ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమని.. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల ప్రభుత్వం అని సీఎం వైఎస్ జగన్ ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ వ్యవహరించదని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి డ్రాఫ్ట్ రాలేదని, అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియదన్నారు.
అయితే మీడియాలో, పలుచోట్ల విపరీతంగా చర్చ నడుస్తోందని, అది చూసి ముస్లింలు పెద్ద స్థాయిలో తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బుధవారం ఆయన ముస్లిం ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి పాలకుడిగా, సీఎం స్థాయిలో తాను ఉన్నానని, ఇలాంటి పరిస్థితుల్లో మీ రే ఉంటే ఏం చేసేవారో ఆలోచించి సలహాలు ఇ వ్వాలని కోరారు.
ముస్లిం ఆడబిడ్డల హక్కుల పరిరక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రచారం నడుస్తోందని, ఇలాంటి దాన్ని మత పెద్దలుగా మీరు తిప్పికొట్టాలని సూచించారు. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏతండ్రి, తల్లి అయినా ఎందుకు భేద భావాలు చూపుతారని, మ హిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీ లేదనే విషయాన్ని మనందరం స్పష్టం చేద్దామని పిలుపునిచ్చారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
అపార్థాలకు తావివ్వరాదు
భారత్ చాలా విభిన్నమైనది. ఇక్కడ అనేక మతాలు, కులాలు, వర్గాలు ఉన్నాయి. ఒకే మతంలో ఉన్న ప లు కులాలు, వర్గాలకూ పలు రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలున్నాయి. వారి వారి మత గ్రంథాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి వారి పర్సనల్ లా బోర్డులున్నాయి. ఏ నియమమైనా, ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్ లా బోర్డుల ద్వారానే చేయాలి.
ఎందుకంటే వాటి మీద పూర్తి అవగాహన వారికే ఉంటుంది కాబట్టి. అప్పుడే అపార్థాలకు తావుండదు. మార్పులు అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు, లా కమిషన్, కేంద్రం.. అందరూ కలిసి, మతాలకు చెందిన సంస్థలు, వారి పర్సనల్ లా బోర్డ్స్‌తో మమేకమై ముందుకు సాగాలి. ఇలా కాకుండా వేరే పద్ధతిలో జరిగితే, అది ఇంత భిన్నత్వం ఉన్న భారత్‌లో తగదు.
ముస్లింలకు సీఎం అండగా ఉంటానన్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీతో పౌరస్మృతి విషయంలో ముస్లిం మైనార్టీలకు భరోసా లభించిందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను సీఎంతో పంచుకున్నామని చెప్పారు. మూడు గంటల పాటు సీఎంతో సమావేశమై చర్చించామని తెలిపారు.
యూసీసీ (యూనిఫాం సివిల్ కోడ్) ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం గురించి మత పెద్దలు సీఎంకు వివరించారన్నారు. ముస్లింలకు నష్టం జరగకుండా తాను ముందుండి పోరాడతానని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ముస్లింలకు నష్టం కలిగేలా ఉంటే పార్లమెంట్‌లో యూసీసీ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పారని తెలిపారు. సీఎం నిర్ణయంతో మత పెద్దలు సంతోషం వ్యక్తం చేశారన్నారు. సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రూఫుల్లా, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ ఇసాక్ బాషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment