సాక్షి, గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన దాతృత్వాన్ని కొనసాగిస్తూ గుంటూరులో కొందరు పేదలకు వరాల జల్లు కురిపించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ తల్లి శివపార్వతి మరణించడంతో గిరిధర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గుంటూరులోని శ్యామలా నగర్ వచ్చారు. పరామర్శ అనంతరం తిరుగు ప్రయాణంలో కొందరు తమ గోడు వెళ్లబోసుకుని సాయం చేయమని వేడుకున్నారు. వారందరినీ పోలీస్ పరేడ్ మైదానంలోని హెలిప్యాడ్ వద్దకు తీసుకురమ్మని అధికారులకు ఆదేశించారు.
అక్కడికక్కడే ఆదేశాలు
అధికారుల సాయంతో హెలిప్యాడ్‌కు చేరుకున్న వి.మరియమ్మ, కోటేశ్వరరావు దంపతులు తమ గోడును వివరిస్తూ.. తమ రెండో కుమారుడు నవీన్ థలసీమియా వ్యాధితో బాధపడుతున్నాడని, దీనికి రూ.26 లక్షల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. ఇంటిస్థలం కూడా లేదని వాపోయారు. వెంటనే సర్జరీకి ఏర్పాటు చేసి.. ఇంటి పట్టా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. జె.బాబు, శివ లక్ష్మి దంపతులు మాట్లాడుతూ మునిసిపాలిటీలో ఉద్యోగం తీసేశారని, ఆ ఉద్యోగం తమ కుమారుడికి ఇప్పించాలని వేడుకున్నారు.
వెంటనే సీఎం జగన్ అందుకు తగిన ఆదేశాలిచ్చారు. బి.పేరిరెడ్డి అనే వ్యక్తి గోడు చెప్పుకుంటూ.. గతంలో కిడ్నీ వ్యాధికి సర్జరీ చేయించుకున్నానని కొంత ఆర్థిక సాయం చే యాలని కోరగా.. ఆయనకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని, వైద్యం అవసరమైతే తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కాగా, కె.పుష్ప జైన్ మాట్లాడుతూ తమ జైన్ సొసైటీకి కల్యాణ మండపం ఏర్పాటు చేయమని కోరగా పరిశీలించి తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు. కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆగమేఘాల మీద సీఎం ఆదేశాలను సాయంత్రానికల్లా అమలు చేశారు. అప్పటికప్పుడే తమ కోర్కెలను మన్నించి న్యాయం చేయడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
పేదల పక్షాన ప్రభుత్వం: కలెక్టర్
గుంటూరులోని కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిష్టినా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడి, జేసీ జి.రాజకుమారి బాధితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి హామీలను నెరవేర్చడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేయడం ఆనందంగా ఉందన్నారు.
చదవండి: ట్విట్టర్‌ను ఊపేస్తున్న వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సైన్యం..
Comments
Please login to add a commentAdd a comment