
27 జిల్లాలు ఖరారు
తెలంగాణలో మొత్తం 27 జిల్లాలుండేలా పునర్విభజన చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు.
• 58 డివిజన్లు, 533 మండలాలు
• ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఆమోదం...
• సిరిసిల్ల, సికింద్రాబాద్ ఔట్
• వికారాబాద్, శంషాబాద్, మల్కాజ్‌గిరి జిల్లాలుగా రంగారెడ్డి విభజన
• అనూహ్యంగా పెద్దపల్లి, హన్మకొండలకు చోటు
• ఆదిలాబాద్‌లో నిర్మల్ జిల్లాకు గ్రీన్ సిగ్నల్
1. ఆదిలాబాద్; 2. మంచిర్యాల; 3. నిర్మల్; 4. కరీంనగర్; 5. పెద్దపల్లి; 6. జగిత్యాల;
7. వరంగల్; 8. హన్మకొండ; 9. మహబూబాబాద్; 10. భూపాలపల్లి; 11. మెదక్;
12. సిద్దిపేట; 13. సంగారెడ్డి; 14. నిజామాబాద్; 15. కామారెడ్డి; 16. నల్లగొండ;
17. సూర్యాపేట; 18. యాదాద్రి; 19. మహబూబ్‌నగర్; 20. నాగర్‌కర్నూల్;
21. వనపర్తి; 22. ఖమ్మం; 23. కొత్తగూడెం; 24. హైదరాబాద్ (ఓల్డ్);
25. వికారాబాద్; 26. శంషాబాద్; 27. మల్కాజ్‌గిరి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మొత్తం 27 జిల్లాలుండేలా పునర్విభజన చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. కొత్త జిల్లాల స్వరూపం, కొత్త జిల్లాల సంఖ్యపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన ఆరు గంటల పాటు సుదీర్ఘంగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. జిల్లాల విభజనపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎంవో అధికారులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుత 10 జిల్లాలతో పాటు రాష్ట్రంలో 17 కొత్త జిల్లాల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రెవెన్యూ డివిజన్లను 44 నుంచి 58కు పెంచాలని నిర్ణయించారు. ఇప్పుడున్న 459 మండలాలను 533కు పెంచనున్నారు. ప్రతిపాదిత జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై శనివారం అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తారు. అదే రోజు కేబినేట్‌లో చర్చించి ఆమోదించిన అనంతరం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తర్వాత నెల రోజుల వ్యవధిలో ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు.
కొత్త జిల్లాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను, ప్రజల విజ్ఞప్తులను సమీక్షలో సీఎం క్షుణ్నంగా పరిశీలించారు. సీసీఎల్‌ఏ, ట్రాక్ రూపొందించిన కొత్త జిల్లాల మ్యాప్‌లనూ పరిశీలించారు. మొదటగా రెవెన్యూ యంత్రాంగం, సీసీఎల్‌ఏ సిద్ధం చేసిన ప్రతిపాదనల మేరకు రాష్ట్రాన్ని 24 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించాలా, జిల్లాల సంఖ్యను అంతకుమించి పెంచాల్సిన అవసరముందా అని లోతుగా చర్చించిన అనంతరం తుది ప్రతిపాదనలను ఖరారు చేశారు.
కొత్త జిల్లాలకు జేసీలే కలెక్టర్లు..
ప్రస్తుత జిల్లాలకు పాత కలెక్టర్లను యథాతథంగా కొనసాగించాలని, కొత్తగా ఏర్పడే జిల్లాలకు జాయింట్ కలెక్టర్లను, సబ్ కలెక్టర్లను కలెక్టర్లుగా నియమించాలని అన్ని శాఖల కార్యదర్శులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఇప్పుడు జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ తదితర పోస్టులన్నిటినీ యథాతథంగా కొనసాగించాలని కోరారు. సచివాలయంలో బుధవారం ఉదయం సీఎస్ రాజీవ్‌శర్మ అన్ని శాఖల కార్యదర్శులతో కొత్త జిల్లాల ముందస్తు సన్నాహాలపై సమావేశమయ్యారు.
ఉద్యోగుల విభజన, సిబ్బంది కేటాయింపు, మౌలిక సదుపాయాలు, కార్యాలయాల వసతి తదితరాలను ప్రధానంగా చర్చించారు. శాఖలవారీగా అధికారులు, ఉద్యోగుల విభజన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచిం చారు. కొత్త జిల్లాలకు సిబ్బంది పంపిణీలో సీనియారిటీకి ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజనకు అనుసరించాల్సిన విధానాన్నే కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల పంపిణీకి కూడా అవలంబించాలని, సీనియర్ అధికారులతో కమిటీ వేయాలని అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సచివాలయంలో సీఎస్ అధ్యర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మళ్లీ భేటీ జరగనుంది. దీనికి 14 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించారు.
జంట జిల్లాలుగా హన్మకొండ, వరంగల్
వరంగల్ జిల్లాలో కొత్తగా హన్మకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనూహ్యంగా ఆఖరి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. జనగామను జిల్లా చేయాలని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నందున హన్మకొండను జిల్లా చేసి జనగామను అందులో కొనసాగించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. దీంతో వరంగల్ జిల్లా ఏకంగా నాలుగు ముక్కలవనుంది. జిల్లాలో ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న భూపాలపల్లి, మహబూబాబాద్‌లతో పాటు హన్మకొం డను తుది జాబితాలో చేర్చారు.
రంగారెడ్డి మూడు ముక్కలు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ముందునుంచీ పేచీ ఉం ది. ఈ రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు ఉపసంఘం ఎదుట భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటంతో వివాదం ముదిరింది. దాంతో తర్జనభర్జనల అనంతరం హైదరాబాద్ జిల్లాను యథాతథంగా కొనసాగించాలని, నగరం చుట్టూరా ఉన్న రంగారెడ్డిని మూడు జిల్లాలుగా చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని వికారాబాద్, శంషాబాద్, మల్కాజ్‌గిరి కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఖరారు చేశారు. గతంలోని సికింద్రాబాద్ ప్రతిపాదనను విరమించుకున్నారు.
సిరిసిల్లకు బదులు పెద్దపల్లి
కరీంనగర్ జిల్లాలో ముందు నుంచీ ప్రతి పాదనల్లో ఉన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు తుది ప్రతిపాదనల్లో చోటు దక్కలేదు. దానికి బదులుగా అనూహ్యంగా పెద్దపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే నిర్ణయం వెలువడింది. దీంతో కరీంనగర్‌లో జగి త్యాల, పెద్దపల్లి కొత్త జిల్లాల జాబితాలో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మంచి ర్యాలతో పాటు కొత్తగా నిర్మల్ జిల్లా ప్రతి పాదనకు సీఎం ఓకే చెప్పారు.