సమర్థ నిర్వహణతో 11 లక్షల డోసులు ఆదా | CM Jagan Review Meeting with officials On Covid Vaccination | Sakshi
Sakshi News home page

సమర్థ నిర్వహణతో 11 లక్షల డోసులు ఆదా

Published Wed, Jul 21 2021 2:10 AM | Last Updated on Wed, Jul 21 2021 7:05 AM

CM Jagan Review Meeting with officials On Covid Vaccination - Sakshi

మూడుచోట్ల వేగంగా చిన్నారుల ఆస్పత్రులు..
► థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి. చిన్నారుల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలి. పోలీస్‌ బెటాలియన్లలో కోవిడ్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్‌తోపాటు వైద్యులను నియమించాలి. కమ్యూనిటీ ఆస్పత్రులు స్థాయి వరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. సబ్‌ సెంటర్ల వరకు టెలీమెడిసిన్‌ సేవలు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులోకి రావాలి. తద్వారా పీహెచ్‌సీల వైద్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రోగులకు అందుబాటులోకి వస్తారు. 
– సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమర్థ వ్యాక్సినేషన్‌ ద్వారా ఎక్కువ మందికి కోవిడ్‌ టీకాలు ఇవ్వగలిగామని, దాదాపు 11 లక్షల డోసులు ఆదా చేయగలిగినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని చెప్పారు. 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాక ప్రాధాన్యతగా ఉపాధ్యాయులకు టీకాలివ్వాలని ఆదేశించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు 35 లక్షల వ్యాక్సిన్‌ డోసులు కేటాయిస్తే 4,63,590 డోసులను మాత్రమే వినియోగించుకున్నందున మిగిలిపోయిన కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్‌ అంక్షల్లో భాగంగా ఈ నెల 22వతేదీ నుంచి రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రకటించారు. కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కోవిడ్, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  
 
సమర్ధ నిర్వహణతో టీకాల ఆదా
సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కువమందికి వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్‌ డోసులు 1,80,82,390. ఇంకా వినియోగించాల్సిన (బ్యాలెన్స్‌) డోసులు 8,65,500. ఇప్పటివరకు ఇచ్చిన డోసులు సంఖ్య 1,82,49,851. వ్యాక్సిన్లు వృథా కాకుండా సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపు 11 లక్షల డోసులు ఆదా చేయగలిగాం. విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తైంది. గత మే నెల నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్‌ డోసులు 35 లక్షలు కాగా కేవలం 4,63,590 డోసులు మాత్రమే వినియోగం జరిగింది. అందువల్ల ఆ కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరతాం. గర్భిణిలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించి చురుగ్గా టీకాల కార్యక్రమాన్ని చేపట్టాలి.

మరో వారం రాత్రి కర్ఫ్యూ
కోవిడ్‌ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ కొనసాగించాలి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలు చేయాలి.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లపై..
రాష్ట్రంలో 50 పడకలు దాటిన ప్రతి ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు విషయంలో పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. కలెక్టర్లు సంబంధిత జిల్లాల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఈమేరకు ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఇన్సెంటివ్‌ ఇస్తోందని సీఎం చెప్పారు. సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు,  ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఏ.బాబు, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఏ.మల్లిఖార్జున్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
రాష్ట్రంలో కోవిడ్‌ ఇలా...
– సోమవారం నాటికి యాక్టివ్‌ కేసులు 24,708 
– పాజిటివిటీ రేటు 2.83 శాతం
– 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు జిల్లాలు 8
– 3 – 5 శాతం పాజిటివిటీ రేటు జిల్లాలు 5
– రికవరీ రేటు 98.05 శాతం
– నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పడకల్లో చికిత్స 94.19 శాతం
– ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పడకల్లో చికిత్స 76.07 శాతం
– 13వ విడత ఫీవర్‌ సర్వే పూర్తి
– 104 కాల్‌ సెంటర్‌కు వస్తున్న రోజువారీ కాల్స్‌ 1000 లోపు 

బ్లాక్‌ ఫంగస్‌ తగ్గుముఖం..
–గత వారం నమోదైన కేసులు 15 
– మొత్తం కేసులు 4075
–చికిత్స పొందుతున్నవారు 863

వ్యాక్సినేషన్‌..
–మొత్తం వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు   1,41,42,094
–సింగిల్‌ డోసు పూర్తయినవారు  1,00,34,337
–రెండు డోసులు పూర్తయినవారు  41,07,757

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement