
సాక్షి, పల్నాడు: చిలుకలూరిపేటలో అంతా జగనన్న అని పిలిస్తే.. ఎక్కడో ఉన్న చంద్రబాబు ఉలిక్కి పడాలని కార్యక్రమానికి హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.
గురువారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పూర్తిస్థాయి ప్రారంభం కార్యక్రమంలో భాగంగా.. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట లింగంగుంట్ల వద్ద జరిగిన బహిరంగ సభలో విడదల రజని ప్రసంగించారు. సాధారణ బీసీ మహిళ అయిన తనకి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు మంత్రిని చేశారంటూ సీఎం జగన్‌కు విడదల రజిని కృతజ్ఞతలు తెలియజేశారామె. తన రాజకీయ జీవితం, తన పదవులు, రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షేనంటూ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ.. భావోద్వేగంతో రజిని కంటతడి పెట్టారు.
సీఎం జగన్ ఆశయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని తెలిపారామె. భారత దేశ ఆత్మ గ్రామ సీమల్లోనే ఉందని గాంధీజీ ఏనాడో చెప్పారు. పల్లె సీమలే దేశానికి పట్టుకోమలని మన సీఎం జగన్ బలంగా నమ్మారు. అందుకే వలంటీర్ వ్యవస్థ తెచ్చారని, ఆ వ్యవస్థ ఆత్మబంధువుల్లాగా పని చేస్తోంది.
మహానగరాల్లో ధనవంతులు వినే ఫ్యామిలీ డాక్టర్ అనే మాటను.. గ్రామాల్లో ఉండే పేదల కోసం ఇక నుంచి ఫ్యామిలీ డాక్టర్ ఉండబోతున్నాడని ఆమె పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం వినూత్నం, విలక్షణం. ఇది జగన్ మానసపుత్రిక అని మంత్రి రజిని పేర్కొన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో వైద్య సేవలు ఉచితమని, గ్రామాల్లో పేదల ఇంటి వద్దకే వైద్య సేవలు అందించడమే లక్ష్యమని, అలాగే గ్రామాల్లో కూడా వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్ సేవలు కొనసాగనున్నాయని ఆమె తెలిపారు.
నాలుగేళ్లలో ఒక ముఖ్యమంత్రి ఎంత చేయొచ్చో.. సీఎం జగన్ ఆరోగ్య రంగంలో చేసి చూపించారని మంత్రి రజిని పేర్కొన్నారు. అయితే.. 40 ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఏనాడూ ప్రజారోగ్యం గురించి ఆలోచించలేదని, పైగా ఆరోగ్య రంగాన్ని అమ్మకానికి పెట్టారని మంత్రి రజిని మండిపడ్డారు. పైగా దోమలపై దండయాత్ర, ఈగలపై కత్తి యుద్ధమంటూ కాలక్షేపం చేశారో రాష్ట్ర ప్రజలు చూశారని ఆమె గుర్తు చేశారు. పేదవాడి ఆరోగ్యం కోసం ఏనాడూ మంచి ఆలోచించలేదని, కేవలం మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబుపై ఆమె మండిపడ్డారు.
నలుగురు ఎమ్మెల్యేలను కొనొచ్చేమో, నాలుగు టీవీలు.. పత్రికలు ఉండొచ్చేమో, నాలుగు పార్టీలతో పొత్తు ఉండొచ్చేమో. కానీ, గుర్తు పెట్టుకోండి చంద్రబాబుగారు నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో మీరు ఎప్పటికీ ఉండరు. ఆ స్థానం జగనన్నదని మంత్రి రజిని ఉద్ఘాటించారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయొచ్చేమోగానీ, జగన్ కోసం ప్రాణమిచ్చే ప్రజాభిమానం కొనసాగించలేరని పేర్కొన్నారామె. దుష్టచతుష్టయం ఎన్ని పన్నాగాలు పన్నినా.. భూమి చీలినా.. నింగి కుంగినా.. అన్యాయానికి ఓటమి తప్పదని, చంద్రబాబు టీడీపీ ఓటమి తప్పదని, జగనన్న గెలుపు తథ్యమని మంత్రి రజిని పేర్కొన్నారు.
వెలుగు కావాలంటే సూర్యుడు కావాలి.. ఊపిరి కావాలంటే వాయుదేవుడు కావాలి.. పంట పండాలంటే వరుణ దేవుడు కావాలి.. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆనందంగా ఉండాలంటే జగనన్నే కావాలి.. మళ్లీ మళ్లీ జగనన్నే రావాలి అని పేర్కొన్నారు. ఏపీ ప్రస్తుతం మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్తు అంటోందని.. జై జగన్ నినాదాల నడుమ ప్రసంగం ముగించారామె.
Comments
Please login to add a commentAdd a comment