగా వీరిలో బీసీ విద్యార్థులే అత్యధికంగా లబ్ధి పొందుతుండటం గమనార్హం.

గత సర్కారు ఎగ్గొట్టిన ఫీజుల బకాయిలు, మధ్యాహ్న భోజనం బిల్లులు కలిపి దాదాపు రూ.2,165 కోట్లను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమే చెల్లించి పిల్లల చదువులకు అండగా నిలిచింది. అటు చదువుల వ్యయాన్ని భరిస్తూనే మరోవైపు భోజనం, వసతి ఖర్చుల కోసం విద్యార్థులు ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకుంటోంది. నాడు – నేడుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు ధీటుగా అందుతున్న ఇంగ్లీషు మీడియం చదువులతో బీసీ విద్యార్థులు గరిష్టంగా ప్రయోజనం పొందగలుగుతున్నారు. సీబీఎస్‌ఈ సిలబస్, సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్, బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు, ఐఎఫ్‌పీలతో డిజిటల్‌ బోధన ద్వారా విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే నైపుణ్యాలతో రాణించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.   

రాజ్యాధికారంలో సమున్నత వాటా
► 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లను సాధించి 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలలో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాన్ని సాధించింది. 2019 మే 30న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్‌ 8న ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గాన్ని 2022 ఏప్రిల్‌ 11న పునర్‌వ్యవస్థీకరించారు. 25 మంది సభ్యులున్న మంత్రివర్గంలో ఏకంగా 11 మంది బీసీలకు సీఎం జగన్‌ స్థానం కల్పించారు. ఆ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడును డిప్యూటీ సీఎంగా నియమించారు. విద్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం లాంటి కీలక శాఖలను బీసీలకే అప్పగించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశం కల్పించారు. 2014–19 మధ్య చంద్రబాబు తన మంత్రివర్గంలో కేవలం 8 పదవులు మాత్రమే బీసీలకు ఇవ్వడం గమనార్హం.

► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా సీఎం జగన్‌ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారు. టీడీపీ హయాంలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు.

► సీఎం జగన్‌ శాసనమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 29 పదవులు (69 శాతం) ఇవ్వగా 2014–19 మధ్య చంద్రబాబు ఆ వర్గాలకు కేవలం 18 పదవులే (37 శాతం) ఇచ్చారు.

స్థానిక సంస్థల్లో పెద్దపీట
► స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు టీడీపీ నేతలను పురిగొల్పడంతో 24 శాతానికి తగ్గిపోయింది. అయితే రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్‌ దాన్ని ఆచరించి చూపి పదవులు ఇచ్చారు.
► జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంటే ఒక్క బీసీలకే 6 జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవులు (46 శాతం) కేటాయించారు. 
► మండల పరిషత్‌ ఎన్నికల్లో 648 మండలాలకుగాను వైఎస్సార్‌సీపీ 635 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే అందులో 67 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకే ఇచ్చారు. ఇందులో కూడా గరిష్టంగా బీసీలకే పదవులు దక్కాయి. 
► 14 కార్పొరేషన్‌లలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేయగా తొమ్మిది చోట్ల మేయర్‌ పదవులు(64 శాతం) బీసీలకు ఇచ్చారు.  
► 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకోగా చైర్‌పర్సన్‌ పదవులు బీసీలకు 44 (53 శాతం) ఇచ్చారు. 

చట్టం చేసి మరీ ‘నామినేటెడ్‌’
► దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వు చేస్తూ సీఎం జగన్‌ ఏకంగా చట్టం తెచ్చారు. 
► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. 
► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్‌లలో 137 చైర్మన్‌ పదవుల్లో 53 బీసీలకే ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి ఆ వర్గాల వారికే అవకాశం కల్పించారు.
► 137 కార్పొరేషన్‌లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్‌ పదవుల్లో 201 బీసీలకే  (42 శాతం) ఇచ్చారు.

బీసీలకు బాబు వెన్నుపోటు
చంద్రబాబు వలస వెళ్లి దశాబ్దాలుగా తిష్ట వేసిన కుప్పంలో బీసీల జనాభానే అత్యధికం. తన సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో 1983 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు 1989లో కుప్పం వలస వెళ్లి రాజకీయంగా బీసీలకు అన్యాయం చేశారు. తండ్రి బాటలోనే నారా లోకేష్‌ కూడా నడుస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీలే అధికం. 2019లో బీసీ నేతకు వెన్నుపోటు పొడిచి ఆ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేష్‌ దారుణ పరాజయం పాలయ్యారు. 
 
వెన్నుదన్నుగా నిలిచిన సీఎం జగన్‌
బీసీ డిక్లరేషన్‌లో చెప్పింది చెప్పినట్లుగా అమలు చేసి చూపించిన సీఎం జగన్‌ బలహీన వర్గాలను వెన్నుముఖ వర్గాలుగా తీర్చిదిద్దారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లపై టీడీపీ కోర్టుకెక్కితే అంతకంటే ఎక్కువ పదవులు దక్కేలా చేసిన సీఎం జగన్‌ బీసీల పక్షపాతిగా మన్ననలు అందుకున్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌తోపాటు డైరెక్టరేట్, ఆర్థిక సహకార సంస్థను కూడా ఏర్పాటు చేశారు. 139 కులాలకు 56 కార్పొరేషన్‌లు నియమించి బీసీల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దశాబ్దాల తరబడి ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో ప్రైవేట్‌ బిల్లు పెట్టించి సీఎం జగన్‌ చరిత్ర సృష్టించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని కోరారు. కుల గణన కోసం బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో సీఎం జగన్‌ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు.

కుల గణనపై చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేస్తే సీఎం జగన్‌ చిత్తశుద్ధితో కుల గణన చేపట్టడం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ అడగకుండానే ‘వైఎస్సార్‌ గీత కార్మిక భరోసా’ పథకాన్ని తెచ్చి బీమా వర్తింప చేయడంతో గీత కార్మికులకు నిజమైన భరోసా లభించింది. చేనేత కార్మికుల పెన్షన్‌ రూ.వెయ్యి చేస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు లబ్ధిదారులను కుదించి మోసం చేశారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేతన్న నేస్తంతో ఏటా రూ.24 వేలు సాయంతోపాటు పెన్షన్‌ వయో పరిమితిని కుదించి అర్హులందరికీ రూ.3 వేలు పెన్షన్‌ అందిస్తూ చేనేత కుటుంబాలను ఆదుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement