సాక్షి, అమరావతి: వివిధ సమస్యలతో ప్రజల నుంచి అందే వినతిపత్రాల పరిష్కారానికి మరింత మెరుగైన వ్యవస్థను అమల్లోకి తేవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా స్పందనకు మరింత మెరుగైన రూపం కల్పించడంపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంవో, ఉన్నతస్థాయి అధికారులు దీన్ని పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు.
స్పందన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచి వ్యక్తిగత సమస్యలను సైతం పరిష్కరించే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ప్రజలు తమ ఇబ్బందులను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చే కార్యక్రమాన్ని చేపట్టే అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనికి రకరకాల పేర్లు ప్రతిపాదనకు రాగా ‘‘జగనన్నకు చెబుదాం..’’ అనే పేరు కూడా పరిశీలనకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
ప్రజలకు అండగా నిలిచాం
ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తేవడంతోపాటు స్పందన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. వ్యక్తుల సమస్యలతోపాటు సామాజిక సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాం. ఒక నిర్ణీత సమయం నిర్దేశించుకుని శరవేగంగా పరిష్కరిస్తూ ప్రజలకు అండగా నిలిచాం.
స్పందన అమలు చేస్తూనే ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దృష్టి పెట్టాం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాటిని పరిష్కరించేందుకు నిధులు కూడా కేటాయించాం. ఇప్పుడు ఇంకా ఏమైనా సమస్యలు మిగిలిపోయి ఉన్నాయా? అన్న దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఇతర రాష్ట్రాల్లో విధానాలనూ పరిశీలిద్దాం
వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను కూడా పరిశీలించి స్వీకరించదగ్గవి ఉంటే తీసుకోవాలి. పథకాలు కావచ్చు.. రెవెన్యూ రికార్డులకు సంబంధించిన అంశాలు కావచ్చు.. ఇలా ఏవైనా కావచ్చు. ఏ ఒక్కరూ అర్హులు మిగిలిపోకూడదు, సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిపోరాదు అన్నదే దీని ఉద్దేశం. ఈ విధానం ఎలా ఉండాలి? ఎలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపాలి? అనే అంశాలపై మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలి.
సీఎంవో, ఇతర ఉన్నతాధికారులతో కూడిన యంత్రాంగం ప్రజల ఫిర్యాదులు, వినతులకు పరిష్కారాలు చూపడమే దీని ఉద్దేశం. స్పందన కన్నా మరింత మెరుగ్గా, సమర్థంగా నిర్వహించాలన్నదే లక్ష్యం. అధికారులంతా కలసి ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేయాలి. స్పందన కార్యక్రమాన్ని సూక్ష్మ స్థాయిలో పరిశీలించి మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలి.
అంకితభావానికి నిదర్శనంగా నిలవాలి
సమస్యల పరిష్కారంలో మనం అంకితభావానికి నిదర్శనంగా నిలవాలి. ప్రజా సమస్యలను తీర్చాలన్నదే మన ఉద్దేశం. అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత నిజాయితీగా, అంకిత భావంతో, కృత నిశ్చయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశాం. అంతా కలసికట్టుగా గతంలో ఎన్నడూలేని రీతిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు అమలు చేస్తున్న కార్యక్రమాల్లో వృత్తి నైపుణ్యాలు పెంచడం, నిర్మాణాత్మక రీతిలో వ్యవహరించడంపై మనం దృష్టి సారించాలి. వినతిపత్రాల పరిష్కారంలో ప్రజల సంతృప్తికి పెద్దపీట వేయాలి.
డిజిటల్ హెల్త్‌లో ఏపీకి రెండు అవార్డులు
అభినందించిన సీఎం వైఎస్ జగన్
డిజిటల్ హెల్త్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి రెండు గ్లోబల్ అవార్డులు దక్కాయి. రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్ధికి ప్రవేశపెట్టిన సంస్కరణలు, అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ రెండు గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు రాష్ట్రాన్ని వరించాయి.
ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్–2022లో వీటిని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అందుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సోమవారం మంత్రి విడదల రజిని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు కలిసి అవార్డు వివరాలు వివరించారు. వారిని సీఎం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment