క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా సెల్ టవర్లను ప్రారంభిస్తున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగేళ్లుగా గిరిజన సంక్షేమాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేని విధంగా విశేషంగా కృషి చేస్తోంది. గిరిజనుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేకంగా దృష్టి సారించింది. కనీస మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, రహదారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వీటన్నింటికీ తోడు మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను అందుబాటులోకి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.
తద్వారా ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను లబ్ధిదారుల ముంగిటకు మరింత త్వరితగతిన తీసుకెళ్లడానికి నాంది పలికింది. సమగ్ర గిరిజనాభివృద్ధే లక్ష్యంగా నాలుగేళ్లుగా చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆయా ప్రాంతాల్లో డిజిటల్ సేవలు విస్తరింప చేయాలన్న తాపత్రయంతో ప్రత్యేకంగా దృష్టి సారించారు. సెల్ ఫోన్ సేవలు, ఇంటర్‌నెట్ కనెక్టివిటీ ద్వారా ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్‌లో మెరుగైన, నాణ్యతతో కూడిన సేవలు అందుతాయని భావించారు.
ప్రధానంగా పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని విశ్వసించారు. ఇందులో భాగంగా మారుమూల ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటుకు ముమ్మరంగా కసరత్తు చేశారు. ఇందుకు గిరిజన, అటవీ ప్రాంతాల్లో ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో స్వయంగా మాట్లాడారు. మార్గదర్శకాలను సులభతరం చేసుకుని.. సెల్‌టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని రాష్ట్రంలో వేగవంతం చేశారు. అవరసమైన మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయించారు.
మొత్తంగా రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌ఓఎఫ్) ద్వారా సెల్ టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మొత్తం ప్రాజెక్టు కింద కొత్తగా 2,849 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు గాను ఇప్పటికే 2,463 చోట్ల స్థలాలు అప్పగించింది. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించింది.
ఆవాసాలన్నింటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలందించేందుకు ఒకేసారి 100 జియో టవర్స్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ నాటికి రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని ఆవాసాలన్నింటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ రానుందని తెలిపారు. తద్వారా ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ మరింతగా కనెక్టివిటీ లభించడంతో పాటు మెరుగైన, నాణ్యతతో కూడిన సేవలు అందుతాయన్నారు.
సెల్ టవర్స్ ఏర్పాటు ద్వారా రేషన్ పంపిణీ, ఇ–క్రాప్ బుకింగ్ సులభమవుతుందని.. ఆయా ప్రాంతాలకు ఆర్థికంగా కూడా మరింత లబ్ధి కలగనుందని చెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలను అత్యంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా అక్కచెల్లెమ్మలకు మరింత సమర్థవంతంగా అందించగలుగుతామన్నారు. ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సెల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగానికి, జియో, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ప్రారంభమైన సెల్ టవర్ల ద్వారా 209 గ్రామాలకు 4జీ సేవలు అందనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైఎస్సార్ జిల్లాలో 2 టవర్లను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో వీటిని 5జీ సేవలుగా అప్‌గ్రేడ్ చేయనుంది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన సెల్ టవర్ల పరిధిలో 150 ఎంబీపీఎస్ డౌన్లోడ్, 50 ఎంబీపీఎస్ అప్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.
గిరిజన సంక్షేమాభివృద్ధికి పెద్దపీట
► గిరిజనుల సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం 2022 డిసెంబర్ నాటికి రూ.17,651 కోట్లు ఖర్చు చేసింది. గిరిజనులు ధైర్యంగా పంటలు పండించుకునేందుకు వీలుగా చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా 4.88 లక్షల ఎకరాలకు 2.49 లక్షల అటవీ హక్కు పత్రాలు, డికేటీ పట్టాలు అర్హులైన గిరిజనులకు పంపిణీ చేశారు.
► నాడు–నేడులో భాగంగా గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల రూపురేఖలు మార్చింది. గిరిజనుల కోసం ప్రత్యేకించి పాడేరు, పార్వతీపురంలో మెడికల్ కళాశాలలు, కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల, సీతంపేట, పార్వతిపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు.. విజయనగరం వద్ద గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా విద్యకు కేటాయించిన బడ్జెట్‌లో గిరిజనుల విద్య కోసం 37.66 శాతం కేటాయిస్తూ వస్తోంది.
► ఈ ఒక్క ఏడాదే రూ.4,123.39 కోట్ల బడ్జెట్ కేటాయించింది. గిరిజన ఉప ప్రణాళిక కోసం రూ.6,929.09 కోట్లు కేటాయించింది. విశాఖ జిల్లా చింతపల్లి మండలం రాజంగిలో రూ.35 కోట్లతో గిరిజన స్వాతంత్య్ర సమర యోధుల మ్యూజియం నిర్మిస్తోంది. మారుమూల గ్రామాలకు వందల కిలోమీటర్ల మేర రహదారి సౌకర్యం కల్పించింది.
గిరిజనులతో ముచ్చటించిన సీఎం
అల్లూరి సీతారామరాజు జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సికలబాయి, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కుంటంబడేవలస గ్రామాల్లో టవర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయా గ్రామాల్లో వచ్చిన సెల్ టవర్ నెట్‌వర్క్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ఎంపీ గొడ్డేటి మాధవి, అరుకు, పాడేరు, కురుపాం ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, కొట్టుగుళ్లు భాగ్యలక్ష్మి, పుష్ప శ్రీవాణి, కలెక్టర్లు సుమిత్ కుమార్, నిషాంత్ కుమార్, పాడేరు ఐటీడీఏ పీఓ వి.అభిషేక్, ప్రజలు.. సీఎంతో మాట్లాడారు. వారందరినీ సీఎం ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఐటీ సెక్రటరీ కోన శశిధర్, రిలయెన్స్ జియో ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ రోజు పెద్ద పండుగ
మీ (సీఎం) చొరవ వల్ల గిరిజన ప్రాంతాలు సైతం అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. వంద సెల్ టవర్లు ప్రారంభించడం మా మారుమూల ప్రాంతాల్లో పెద్ద పండుగగా భావిస్తున్నాం. ఈ టవర్ల వల్ల మాకు వేగవంతమైన సేవలు అందుతాయి. 104, 108, ఆర్బీకే వ్యవస్థల సేవలను చక్కగా వినియోగించుకోవడానికి దోహద పడుతుంది. గత టీడీపీ ప్రభుత్వం మా గిరిజన ప్రాంతాలను అంధకారంలోకి నెట్టివేసింది. ఇప్పుడు మీ వల్ల మా గిరిజనులు అభివృద్ధికి నోచుకుంటున్నారు. అందరికీ ఆధార్ కార్డులు కూడా ఇస్తుండడంతో ప్రభుత్వ సేవలు ప్రతి గడపకూ చేరుతున్నాయి.
– చెట్టి ఫాల్గున, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, అరకు
మీ వల్లే గిరిజనుల్లో వెలుగు
ఎక్కడో మారుమూల ఒడిశాకు అతి సమీపంలో ఉన్న గ్రామాలకు సైతం ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందడం చాలా సంతోషకరం. మా ఐటీడీఏ డివిజన్‌లోనే 86 టవర్లు ప్రారంభించడం ఒక చరిత్ర. మా ప్రాంత ప్రజలందరి తరఫునా మీకు పాదాభివందనం. గతంలో సిగ్నల్స్ లేక ఆఫ్‌లైన్‌లో పని చేయలేక.. ఆన్‌లైన్ ఉన్నచోట డేటా డౌన్‌లోడ్ చేయాల్సి వచ్చేది.
గ్రామస్తుల సమస్యలు ఎవరికైనా అత్యవసరంగా చెప్పాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆ సమస్య తప్పింది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధితో పాటు రోడ్లు.. సెల్ కనెక్టివిటీ కల్పించడం శుభ పరిణామం. గత పాలకులు మా ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తే.. మీరు (సీఎం) పారదర్శకంగా చక్కటి పాలన అందిస్తున్నారు. గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపిన మీ మేలు ఎవరూ మరచిపోరు.
– కె.భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పాడేరు
గిరిజనుల పక్షపాత సీఎం
అన్నా.. మీరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రతి ఆలోచనా, ప్రతి పథకం మా గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి దోహదపడ్డాయి. మీరు గిరిజన పక్షపాత ముఖ్యమంత్రి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మా గిరిజన ప్రాంతాల స్కూల్స్, ఆస్పత్రుల రూపురేఖలు మార్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మాకు అందించారు. నా కుటుంబ సభ్యులంటూ మమ్మల్ని అభివర్ణించిన నాయకుడు మీరే. మీరు మా గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
– పాముల పుష్ప శ్రీవాణి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, కురుపాం
కష్టాలు తప్పించారు
సెల్ టవర్ అందుబాటులోకి రావడం వల్ల భీమవరం సచివాలయ పరిధిలో 16 గ్రామాలకు నెట్‌వర్క్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వలంటీర్లు సకాలంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు అవకాశం ఏర్పడింది. సెల్ నెట్‌వర్క్ లేకపోవడం వల్ల గతంలో వలంటీర్లు సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని హుకుంపేట వెళ్లి డేటా ఎంట్రీ చేసేవారు.
ఆ తర్వాతే పింఛన్లు పంపిణీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు భీమవరం, అండిభ పంచాయతీల పరిధిలో నాలుగు టవర్లు నిర్మించడం ద్వారా ఆ ఇక్కట్లు తప్పాయి. తద్వారా పింఛను, వైఎస్సార్ బీమా, ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీ, మ్యుటేషన్ల ప్రక్రియ వేగవంతం అవుతుంది.
– శాంతికుమారి, హార్టికల్చర్ అసిస్టెంట్, భీమవరం, హుకుంపేట్ మండలం, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా
ఇప్పుడు ఫోన్ చేస్తే 108 వస్తుంది
అన్నా.. మేం నేరుగా మీతో మాట్లాడుతున్నామంటే సెల్ టవరే కారణ. మాకు గతంలో రోడ్లు, కరెంట్, సెల్ టవర్ సౌకర్యాలు లేవు. అవన్నీ మీరు ఇచ్చారు. చాలా సంతోషం. గతంలో గర్భవతులను ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే డోలీలే దిక్కు. కానీ ఇప్పుడు మేము 108కు ఫోన్ చేస్తే మా ప్రాంతానికీ వెంటనే వస్తుంది. మాకు వైద్యం అందుతుంది. మేం మీకు రుణపడి ఉంటాం.
– పాలక సంధ్య, పెదఖర్జ, గుమ్మలక్ష్మీపురం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment