CM Jagan Met With Party Leaders of Visakha North Constituency - Sakshi
Sakshi News home page

జట్టుగా 175 సాధిద్దాం

Published Tue, Nov 15 2022 4:44 PM | Last Updated on Wed, Nov 16 2022 3:06 AM

CM Jagan met with party leaders of Visakha North Constituency - Sakshi

సాక్షి, అమరావతి: మనమంతా కలసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని, మరో 16 నెలల్లో రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. మనం చేస్తున్న మంచి ప్రతి పల్లెలోనూ కనిపిస్తోందని, ప్రతి గ్రామం రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు.

పారదర్శకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉండాలని ప్రజలు దీవిస్తారన్నారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి చేసిన మంచి, అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించారు. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేకే రాజు వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిగా ఉంటారని చెప్పారు. ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

మీ అందరి భాగస్వామ్యంతో..
మరో 16 నెలల్లో  ఎన్నికలు రానున్నాయి. అందుకోసం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. ఇంకా చాలా సమయం ఉంది కదా..! అప్పుడెప్పుడో చేయాల్సిన కార్యక్రమాలు ఇప్పుడే చేయాలా? అనుకోవచ్చు. ఎందుకు ఈ కార్యక్రమాలు చేపట్టామంటే రెండు కారణాలున్నాయి. మనం కలసి చాలా రోజులైంది. కలిసినట్లు ఉంటుందన్నది మొదటి కారణమైతే రెండోది.. గడప గడపకూ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని ప్రతి వార్డులోకి, ప్రతి ఇంటి వద్దకు తీసుకెళ్లడంలో మీ అందరి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం, అవసరం. 

లక్ష్యాన్ని గుర్తు చేసేలా..
ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చూస్తే.. ఇంత పారదర్శకంగా, వివక్ష, అవినీతికి తావులేకుండా పథకాలు గతంలో ఏ రోజూ సామాన్యుడికి చేరలేదు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో తొలిసారి ఇలా జరుగుతోంది. లంచాలకు ఆస్కారం లేకుండా పాలన సాగుతోంది. సచివాలయాలనే గొప్ప వ్యవస్ధను మనం తీసుకొచ్చాం. ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98 శాతానికి పైచిలుకు నెరవేర్చాం. అలా నెరవేర్చిన తర్వాత ప్రజలకు దగ్గరకు వెళ్లి వారి ఆశీస్సులు కోరుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా 175కి 175 నియోజకవర్గాల్లోనూ గెలుపు సాధించాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేయాలి. వీటిని గుర్తు చేయడానికే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం.

కుప్పంలోనూ క్లీన్‌ స్వీప్‌..
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఇవాళ పరిపాలన జరుగుతోంది. కుప్పం లాంటి నియోజకవర్గంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్‌ స్వీప్‌ చేశాం. మున్సిపాల్టీ, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధానాలన్నీ గెల్చుకున్నాం. గతంలో రాని ఫలితాలు ఇవాళ చూస్తున్నాం. దీనికి కారణం ప్రతి ఇంటిలోనూ సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తోంది. పారదర్శకంగా పథకాలు అమలవుతున్నాయి. ప్రతి ఇంటికీ మేలు జరుగుతోంది. అలాంటప్పుడు 175 స్థానాలనూ సాధించాలని మనం అనుకున్న లక్ష్యం కచ్చితంగా సాధ్యమే. 

రూపురేఖలు మారిన పల్లెలు.. 
ఇవాళ మన గ్రామాల రూపురేఖలు సమూలంగా మారుతున్నాయి. ఆర్బీకేలు అడుగడుగునా రైతన్నలకు అన్ని సేవలు అందిస్తున్నాయి. గ్రామాల్లో వ్యవసాయం చేసే తీరు మారుతోంది. సచివాలయాల వ్యవస్థతో ఇంటి వద్దకే పథకాలు పారదర్శకంగా వస్తున్నాయి. పట్టణాల్లో అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ కనిపిస్తున్నాయి. అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దిన పాఠశాలలు, ఇంగ్లీషు మీడియం చదువులు, మౌలిక వసతులు బలోపేతం చేసిన ఆసుపత్రులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి.

డిజిటల్‌ లైబ్రరీలు కూడా రానున్నాయి. వ్యవసాయం, విద్య, వైద్య ఆరోగ్య రంగాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. మనం చేస్తున్న మంచి ప్రతి చోటా కనిపిస్తోంది. మొత్తంగా మనం వేస్తున్న అడుగులు ప్రతిఫలాన్ని ఇచ్చే పరిస్థితి వస్తోంది. ఇలాంటప్పుడు ప్రజలు మనల్ని గెలిపించి ఆశీర్వదిస్తూ మరో 30 ఏళ్లు మనమే ఉండాలని దీవిస్తారు. ఎలాంటి విభేదాలున్నా వాటిని పక్కనపెట్టి అందరూ కలసికట్టుగా అడుగులు వేయాలి. 

క్యాలెండర్‌ ప్రకారం టంచన్‌గా..
విశాఖ రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద నగరం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 76 శాతం ఇళ్లల్లో మన పథకాలు కనిపిస్తున్నాయి. దాదాపు 1.05 లక్షల ఇళ్లు ఉంటే 80 వేల ఇళ్లకు పథకాలు అందాయి. అంత పారదర్శకత కనిపిస్తోంది. ఎక్కడా తప్పు జరగకుండా కచ్చితంగా క్యాలెండర్‌ ప్రకారం నెల నెలా బటన్‌ నొక్కి పథకాలతో మేలు చేకూరుస్తున్నాం. ఈ నెలలో ఈ పథకం ఇస్తామని మొట్ట మొదటిసారిగా బడ్జెట్‌ అన్నదానికి నిర్వచనం మార్చాం. గతంలో ఇలా ఎప్పుడూ క్యాలెండర్‌ ప్రకారం జరగలేదు. నాకు ఎన్ని సమస్యలున్నా అధిగమించి ప్రజల ఇబ్బందులే ఎక్కువని భావించి మేలు చేస్తున్నాం. అదే విధంగా మీరు చేయాల్సింది కూడా మీరు చేయాలి. 

ప్రతి గడపకూ వెళ్లాలి..
మీరు కచ్చితంగా ప్రతి గడపకూ వెళ్లాలి. ఆ ఇంట్లో అక్క చెల్లెమ్మలకు జరిగిన మంచిని వారికి వివరిస్తూ, గుర్తు చేస్తూ వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఆ వార్డులో సహేతుక కారణాలతో ఎవరికైనా ప్రయోజనం చేకూరకుంటే దీన్ని పరిష్కరించాలి. ఆ విధంగా మమేకం కావాలి. ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే మనం దగ్గరుండి పరిష్కరించాలి. ఇలా నేను చేయాల్సింది నేను.. మీరు చేయాల్సింది మీరు చేయాలి. ఈ రెండింటి కాంబినేషన్‌ జరిగితే 175కి 175 సాధ్యమే.

వ్యవస్థలో గొప్ప మార్పులు..
మనం నలుగురికి మంచి చేయాలంటే అధికారంలో ఉంటేనే చేయగలుగుతాం. ఇవాళ వ్యవస్ధలో గొప్ప మార్పులు జరుగుతున్నాయి. అవి కొనసాగాలంటే మనందరం కలసికట్టుగా అడుగులు వేయాలి.    

చదవండి: (CM Jagan: రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement