104 తక్షణం స్పందించాలి | CM Jagan mandate in a high-level review on Covid | Sakshi
Sakshi News home page

104 తక్షణం స్పందించాలి

Published Tue, May 11 2021 3:45 AM | Last Updated on Tue, May 11 2021 3:45 AM

CM Jagan mandate in a high-level review on Covid - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితులకు తక్షణం సేవలందించేలా 104 కాల్‌ సెంటర్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఈ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 104 కాల్‌ సెంటర్‌ పనితీరులో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేశారు. అ«ధికారులు ప్రతిరోజూ మాక్‌ కాల్స్‌ చేసి ఆ వ్యవస్థ పని తీరును పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ఆస్పత్రిలోనూ ఆరోగ్య మిత్ర ఉండాలని, ఎవరైనా సమస్య ఎదుర్కొంటే ఫిర్యాదు చేసేందుకు ప్రతి ఆస్పత్రిలోనూ నంబర్‌ ప్రదర్శించాలని ఆదేశించారు. కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, చికిత్సలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో  కోవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్లు, టాస్క్‌ఫోర్స్‌ బృందంతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇవీ..

ఆస్పత్రుల ఆవరణల్లో జర్మన్‌ హేంగర్స్‌
కోవిడ్‌ రోగుల రద్దీ ఎక్కువగా  ఉన్న జిల్లాల్లో అవసరాన్ని బట్టి ఆస్పత్రుల ఆవరణల్లోనే తాత్కాలికంగా జర్మన్‌ హేంగర్స్‌ను ఏర్పాటు చేసి అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలి. దీనివల్ల పేషెంట్లు బయట వేచిచూసే పరిస్థితులు తొలగిపోయి సత్వరమే వైద్యం అందుతుంది. వాటికి ఆక్సిజన్‌ సదుపాయం కల్పించటాన్ని పరిశీలించాలి. సమీపంలోనే డాక్టర్లు ఉంటారు కాబట్టి పర్యవేక్షించేందుకు వీలుగా ఉంటుంది. 104కు కాల్‌ చేసిన వెంటనే కచ్చితంగా స్పందన ఉండాలని, అవసరమైన వారికి వెంటనే బెడ్‌ కల్పించాల్సిందేనని ఆదేశించారు. 104కు కాల్‌ చేస్తే ఫోన్‌ కలవలేదని, స్పందన లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. 104కు కాల్‌ చేసిన తర్వాత కోవిడ్‌ బాధితులకు కచ్చితంగా సహాయం అందాల్సిందేనని స్పష్టం చేశారు. బెడ్‌ అవసరం లేదనుకుంటే పరిస్థితిని బట్టి కోవిడ్‌ కేర్‌ సెంటర్లకు పంపించాలని సూచించారు. 

3 గంటల్లో మందుల కిట్‌లు
ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వస్తే కోవిడ్‌ లక్షణంగా భావించి వెంటనే మందులు ఇచ్చేలా చూడాలని వైద్య నిపుణులు పేర్కొన్నారని, ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంట్లో చికిత్స పొందాల్సిన రోగికి 3 గంటల్లోగా మందుల కిట్‌ పంపాలని ఆదేశించారు.

ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు
కమ్యూనిటీ ఆస్పత్రుల నుంచి బోధనాసుపత్రుల వరకు పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసి సత్వరమే వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

బ్లాక్‌ మార్కెటింగ్‌ నిరోధించేందుకు గట్టి చర్యలు
రెమ్‌డెసివెర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ను నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్‌ ఆదేశించారు. దీనిపై ఆడిట్‌ తప్పనిసరిగా ఉండాలని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగంపై ఆడిటింగ్‌ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో అవసరమైన ఇంజక్షన్లు రోగులకు అందుబాటులో ఉంచాలని, ఇంజక్షన్ల పేరిట దోచుకునే వ్యవహారాలకు అడ్డుకట్ట  వేయాలని సీఎం ఆదేశించారు. 

కోవిడ్‌– కర్ఫ్యూ
రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరుపై ప్రతి జిల్లానుంచి రోజూ నివేదిక ఇవ్వాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్దేశించిన సమయంలో కర్ఫ్యూ అమలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో ప్రతి బుధవారం కోవిడ్‌రివ్యూ కమిటీలు సమావేశం కావాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారులకు వివరించే అవకాశం కలుగుతుందని,  ఈ సమావేశంలో అందుతున్న ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాల్సిందిగా సీఎం సూచించారు.

హోం ఐసోలేషన్‌లో లక్షన్నర మంది
రాష్ట్రంలో కోవిడ్‌ ఆస్పత్రులు, బెడ్ల వివరాలను అధికారులు సమీక్షా సమావేశంలో వివరించారు. రాష్ట్రానికి 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయించగా, ఈనెల 8న 571 టన్నులు తీసుకున్నామని చెప్పారు. కనీసం 10 ఐఎస్‌ఓ క్రయోజనిక్‌ ట్యాంకర్లు కేటాయించాలని కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక నుంచి అదనంగా ఆక్సిజన్‌ కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. తమిళనాడు నుంచి కనీసం 60 మెట్రిక్‌ టన్నులు, కర్ణాటక నుంచి 130 మెట్రిక్‌ టన్నులు ఆక్సిజన్‌ వస్తే కనీస అవసరాలు తీరుతాయని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 638 కోవిడ్‌ ఆçస్పత్రుల్లో మొత్తం 47,644 బెడ్లు ఉండగా 39,271 బెడ్లు ఆక్యుపై అయినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద 24,645 మంది చికిత్స పొందుతుండగా, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో మరో 15 వేల మంది ఉన్నారని తెలిపారు. ఐసీయూల్లో 6,789 బెడ్లు ఉండగా 6,317 ఆక్యుపై అయినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు ఆస్పత్రి అనేవి లేవని, అన్నీ ఎంప్యానెల్‌ లేదా తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రులేనని అధికారులు పేర్కొన్నారు. 102 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 49,438 బెడ్లు ఉండగా 15,107 బెడ్లు ఆక్యుపైడ్‌ అని, హోం ఐసొలేషన్‌లో దాదాపు 1.5 లక్షల మంది ఉన్నారని అధికారులు తెలిపారు. 

కోవిడ్‌ నియంత్రణకు 17,901 మంది నియామకం
కోవిడ్‌ నియంత్రణ, నివారణ కోసం మొత్తం 20,793 మంది నియామకానికి ఆమోదం తెలపగా ఇప్పటి వరకు 17,901 మంది నియామకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌కు చెందిన దాదాపు 3,500 మందిని తాత్కాలికంగా విధుల్లో నియమిస్తున్నామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement