భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ముదివేడులో పడిపోయిన టమాట తోట
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం 9.45 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వరద నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సీఎం మధ్యాహ్నం 2.05 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. కాగా, తుపాను ప్రభావంతో శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి.
ప్రధానంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు చోట్ల రహదారులు, వంతెనలకు గండ్లు పడ్డాయి. స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు, వరదలకు చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందగా.. వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలోని మూడు గ్రామాల్లో తుపాను ప్రభావంతో వీస్తున్న చలిగాలులకు 465 గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 2.18 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు.
జలదిగ్భంధంలో గ్రామాలు
సోమశిల బ్యాక్‌వాటర్‌తో నెల్లూరు జిల్లాలోని అనంత సాగరం, చేజర్ల, ఆత్మకూరు, సంగం, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరు మండలాల్లో 16 లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. 42 చెరువులకు గండ్లు పడ్డాయి. ఒక వంతెన కొట్టుకుపోవడం, సోమశిల బ్యాక్‌వాటర్‌తో రోడ్డు మునిగిపోవడంతో వైఎస్సార్– నెలూరు జిల్లాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే మనుబోలు వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరడంతో నెల్లూరు నుంచి చెన్నై, తిరుపతి మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రాకపోకలను పునరుద్ధరించారు. చెరువులు, వరదల్లో చిక్కుకున్న ఆయా ప్రాంతాల్లోని సుమారు 4,000 మందిని, నెల్లూరు నగరంలో 1100 మందిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారు.
పెన్నా ఉగ్రరూపంతో నెల్లూరు నగర పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ శుక్రవారం రాత్రి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. నెల్లూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం రంగనాథస్వామి ఆలయం జలదిగ్భందంలో చిక్కుకుంది. ఎమ్మెల్యేలు.. కాకాణి గోవర్దన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వరప్రసాద్‌రావు, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో రాళ్లపాడు, గుళ్లకమ్మ ప్రాజెక్టులు నిండు కుండల్లా మారడంతో దిగువకు నీరు వదిలేశారు. యుద్ధప్రాతిపదికన 234 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పాలేరు, ముసి, మన్నేరు, అట్లేరు పొంగిపొర్లుతుండటంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని శివారు కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి.
బాధితులను రక్షించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, అధికారులు
చిత్తూరు జిల్లాలో వర్షాలతో వాగులు పొంగడంతో నలుగురు మృతి చెందారు. ఐరాల వద్ద గార్గేయ నదిలో కొట్టుకుపోయి వైఎస్సార్‌సీపీ కార్యకర్త వినయ్‌రెడ్డి, కేవీపల్లి నూతన కాలువలో గల్లంతై రెడ్డి భాష ప్రాణాలు విడిచారు. శ్రీరంగరాజపురం పుల్లూరు పెద్దవంక వాగులో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. రేణిగుంట రాళ్ల కాలువలో గల్లంతైన రైతు ప్రసాద్ మృతి చెందాడు. శ్రీకాళహస్తి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షల చెక్కును వారికి అందించారు. ప్రసాద్ భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేశారు. ఏర్పేడు మండలం శివగిరి కాలనీకి చెందిన 14 మంది గిరిజనులు కోన కాలువలో చిక్కుకుపోగా బియ్యపు మధుసూదన్‌రెడ్డి స్వయంగా డ్రోన్‌ను తెప్పించి వారి ఆచూకీని కనిపెట్టారు. వారికి డ్రోన్ ద్వారా బిస్కెట్లు, పండ్లు, రొట్టె, తాగునీళ్లు పంపారు. ప్రస్తుతం గిరిజనులంతా కాలువకు అవతల ఉన్న మామిడి తోటలో సురక్షితంగా ఉన్నారు.
అలాగే పీలేరు మండలం ఆకులవారిపల్లెలో పూరి గుడిసె కూలిపోవడం, పింఛా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామంలోకి రాలేకపోయిన ఒక కుటుంబాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కాపాడారు. చిత్తూరు జిల్లాలో ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న 3,661 మందిని అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన 15 మంది వరదలో చిక్కుకుని సమీపంలోని తోటలో ఉండిపోగా అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని యానాది కాలనీలో విద్యుత్ శాఖకు చెందిన 10 మందితోపాటు మరో 12 మంది మామిడి తోటలో చిక్కకుపోగా ఎస్పీ అన్బురాజన్ స్వయంగా రెస్క్యూ టీం సహకారంతో వారిని కాపాడారు. అలాగే వైజాగ్‌కు చెందిన 200 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సురక్షితంగా చేరుకున్నారు. వీరికి అధికారులు ఫిషింగ్ హార్బల్‌లో వసతి సౌకర్యం కల్పించి తాగునీరు, ఆహారాన్ని అందించారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలంలో ఉన్న హేమాద్రివారిపల్లి వరద నీటిలో చిక్కుకుంది. అధికారులు, రెస్క్యూ సిబ్బంది బోటులో గ్రామానికి చేరుకుని 130 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రికార్డు స్థాయి వర్షం
ఈ నెల 23 – 26 వరకు నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో సగటు సాధారణ వర్షపాతం 31.0 మిల్లీమీటర్లు కాగా 288.8 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో గత రెండు దశాబ్దాల్లోనే లేనంతగా 25 నుంచి 28 సెం.మీ. వర్షం కురిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 99 మండలాల పరిధిలోని 299 గ్రామాలు వర్షాలతో తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. మొత్తం 15.87 లక్షల మంది ఇబ్బందుల పాలయ్యారు. 664 ఇళ్లు నీట మునగగా 673 ఇళ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 76.7 మి.మీ., కర్నూలు జిల్లాలో 19.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వైఎస్సార్ జిల్లాలో రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట, కడప, బద్వేలు ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలతో జిల్లాలోని పాపాఘ్ని, మాండవ్య, బహుదా, పింఛా, జంగమేరు, పెన్నా, సగిలేరు, పాగేరు, మొగమూరుతోపాటు పలు నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పింఛా నీటితో నిండి శుక్రవారం ఉదయం తెగిపోయింది. వరద ఉధృతికి మాండవ్య నదిలో చిన్నమండెం ప్రాంతంలో ప్రయాణికులతో ఉన్న ఓ కారు కొట్టుకుపోయింది. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. బుగ్గవంక నీటిని దిగువకు విడుదల చేయడంతో కడప నగరంలోని లోతట్టు కాలనీలు నీట మునిగాయి. శుక్రవారం ఉదయం డిప్యూటీ సీఎం అంజద్ బాషా వరద బాధిత ప్రాంతాలలో పర్యటించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
తిరుమలలో 300కు పైగా కూలిన చెట్లు
తుపానుతో తిరుమలలో దాదాపు 300కు పైగా వృక్షాలు కూలినట్టు ఎఫ్‌ఆర్వో ప్రభాకరరెడ్డి తెలిపారు. టీటీడీ అటవీ శాఖ ఉద్యోగులు, గార్డెనింగ్ సిబ్బంది 150 మంది బృందాలుగా విడిపోయి ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తున్నారన్నారు. కాగా, తిరుమల కొండల నుంచి ఉబికి వస్తున్న నీటితో తిరుపతిలోని రహదారులు వాగుల్లా మారాయి. లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది.
దెబ్బతిన్న పంటలు
క్షేత్రస్థాయి ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 2.18 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అంచనా. జిల్లాల వారీగా గుంటూరులో 1,24,392, కృష్ణాలో 94,464, తూర్పు గోదావరిలో 25,000, పశ్చిమ గోదావరిలో 21,000 చిత్తూరులో 10,166, ప్రకాశంలో 1,06,000, వైఎస్సార్‌లో 4,886, నెల్లూరులో 33,269, కర్నూలులో 15,798, అనంతపురంలో 802 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం హాఫ్‌పేట, ఖాజీపేట గ్రామాల్లో తుపాను తాకిడికి దెబ్బతిన్న మినుము, వరి పంటలను వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, రేపల్లెలో ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment