
సాక్షి, ఏలూరు జిల్లా: ముంపు బాధితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను ఆయన బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. ఇంత పారదర్శకతతో గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు.
చదవండి: వరద బాధితులందరికీ న్యాయం చేస్తాం: సీఎం జగన్
వరద సహాయ చర్యల్లో అధికార యంత్రాంగం అంతా పాల్గొంది. ఎన్యుమరేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10వేల ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశించామని సీఎం తెలిపారు. వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరినీ ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో సాయం అందిస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.
‘‘ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నాం. ఈ ప్యాకేజీకి రూ.20 వేల కోట్లు అవసరం. కేంద్రంతో యుద్ధం చేస్తూనే ఉన్నాం. కేంద్రం తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తక్కువ మొత్తం అయితే కేంద్రం ఇవ్వకున్నా మేమే ఇచ్చేవాళ్లం. రూ.20 వేల కోట్లు అయ్యేసరికి ఏమీ చేయలేకపోతున్నాం. ప్రధానిని ఇప్పటివరకు మూడుసార్లు కలిశా. కేంద్ర మంత్రులను మన మంత్రులు కలుస్తూనే ఉన్నారు. అయినా కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో కదలిక లేదు. ప్రధాని మోదీని కలిసి వరద ఏ స్థాయిలో ఉందో వివరిస్తా. వీలైనంత త్వరగా ఆర్థిక సాయం అందించాలని ప్రధానిని కోరతామని’’ సీఎం జగన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment