High-level Review
-
‘స్పందన’.. ఇంకా మెరుగ్గా..
సాక్షి, అమరావతి: వివిధ సమస్యలతో ప్రజల నుంచి అందే వినతిపత్రాల పరిష్కారానికి మరింత మెరుగైన వ్యవస్థను అమల్లోకి తేవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా స్పందనకు మరింత మెరుగైన రూపం కల్పించడంపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంవో, ఉన్నతస్థాయి అధికారులు దీన్ని పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. స్పందన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచి వ్యక్తిగత సమస్యలను సైతం పరిష్కరించే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ప్రజలు తమ ఇబ్బందులను నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చే కార్యక్రమాన్ని చేపట్టే అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనికి రకరకాల పేర్లు ప్రతిపాదనకు రాగా ‘‘జగనన్నకు చెబుదాం..’’ అనే పేరు కూడా పరిశీలనకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ప్రజలకు అండగా నిలిచాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తేవడంతోపాటు స్పందన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. వ్యక్తుల సమస్యలతోపాటు సామాజిక సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాం. ఒక నిర్ణీత సమయం నిర్దేశించుకుని శరవేగంగా పరిష్కరిస్తూ ప్రజలకు అండగా నిలిచాం. స్పందన అమలు చేస్తూనే ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దృష్టి పెట్టాం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాటిని పరిష్కరించేందుకు నిధులు కూడా కేటాయించాం. ఇప్పుడు ఇంకా ఏమైనా సమస్యలు మిగిలిపోయి ఉన్నాయా? అన్న దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ట్రాల్లో విధానాలనూ పరిశీలిద్దాం వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను కూడా పరిశీలించి స్వీకరించదగ్గవి ఉంటే తీసుకోవాలి. పథకాలు కావచ్చు.. రెవెన్యూ రికార్డులకు సంబంధించిన అంశాలు కావచ్చు.. ఇలా ఏవైనా కావచ్చు. ఏ ఒక్కరూ అర్హులు మిగిలిపోకూడదు, సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిపోరాదు అన్నదే దీని ఉద్దేశం. ఈ విధానం ఎలా ఉండాలి? ఎలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపాలి? అనే అంశాలపై మార్గదర్శక ప్రణాళిక రూపొందించాలి. సీఎంవో, ఇతర ఉన్నతాధికారులతో కూడిన యంత్రాంగం ప్రజల ఫిర్యాదులు, వినతులకు పరిష్కారాలు చూపడమే దీని ఉద్దేశం. స్పందన కన్నా మరింత మెరుగ్గా, సమర్థంగా నిర్వహించాలన్నదే లక్ష్యం. అధికారులంతా కలసి ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేయాలి. స్పందన కార్యక్రమాన్ని సూక్ష్మ స్థాయిలో పరిశీలించి మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలి. అంకితభావానికి నిదర్శనంగా నిలవాలి సమస్యల పరిష్కారంలో మనం అంకితభావానికి నిదర్శనంగా నిలవాలి. ప్రజా సమస్యలను తీర్చాలన్నదే మన ఉద్దేశం. అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత నిజాయితీగా, అంకిత భావంతో, కృత నిశ్చయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశాం. అంతా కలసికట్టుగా గతంలో ఎన్నడూలేని రీతిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు అమలు చేస్తున్న కార్యక్రమాల్లో వృత్తి నైపుణ్యాలు పెంచడం, నిర్మాణాత్మక రీతిలో వ్యవహరించడంపై మనం దృష్టి సారించాలి. వినతిపత్రాల పరిష్కారంలో ప్రజల సంతృప్తికి పెద్దపీట వేయాలి. డిజిటల్ హెల్త్‌లో ఏపీకి రెండు అవార్డులు అభినందించిన సీఎం వైఎస్ జగన్ డిజిటల్ హెల్త్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి రెండు గ్లోబల్ అవార్డులు దక్కాయి. రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్ధికి ప్రవేశపెట్టిన సంస్కరణలు, అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ రెండు గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు రాష్ట్రాన్ని వరించాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్–2022లో వీటిని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అందుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సోమవారం మంత్రి విడదల రజిని, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు కలిసి అవార్డు వివరాలు వివరించారు. వారిని సీఎం అభినందించారు. -
104 తక్షణం స్పందించాలి
సాక్షి, అమరావతి: కోవిడ్ బాధితులకు తక్షణం సేవలందించేలా 104 కాల్ సెంటర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఈ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 104 కాల్ సెంటర్ పనితీరులో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేశారు. అ«ధికారులు ప్రతిరోజూ మాక్ కాల్స్ చేసి ఆ వ్యవస్థ పని తీరును పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ఆస్పత్రిలోనూ ఆరోగ్య మిత్ర ఉండాలని, ఎవరైనా సమస్య ఎదుర్కొంటే ఫిర్యాదు చేసేందుకు ప్రతి ఆస్పత్రిలోనూ నంబర్ ప్రదర్శించాలని ఆదేశించారు. కోవిడ్–19 నియంత్రణ, నివారణ, చికిత్సలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్ స్పెషల్ ఆఫీసర్లు, టాస్క్‌ఫోర్స్ బృందంతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇవీ.. ఆస్పత్రుల ఆవరణల్లో జర్మన్ హేంగర్స్ కోవిడ్ రోగుల రద్దీ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అవసరాన్ని బట్టి ఆస్పత్రుల ఆవరణల్లోనే తాత్కాలికంగా జర్మన్ హేంగర్స్‌ను ఏర్పాటు చేసి అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలి. దీనివల్ల పేషెంట్లు బయట వేచిచూసే పరిస్థితులు తొలగిపోయి సత్వరమే వైద్యం అందుతుంది. వాటికి ఆక్సిజన్ సదుపాయం కల్పించటాన్ని పరిశీలించాలి. సమీపంలోనే డాక్టర్లు ఉంటారు కాబట్టి పర్యవేక్షించేందుకు వీలుగా ఉంటుంది. 104కు కాల్ చేసిన వెంటనే కచ్చితంగా స్పందన ఉండాలని, అవసరమైన వారికి వెంటనే బెడ్ కల్పించాల్సిందేనని ఆదేశించారు. 104కు కాల్ చేస్తే ఫోన్ కలవలేదని, స్పందన లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. 104కు కాల్ చేసిన తర్వాత కోవిడ్ బాధితులకు కచ్చితంగా సహాయం అందాల్సిందేనని స్పష్టం చేశారు. బెడ్ అవసరం లేదనుకుంటే పరిస్థితిని బట్టి కోవిడ్ కేర్ సెంటర్లకు పంపించాలని సూచించారు. 3 గంటల్లో మందుల కిట్లు ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వస్తే కోవిడ్ లక్షణంగా భావించి వెంటనే మందులు ఇచ్చేలా చూడాలని వైద్య నిపుణులు పేర్కొన్నారని, ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంట్లో చికిత్స పొందాల్సిన రోగికి 3 గంటల్లోగా మందుల కిట్ పంపాలని ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు కమ్యూనిటీ ఆస్పత్రుల నుంచి బోధనాసుపత్రుల వరకు పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసి సత్వరమే వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ నిరోధించేందుకు గట్టి చర్యలు రెమ్‌డెసివెర్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారు. దీనిపై ఆడిట్ తప్పనిసరిగా ఉండాలని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగంపై ఆడిటింగ్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో అవసరమైన ఇంజక్షన్లు రోగులకు అందుబాటులో ఉంచాలని, ఇంజక్షన్ల పేరిట దోచుకునే వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం ఆదేశించారు. కోవిడ్– కర్ఫ్యూ రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరుపై ప్రతి జిల్లానుంచి రోజూ నివేదిక ఇవ్వాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్దేశించిన సమయంలో కర్ఫ్యూ అమలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో ప్రతి బుధవారం కోవిడ్‌రివ్యూ కమిటీలు సమావేశం కావాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారులకు వివరించే అవకాశం కలుగుతుందని, ఈ సమావేశంలో అందుతున్న ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాల్సిందిగా సీఎం సూచించారు. హోం ఐసోలేషన్‌లో లక్షన్నర మంది రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులు, బెడ్ల వివరాలను అధికారులు సమీక్షా సమావేశంలో వివరించారు. రాష్ట్రానికి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా, ఈనెల 8న 571 టన్నులు తీసుకున్నామని చెప్పారు. కనీసం 10 ఐఎస్ఓ క్రయోజనిక్ ట్యాంకర్లు కేటాయించాలని కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక నుంచి అదనంగా ఆక్సిజన్ కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. తమిళనాడు నుంచి కనీసం 60 మెట్రిక్ టన్నులు, కర్ణాటక నుంచి 130 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ వస్తే కనీస అవసరాలు తీరుతాయని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 638 కోవిడ్ ఆçస్పత్రుల్లో మొత్తం 47,644 బెడ్లు ఉండగా 39,271 బెడ్లు ఆక్యుపై అయినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద 24,645 మంది చికిత్స పొందుతుండగా, కోవిడ్ కేర్ సెంటర్లలో మరో 15 వేల మంది ఉన్నారని తెలిపారు. ఐసీయూల్లో 6,789 బెడ్లు ఉండగా 6,317 ఆక్యుపై అయినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు ఆస్పత్రి అనేవి లేవని, అన్నీ ఎంప్యానెల్ లేదా తాత్కాలిక ఎంప్యానెల్ ఆస్పత్రులేనని అధికారులు పేర్కొన్నారు. 102 కోవిడ్ కేర్ సెంటర్లలో 49,438 బెడ్లు ఉండగా 15,107 బెడ్లు ఆక్యుపైడ్ అని, హోం ఐసొలేషన్‌లో దాదాపు 1.5 లక్షల మంది ఉన్నారని అధికారులు తెలిపారు. కోవిడ్ నియంత్రణకు 17,901 మంది నియామకం కోవిడ్ నియంత్రణ, నివారణ కోసం మొత్తం 20,793 మంది నియామకానికి ఆమోదం తెలపగా ఇప్పటి వరకు 17,901 మంది నియామకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్‌కు చెందిన దాదాపు 3,500 మందిని తాత్కాలికంగా విధుల్లో నియమిస్తున్నామని తెలిపారు. -
18-45 వయసు వారికీ ఉచితంగా వ్యాక్సిన్
-
నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ.. వారికి ఉచితంగా వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాక్సిన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వారందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ మేరకు అవసరమైనన్ని కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లకు ఆర్డర్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 18 – 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న 2,04,70,364 మందికి టీకా ఇవ్వాల్సి ఉన్నందున ఆ మేరకు డోసులు సేకరించాలని సూచించారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ... రాత్రి పూట కర్ఫ్యూ... రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలి. రెస్టారెంట్లతో సహా అన్నింటినీ మూసేయాలి. ప్రజలు ఇబ్బంది పడకుండా రైతు బజార్లు, మార్కెట్లను వికేంద్రీకరించాలి. గతంలో మాదిరిగా వార్డులలో ప్రత్యేక మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేయాలి. యథావిథిగా టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు విద్యార్థులకు నష్టం కలగకుండా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు జరపాలి. ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చూపవద్దు. టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కులకు చాలా ప్రాధాన్యం ఉంది. ఉద్యోగ నియామకాల్లో కంపెనీలు వీటిని పరిగణలోకి తీసుకుంటాయి. విద్యార్థులకు మంచి కాలేజీల్లో అడ్మిషన్లు దొరకాలంటే మార్కులకు ప్రాధాన్యం ఇస్తాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి పరీక్షల్లో నెగ్గుకు రావాలన్నా, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించాలన్నా మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. బాగా చదివే విద్యార్థులకు నష్టం కలగ కూడదని, అందరితో పోటీపడి మంచి ఉద్యోగాలు సాధించాలన్న వారి ఆకాంక్షలు నీరుగారరాదనే ఈ నిర్ణయం. ఔషధాలు బ్లాక్‌కు తరలకూడదు.. ఆక్సిజన్ ఉత్పత్తితో పాటు సరఫరాను హేతుబద్ధీకరించండి. కోవిడ్ చికిత్సలో ముఖ్యమైన రెమిడిస్‌విర్ ఇంజక్షన్ల కేటాయింపు, సరఫరా ఎలా ఉందన్నది సమీక్షించాలి. ఎక్కడా ఈ ఔషథం బ్లాక్ మార్కెట్ కాకుండా చూడాలి. ఏదైనా రాకెట్ ఉంటే పూర్తిగా అరికట్టాలి. ఇందుకోసం ఎస్వోపీ రూపొందించాలి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ వాక్సిన్, రెమిడిస్‌వర్ ఇంజక్షన్లు ముందుగా ఇక్కడి అవసరాలు తీర్చాలి. లేదంటే ఇక్కడ కేసులు పెరిగితే ఆ సంస్థలను మూసివేసే పరిస్థితి వస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా వివరించాలి. ఏ ఒక్క ప్రాణం పోకూడదు.. కోవిడ్ పరీక్షల సంఖ్య అవసరం మేరకు పెంచండి. కోవిడ్ బారిన పడిన ప్రెమరీ కాంటాక్ట్‌లతోపాటు ఆ పరీక్ష కోరుకున్న వారందరికీ వెంటనే చేయాలి. ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడటం మనకు చాలా ముఖ్యం. ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు కోవిడ్ చికిత్స కోసం ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోండి. అవసరమైతే దాడులు జరపాలి. ఇందుకోసం ఒక సీనియర్ అధికారిని నియమించండి. 104 ప్రతి కాల్‌కు స్పందించాలి.. 104 కాల్ సెంటర్ మరింత సమర్థంగా పని చేయాలి. ప్రతి కాల్‌కు స్పందించాలి. మనం నిర్దేశించుకున్నట్లు ఫోన్ చేసిన 3 గంటల్లోనే బెడ్ కేటాయించాలి. ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే తమకు సాయం చేస్తారన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి. 104 కాల్ సెంటర్‌ను జిల్లాలో ఒక జేసీకి కేటాయించండి. ఆ అధికారి అవసరం మేరకు కాల్ సెంటర్లో కూర్చుని పర్యవేక్షించాలి. అవసరమైనన్ని కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి తగిన సదుపాయాలు కల్పించాలి. ఫార్మా కంపెనీలతో మాట్లాడిన సీఎం జగన్ సమీక్షకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లాతో పాటు హెటెరో డ్రగ్స్ ఎండీ బి.పార్థసారథిరెడ్డితో మాట్లాడారు. రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా మరిన్ని కోవిడ్ వాక్సిన్ డోసులతో పాటు రెమిడిసివిర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని వారిని కోరారు. మరిన్ని ఆక్సిజన్ రవాణా వాహనాలు రాష్ట్రంలో ఆక్సిజన్ రవాణా కోసం కేవలం 64 వాహనాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుత డిమాండ్‌ను తట్టుకునేందుకు కనీసం 100 నుంచి 120 వాహనాలు అవసరమని సమావేశంలో అధికారులు తెలిపారు. అన్ని ఆస్పత్రులలో ఆక్సిజన్ పడకలు నిండితే 515 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని, ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో రోజుకు సగటున 284 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగిస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఆర్ఐఎన్ఎల్లో రోజుకు 100 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేసి రాష్ట్రానికే ఇవ్వడంతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 208 కోవిడ్ ఆస్పత్రులలో మొత్తం 21,581 బెడ్లు ఉండగా 11,789 బెడ్లు నిండాయని, గత 24 గంటల్లో 2,506 మంది ఆస్పత్రుల్లో చేరారని వివరించారు. ఉచిత టీకాకు రూ.1,600 కోట్ల వ్యయం: మంత్రి ఆళ్ల నాని కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వారికి ఉచితంగా కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.1,600 కోట్లు ఖర్చు చేయనుందని చెప్పారు. సీఎం సమీక్ష అనంతరం మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. శనివారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుందని తెలిపారు. సీటీ స్కాన్ పేరుతో కొన్ని ఆస్పత్రులు దోపిడీకి పాల్పడటాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించినట్లు వెల్లడించారు. ఇందుకు రూ.2,500 ధరగా నిర్ణయించామని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని, ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. విపత్కర పరిస్థితుల్లో దోపిడీకి పాల్పడవద్దని ఆస్పత్రులకు విజ్ఞప్తి చేశారు. కళ్యాణ మండపాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. – సీఎం సమీక్షలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ సీఎస్ సతీష్‌చంద్ర, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
భయాన్ని కాదు.. ధైర్యాన్ని నింపండి
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూనే ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి తప్ప భయాన్ని కాదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ వైరస్‌ను అరికట్టడంలో భాగంగా గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య పరంగా తీసుకోవాల్సిన చర్యలపై వైద్య నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా నివారణకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన ప్రణాళిక, వైరస్ సోకిన వారికి అందించాల్సిన వైద్యం, ప్రభుత్వం తరఫున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై చర్చించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 31 వరకు అమలులో ఉండేలా పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. జనం గుమిగూడకుండా చూడాలి ►పబ్లిక్ ప్రదేశాల్లో జనం గుమిగూడకుండా చూడటంలో భాగంగా థియేటర్లు, మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ అమ్యూజ్మెంట్ పార్క్‌లు మూసి వేయాలి. ►పెద్ద దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు కొనసాగిస్తూనే భక్తులకు దర్శనాలు నిలిపేయాలి. చిన్న దేవాలయాలు, మసీదులు, చర్చిలకు సైతం భక్తులు వెళ్లడం మానుకోవాలి. జాతరలు లాంటివి నిర్వహించకపోతే మేలు. ►హోటళ్లు, రెస్టారెంట్లలో మనిషికి మనిషికి మధ్య 2 మీటర్ల ఎడం పాటించేలా చూడాలి. వివాహాది శుభకార్యాలను వీలైనంత తక్కువ మందితో నిర్వహించాలి. వీలైతే వాయిదా వేసుకోవాలి. ►ప్రజా రవాణాలో ఉన్న వాహనాలు శుభ్రత పాటించాలి. ఎక్కువ మందిని బస్సుల్లో ఎక్కించుకోకూడదు. నిల్చొని ప్రయాణం చేసే పరిస్థితి ఉండకూడదు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నవారు ప్రయాణాలు మానుకోవాలి. నెలాఖరు దాకా అంక్షలు రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు సంబంధించి గురువారం జరిగిన సమీక్షలో సీఎం జగన్ చేసిన సూచనల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు. ఇవీ ఈ నెల 31 వరకు అమలులో ఉంటాయని, అందరూ తప్పకుండా పాటించాలన్నారు. రాష్ట్రంలో ఇదీ పరిస్థితి ►రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. విదేశాల నుంచి వచ్చిన వారి కుటుంబాలు, ఇతరత్రా ఇంటింటి సర్వే చేయించామన్నారు. సహాయక చర్యలకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల రూపంలో మనకు మంచి వ్యవస్థ ఉందని చెప్పారు. ►ఇప్పటిదాకా రెండు పాజిటివ్ కేసులు (ఒంగోలు, నెల్లూరు – ఇద్దరూ విదేశాల నుంచి వచ్చిన వారే.. నెల్లూరు యువకుడు పూర్తిగా కోలుకున్నాడు) నమోదయ్యాయని వివరించారు. ఫిలిప్ఫైన్స్ నుంచి వచ్చిన 185 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామన్నారు. ►పలు మార్కెట్లు మూసి వేయడంతో మొక్కజొన్న, జొన్న ధరలు తగ్గుతున్నాయని, ఈ రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అరటి, చీనీ తదితర పండ్ల ధరలు కూడా తగ్గిపోతున్నాయని, కొద్ది రోజుల్లో తిరిగి ధరలను స్థిరీకరించే అవకాశం ఉందని చెప్పారు. ఇలా చేయండి.. ►ఇంటింటి సర్వే తర్వాత ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో మ్యాపింగ్ చేయించాలి. సచివాలయాల్లోని హెల్త్ అసిస్టెంట్లు, ఉద్యోగులు, ఏఎన్ఎం, ఆశావర్కర్, వలంటీర్లు, మహిళా పోలీసులందరికీ యాప్ అందుబాటులో ఉంచాలి. ►ప్రతి వలంటీర్ నుంచి 50 ఇళ్లకు సంబంధించిన డేటా సహా ఎప్పటికప్పుడు పరిస్థితులపై వివరాలను యాప్ ద్వారా తెప్పించుకోవాలి. ఆ డేటాపై సంబంధిత వైద్య సిబ్బంది అలర్ట్ కావాలి. ప్రజలు ఏం చేయాలి? ఏం చేయకూడదన్నదానిపై సూచనలు ఇవ్వాలి. ►వైరస్ నివారణకు చర్యలు చేపడుతూనే, ప్రజలకు ధైర్యం చెప్పాలి. తీవ్ర భయానికి గురిచేసేలా వ్యవహరించొద్దు. -
తెలంగాణలో 27 జిల్లాలు ఖరారు
-
27 జిల్లాలు ఖరారు
• 58 డివిజన్లు, 533 మండలాలు • ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఆమోదం... • సిరిసిల్ల, సికింద్రాబాద్ ఔట్ • వికారాబాద్, శంషాబాద్, మల్కాజ్గిరి జిల్లాలుగా రంగారెడ్డి విభజన • అనూహ్యంగా పెద్దపల్లి, హన్మకొండలకు చోటు • ఆదిలాబాద్‌లో నిర్మల్ జిల్లాకు గ్రీన్ సిగ్నల్ 1. ఆదిలాబాద్; 2. మంచిర్యాల; 3. నిర్మల్; 4. కరీంనగర్; 5. పెద్దపల్లి; 6. జగిత్యాల; 7. వరంగల్; 8. హన్మకొండ; 9. మహబూబాబాద్; 10. భూపాలపల్లి; 11. మెదక్; 12. సిద్దిపేట; 13. సంగారెడ్డి; 14. నిజామాబాద్; 15. కామారెడ్డి; 16. నల్లగొండ; 17. సూర్యాపేట; 18. యాదాద్రి; 19. మహబూబ్‌నగర్; 20. నాగర్‌కర్నూల్; 21. వనపర్తి; 22. ఖమ్మం; 23. కొత్తగూడెం; 24. హైదరాబాద్ (ఓల్డ్); 25. వికారాబాద్; 26. శంషాబాద్; 27. మల్కాజ్గిరి సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మొత్తం 27 జిల్లాలుండేలా పునర్విభజన చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. కొత్త జిల్లాల స్వరూపం, కొత్త జిల్లాల సంఖ్యపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన ఆరు గంటల పాటు సుదీర్ఘంగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. జిల్లాల విభజనపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీసీఎల్ఏ రేమండ్ పీటర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎంవో అధికారులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుత 10 జిల్లాలతో పాటు రాష్ట్రంలో 17 కొత్త జిల్లాల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రెవెన్యూ డివిజన్లను 44 నుంచి 58కు పెంచాలని నిర్ణయించారు. ఇప్పుడున్న 459 మండలాలను 533కు పెంచనున్నారు. ప్రతిపాదిత జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై శనివారం అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తారు. అదే రోజు కేబినేట్లో చర్చించి ఆమోదించిన అనంతరం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తర్వాత నెల రోజుల వ్యవధిలో ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. కొత్త జిల్లాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను, ప్రజల విజ్ఞప్తులను సమీక్షలో సీఎం క్షుణ్నంగా పరిశీలించారు. సీసీఎల్ఏ, ట్రాక్ రూపొందించిన కొత్త జిల్లాల మ్యాప్‌లనూ పరిశీలించారు. మొదటగా రెవెన్యూ యంత్రాంగం, సీసీఎల్ఏ సిద్ధం చేసిన ప్రతిపాదనల మేరకు రాష్ట్రాన్ని 24 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించాలా, జిల్లాల సంఖ్యను అంతకుమించి పెంచాల్సిన అవసరముందా అని లోతుగా చర్చించిన అనంతరం తుది ప్రతిపాదనలను ఖరారు చేశారు. కొత్త జిల్లాలకు జేసీలే కలెక్టర్లు.. ప్రస్తుత జిల్లాలకు పాత కలెక్టర్లను యథాతథంగా కొనసాగించాలని, కొత్తగా ఏర్పడే జిల్లాలకు జాయింట్ కలెక్టర్లను, సబ్ కలెక్టర్లను కలెక్టర్లుగా నియమించాలని అన్ని శాఖల కార్యదర్శులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఇప్పుడు జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ తదితర పోస్టులన్నిటినీ యథాతథంగా కొనసాగించాలని కోరారు. సచివాలయంలో బుధవారం ఉదయం సీఎస్ రాజీవ్‌శర్మ అన్ని శాఖల కార్యదర్శులతో కొత్త జిల్లాల ముందస్తు సన్నాహాలపై సమావేశమయ్యారు. ఉద్యోగుల విభజన, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాలు, కార్యాలయాల వసతి తదితరాలను ప్రధానంగా చర్చించారు. శాఖలవారీగా అధికారులు, ఉద్యోగుల విభజన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచిం చారు. కొత్త జిల్లాలకు సిబ్బంది పంపిణీలో సీనియారిటీకి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజనకు అనుసరించాల్సిన విధానాన్నే కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల పంపిణీకి కూడా అవలంబించాలని, సీనియర్ అధికారులతో కమిటీ వేయాలని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సచివాలయంలో సీఎస్ అధ్యర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మళ్లీ భేటీ జరగనుంది. దీనికి 14 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించారు. జంట జిల్లాలుగా హన్మకొండ, వరంగల్ వరంగల్ జిల్లాలో కొత్తగా హన్మకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనూహ్యంగా ఆఖరి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. జనగామను జిల్లా చేయాలని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నందున హన్మకొండను జిల్లా చేసి జనగామను అందులో కొనసాగించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. దీంతో వరంగల్ జిల్లా ఏకంగా నాలుగు ముక్కలవనుంది. జిల్లాలో ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న భూపాలపల్లి, మహబూబాబాద్లతో పాటు హన్మకొం డను తుది జాబితాలో చేర్చారు. రంగారెడ్డి మూడు ముక్కలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ముందునుంచీ పేచీ ఉం ది. ఈ రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు ఉపసంఘం ఎదుట భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటంతో వివాదం ముదిరింది. దాంతో తర్జనభర్జనల అనంతరం హైదరాబాద్ జిల్లాను యథాతథంగా కొనసాగించాలని, నగరం చుట్టూరా ఉన్న రంగారెడ్డిని మూడు జిల్లాలుగా చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని వికారాబాద్, శంషాబాద్, మల్కాజ్గిరి కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఖరారు చేశారు. గతంలోని సికింద్రాబాద్ ప్రతిపాదనను విరమించుకున్నారు. సిరిసిల్లకు బదులు పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో ముందు నుంచీ ప్రతి పాదనల్లో ఉన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు తుది ప్రతిపాదనల్లో చోటు దక్కలేదు. దానికి బదులుగా అనూహ్యంగా పెద్దపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే నిర్ణయం వెలువడింది. దీంతో కరీంనగర్లో జగి త్యాల, పెద్దపల్లి కొత్త జిల్లాల జాబితాలో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మంచి ర్యాలతో పాటు కొత్తగా నిర్మల్ జిల్లా ప్రతి పాదనకు సీఎం ఓకే చెప్పారు. -
2011 గ్రూప్-1కు సొంత ఏర్పాట్లు
హైదరాబాద్: 2011లో నిర్వహించిన గ్రూపు-1 మెయిన్స్‌ను మళ్లీ నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయంలో ఏపీతో సంబంధం లేకుండా విడిగా మెయిన్స్ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రిలిమ్స్‌లో తప్పులు దొర్లిన ప్రశ్నలను తొలగించి, అభ్యర్థులను మళ్లీ మెయిన్స్‌కు ఎంపిక చేసి పరీక్షను నిర్వహించడమా లేక ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త పరీక్షకు వెళ్లాలా అని సర్కారు యోచి స్తోంది. 2011లో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో 6 తప్పులు దొర్లడంతో తాము మెయిన్స్‌కు అర్హత పొందలేకపోయామని అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మొత్తం ప్రక్రియను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని గతేడాది కోర్టు ఆదేశించింది.