సాక్షి, అమరావతి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇటీవల 461 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దానికి అదనంగా 496 పోస్టులను కలిపి మొత్తం 957 పోస్టులతో సవరించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
శుక్రవారం నుంచి దరఖాస్తు ఫారాలను http://cfw.ap.nic.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ నెల ఎనిమిదో తేదీ వరకూ దరఖాస్తు ఫారాలు వెబ్‌సైట్లో ఉంటాయి. వీటిని డౌన్లోడ్ చేసుకుని భర్తీ చేసిన దరఖాస్తులను సంబంధిత రీజినల్ డైరెక్టర్ కార్యాలయాల్లో ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది. జీఎన్‌ఎం (జనరల్ నర్సింగ్ మిడ్ వైఫర్)/ బీఎస్సీ (నర్సింగ్) కోర్సులు పూర్తి చేసి 42 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు 10 ఏళ్ల పాటు వయో పరిమితిలో సడలింపునిచ్చారు. దరఖాస్తు రుసుమును ఓసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ. 300గా నిర్ణయించారు. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా రూపొందించే మెరిట్ లిస్ట్‌ను వచ్చే ఏడాది ఆగస్టు వరకు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరులకు కొరత లేకుండా ఉండేందుకు గత మూడున్నరేళ్ల కాలంలో వైద్య ఆరోగ్యశాఖలో 46 వేలకు పైగా పోస్టులను ఈ ప్రభుత్వం భర్తీ చేయడం గమనార్హం.
AP Staff Nurse Recruitment: 957 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Published Sat, Dec 3 2022 3:36 AM | Last Updated on Sat, Dec 3 2022 9:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment