AP CM YS Jagan Review Meeting On Medical And Health Department - Sakshi
Sakshi News home page

వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

Published Fri, Sep 30 2022 12:12 PM | Last Updated on Fri, Sep 30 2022 8:11 PM

CM Jagan Review Meeting On Medical And Health Department - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలు చేరిక దాదాపు ఖరారు అయ్యింది. కొన్ని సంప్రదింపులు మిగిలి ఉన్న దృష్ట్యా.. కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కొంత సమయం కావాలని అధికారులు కోరారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఫలితంగా అక్టోబరు 5వ తేదీ బదులు.. అక్టోబరు 15న ఆరోగ్య శ్రీ జాబితాలోకి మరిన్ని ప్రొసీజర్ల చేరిక కార్యక్రమం ఉండనుంది. అంతేకాదు.. ఫ్యామిలీ డాక్టర్‌ పైలెట్‌ ప్రాజెక్టు కూడా ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇవాళ క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో సీఎం జగన్‌ కీలక ఆదేశాలు ఇవ్వడంతో పాటు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. 

ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు ఉన్నాయి. కొత్త వాటి చేరికతో ఆ సంఖ్య 3,254 చేరనుంది. సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ అధికారులతో మాట్లాడుతూ.. ‘‘ఆరోగ్య శ్రీ, అనుబంధ సేవల కింద చేస్తున్న ఖర్చు గత ప్రభుత్వంతో పోలిస్తే ఏడాదికి దాదాపు మూడు రెట్లు పెరిగింది. పెరిగిన ప్రొసీజర్లతో ఏడాదికి ఆరోగ్య శ్రీకి సుమారుగా రూ.2,500 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు, 108..104 వాహనాల సేవల కోసం సుమారు మరో రూ.400 కోట్లు చేస్తున్నాం.  మొత్తంగా దాదాపు రూ.3,200 కోట్లు వరకూ ప్రభుత్వం ఖర్చు చేస్తోంద’’ని వివరించారు.

► ప్రజల ఆరోగ్యం మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. మరో 432 కొత్త 104 వాహనాలు డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇప్పటికే సేవలందిస్తున్న 676 వాహనాలకు కొత్తవి తోడై మొత్తంగా ఆ సంఖ్య 1,108కి చేరనుంది. అలాగే ఇప్పటికే సేవలందిస్తున్న 748 108-వాహనాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. 

► విలేజ్‌ క్లినిక్స్‌లో 12 రకాల వ్యాధి నిర్ధారణ కిట్లు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నామని ఈ సందర్భంగా అధికారులు, సీఎం జగన్‌కు వివరించారు. అయితే.. క్లినిక్‌లలో కోవిడ్‌ కిట్‌ కూడా అందుబాటులో ఉంచాలని సీఎం జగన్‌ సూచించారు.

► ఆస్పత్రుల్లో ఉండాల్సిన స్థాయిలో సిబ్బంది ఉండాలని,  దీనికోసం ప్రతినెలా కూడా ఆస్పత్రుల వారీగా ఆడిట్‌ చేయాలని సీఎం జగన్‌ తెలిపారు. అలాగే ఈ ఆడిట్‌ నివేదికలు ప్రతి నెలాకూడా అధికారులకు చేరాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా దీన్ని పర్యవేక్షించాలన్న సీఎం జగన్‌.. ఎక్కడ ఖాళీ వచ్చినా జాప్యం లేకుండా మరొకరిని వెంటనే నియమించే ప్రక్రియ నిరంతరం కొనసాగాలని తెలిపారు. 

► ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా చూసేందుకు, నిరంతరం ఈ ప్రక్రియను పర్యవేక్షించి చేసి తగిన చర్యలు తీసుకునేందుకు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డు ఏర్పాటు ఆలోచన కూడా చేయాలని ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖకు, అధికారులకు సీఎం జగన్‌ సూచించారు.

పేషెంట్‌ డైట్‌ ఛార్జీల పెంపు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్‌ డైట్‌ ఛార్జీలను పెంచాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆరోగ్య శ్రీ పేషెంట్ల తరహాలోనే.. రోజుకు రూ.100కు పెంచాలన్న ఆయన.. నిశితంగా పరిశీలన చేసి మంచి మెనూ ద్వారా డైట్‌ అందించాలన్నారు. అలాగే.. జూనియర్‌ డాక్టర్ల స్టై ఫండ్‌ పెంపుపైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణంపైనా సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌.. మెడికల్ కాలేజీల నిర్మాణపనులపై మరింత ధ్యాస పెట్టాలన్నారు. ఈ సందర్భంగా.. అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ల నిర్మాణం నవంబర్‌ నెలాఖరుకల్లా పూర్తవుతాయని అధికారులు సీఎం జగన్‌కు నివేదించారు.

ఏపీకి 6 ఆయుష్మాన్‌ భారత్‌ అవార్డులు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ అవార్డుల్లో 6 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. మొత్తం పది అవార్డుల్లో 6 ఏపీకే వచ్చాయని తెలిపారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. 

ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి(కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె నివాస్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధానపరిషత్‌ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్, డాక్టర్‌ వైయస్సార్‌ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్‌ హరీంద్ర ప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ డీజీ (డ్రగ్స్‌) రవిశంకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చదవండి: కూలిన కుప్పం పచ్చకోట.. ఆందోళనలో చంద్రబాబు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement