CM YS Jagan will release YSR Asara funds on March 25th - Sakshi
Sakshi News home page

ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్‌.. 78.94 లక్షల మందికి రూ.6,419 కోట్లు

Published Thu, Mar 23 2023 8:52 AM | Last Updated on Thu, Mar 23 2023 3:21 PM

Cm Jagan Will Release Ysr Asara Funds On March 25th - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఆసరా పథకం మూడో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేయనున్నారు. ఈ నెల 25న ఏలూరు జిల్లా దెందులూరులో లాంఛనంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించి మొత్తం డబ్బులను నాలుగు విడతల్లో లబ్ధిదారులకు నేరుగా చెల్లించే వైఎస్సార్‌ ఆసరా పథకానికి అధికారంలోకి రాగానే సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,571 కోట్ల అప్పు ఉంది.

ఇందులో ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మూడో విడతగా ఇప్పుడు అందజేసే రూ.6,419.89 కోట్లతో కలిపి మొత్తం రూ.19,178.17 కోట్లను ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసినట్టు అవుతుంది. ఈ డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

పది రోజులపాటు ఉత్సవాలు
కాగా వైఎస్సార్‌ ఆసరా మూడో విడత పంపిణీ ఉత్సవాలను ప్రభుత్వం పది రోజుల పాటు పండుగలా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్‌ 5 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తారు.

రోజుకు కొన్ని గ్రామ సమాఖ్యల పరిధిలో పంపిణీ జరిగే ప్రాంతంలో ఆ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించేందుకు గ్రామీణ పేదిరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌), పట్టణ పేదిరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఆయా కార్యక్రమాలకు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీలతోపాటు సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. మంత్రులు కూడా రోజూ పాల్గొంటారు.
చదవండి: మొక్కల డాక్టర్లు వచ్చేస్తున్నారు!

ఇంటింటికీ వెళ్లి.. 
మరోవైపు ఇప్పటికే మార్చి 14 నుంచి 17 వరకు గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ సమాఖ్య సహాయకులు (వీవోఏ), పట్టణ రిసోర్స్‌ పర్సన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మూడో విడతలో వారికి ఎంత మొత్తం ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుందో తెలియజేశారు. అలాగే మార్చి 18 నుంచి 20 వరకు సెర్ప్‌ కమ్యూనిటీ కోర్డినేటర్లు ఆయా పొదుపు సంఘాల సభ్యులందరితో సమావేశాలు నిర్వహించారు.

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల వారీగా లబ్ధిదారుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21న సచివాలయాల వారీగా సమావేశాలు ప్రారంభం కాగా, 23, 24 తేదీల్లో కూడా కొనసాగనున్నాయని సెర్ప్‌ అధికారులు వెల్లడించారు. 

చంద్రబాబు కాలంలో సంఘాలన్నీ కుదేలు
2014లో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని అప్పటి ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆ హామీని అమలు చేయకుండా మోసం చేశారు. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు ఎవరూ కట్టవద్దని చంద్రబాబు పిలుపునివ్వడంతో మహిళలు ఆ రుణాలు కట్టలేదు. దీంతో వాటి వడ్డీలు కూడా చెల్లించలేనంతగా పెరిగిపోయాయి.

ఈ పరిస్థితిలో పొదుపు సంఘాలు పూర్తి చిన్నాభిన్నమై ‘ఏ’ కేటగిరీ సంఘాలు కూడా ‘సీ’, ‘డీ’ కేటగిరీల్లోకి వెళ్లిపోయాయి. పొదుపు సంఘాల రుణాలపై సున్నా వడ్డీ పథకానికి కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం నిలిపివేసింది. ఇలాంటి దుస్థితిలో రాష్ట్రంలో తిరిగి పొదుపు సంఘాల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టింది.

దీంతో పొదుపు సంఘాలు తిరిగి జీవం పోసుకున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంలో మన రాష్ట్ర మహిళలు దేశంలోనే అత్యధికంగా ఉన్నారు. మన రాష్ట్రంలో 99.55 శాతం మంది రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో మొత్తం పొదుపు సంఘాల్లో 91 శాతం ఏ, బీ గ్రేడ్‌ల్లో కొనసాగుతున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement