సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత ఆదాయం పెరగడానికి తగిన ఆలోచనలు చేయడంతో పాటు ఆ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అదనపు ఆదాయాల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఎస్‌ఓఆర్ (రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలని చెప్పారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆదాయ ఆర్జన శాఖల మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదాయ ఆర్జనకు సంబంధించి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖల అధికారులు క్రమం తప్పకుండా సమావేశం కావాలని సూచించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్‌ఓపీలను పాటించాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న వ్యాట్ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టడంపై దృష్టి సారించాలని చెప్పారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంతగా వేగవంతం చేయాలని సూచించారు. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలను సమీక్షించి.. తగిన మార్పులు, చేర్పులు చేయాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించ కూడదని, ఆ మేరకు పటిష్టమైన ఎస్‌ఓపీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్) కె.నారాయణస్వామి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉచిత రిజిస్ట్రేషన్ల వల్ల పేదలకు భారీగా లబ్ధి
► ఇదివరకెన్నడూ లేని విధంగా ఓటీఎస్ పథకం ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు రూపేణా పేదలకు ఇప్పటి వరకు రూ.400.55 కోట్లు, టిడ్కో ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు రూపేణా మరో రూ.1,230 కోట్ల మేర (మొత్తంగా రూ.1630.55 కోట్లు) లబ్ధి చేకూరిందని అధికారులు వెల్లడించారు.
► గతంలో ఎన్నడూ ఇలా పేదల ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ మినహాయింపులు జరగలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం కార్పొరేట్ కంపెనీలకు కేటాయించే స్థలాలకు మాత్రమే స్టాంపు డ్యూటీ మినహాయింపులు ఇచ్చారు.
► ఇప్పటి వరకు 3.70 లక్షల ఓటీఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ పూర్తయింది. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment