మా నీటిని తీసుకుంటే తప్పేంటి? | CM YS Jagan Comments In Farmers Day Meeting At Rayadurgam | Sakshi
Sakshi News home page

మా నీటిని తీసుకుంటే తప్పేంటి?

Published Fri, Jul 9 2021 2:04 AM | Last Updated on Fri, Jul 9 2021 10:52 AM

CM YS Jagan Comments In Farmers Day Meeting At Rayadurgam - Sakshi

రాయదుర్గంలో రైతు దినోత్సవ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

రైతు ఎక్కడున్నా రైతే. నీళ్లు ఎవరికైనా ప్రియమే. వాళ్లూ బతకాలి. మనం కూడా బతకాలి. కోటా మేరకు నీటిని వాడుకోవడంలో గొడవలు తగవు. నీటి విషయంలో రాజకీయాలు చూడలేకే మాట్లాడుతున్నా. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కానీ, జగన్‌ కానీ కోరుకుంటున్నది ఒక్కటే. ఏ ఒక్క పొరుగు రాష్ట్రంతో కూడా మాకు విభేదాలు వద్దు. పాలకుల మధ్య సఖ్యత ఉంటేనే అక్కడా, ఇక్కడా ప్రజలు చల్లగా ఉంటారు.  

సాక్షి ప్రతినిధి, అనంతపురం:  రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు మా రాష్ట్రానికి కేటాయించిన నీటిని మేం తీసుకోవడంలో తప్పేముందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.  రైతు దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పట్టణంలోని విద్యార్థి పాఠశాలలో నిర్వహించిన రైతు దినోత్సవ సభలో మాట్లాడారు.

‘ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పటి వరకు నీటి విషయం గురించి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడటం మొదలు పెట్టారు. తెలంగాణకు చెందిన కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారికీ, చంద్రబాబుకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా’ అంటూ వివరించారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ అంటే కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణాల కలయిక అని, దశాబ్దాల తరబడి మూడు ప్రాంతాల మధ్య నీటి కేటాయింపులు జరుగుతున్నాయని తెలిపారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు 298 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు.. మొత్తం 811 టీఎంసీల కేటాయింపులకు సంబంధించి 2015 జూన్‌ 19వ తేదీన కేంద్రం, ఏపీ, తెలంగాణ.. ముగ్గురం సంతకాలు చేశామని చెప్పారు. ఇవాళ రాయలసీమ పరిస్థితిని గమనించాలని చెబుతున్నా. పోతిరెడ్డిపాడు నుంచి కిందకు పూర్తి స్థాయిలో నీరు రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులకు పైగా నీళ్లు చేరాలన్నారు.

బాగా వర్షాలు కురిసిన ఈ రెండేళ్లు మినహాయిస్తే శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగుల స్థాయిలో నీళ్లు ఉన్న రోజులు గత 20 ఏళ్లలో ఏడాదిలో 20 నుంచి 25 రోజులు కూడా లేవన్నారు. మరి అలాంటి సమయంలో పోతిరెడ్డిపాడుకు పూర్తి స్థాయిలో నీటిని తీసుకెళ్లలేని పరిస్థితి ఉంటే.. మరో వైపు పక్క రాష్ట్రంలో పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి సామర్థ్యం పెంచి 800 అడుగులలోపే నీటిని తీసుకునే వెసులుబాటు తెలంగాణాకు ఉందన్నారు. 796 అడుగుల వద్దే తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని, 800 అడుగులలోపు వారు నీటిని వాడుకుంటే తప్పులేనప్పుడు.. మేము కూడా 800 అడుగుల వద్దే మాకు కేటాయించిన నీటిని తీసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు.  
అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగిన వైఎస్సార్‌ రైతు దినోత్సవంలో ప్రసంగిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సభలో పాల్గొన్న ప్రజలు 
 
బూబూ ఆ రోజు మీరేం చేశారు? 
‘అయ్యా.. చంద్రబాబూ.. ఇవాళ మీరు నీళ్ల గురించి మాట్లాడుతున్నారు.. గతంలో మీరు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువైపు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో అక్కడ పాలమూరు–రంగారెడ్డి, డిండి లాంటి ఎత్తిపోతల ప్రాజెక్టులు కడుతుంటే మీరు గాడిదలు కాస్తున్నారా?’ అని సీఎం జగన్‌ నిలదీశారు. అప్పుడు గాడిదలు కాసిన ఈ పెద్దమనిషి ఇప్పుడు నీటి గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిల్లో మనం కూడా ఇవాళ 800 అడుగుల్లో లిఫ్టు పెట్టి మనకు కేటాయించిన నీటిని మాత్రమే సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఎవరి నీటిని తీసుకోవడానికి ఈ లిఫ్ట్‌ పెట్టడం లేదని స్పష్టం చేశారు. తమకు ఏ ఒక్క పొరుగు రాష్ట్రంతో కూడా విభేదాలు వద్దని.. అక్కడా, ఇక్కడా ప్రజలు చల్లగా ఉండాలంటే పాలకుల మధ్య సఖ్యత ఉండాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. అందువల్లే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టలేదని, రాబోయే రోజుల్లో కూడా వేలు పెట్టనని తెలిపారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలని, సఖ్యతతో పరిష్కారాలు వెతుక్కోవాలని చెప్పారు. దేవుడి దయతో ఈ ఏడాది కూడా వర్షాలు బాగా పడాలని, రైతన్నలకు మంచి చేసే అవకాశం రావాలని ఆకాంక్షించారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

 
ఇది రైతు మేలు కోరే ప్రభుత్వం  
► కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఏడాదిన్నర కాలంలో రాష్ట్రమంతా అతలాకుతలమైన పరిస్థితులున్నా.. ఆదాయం పెను సవాలుగా మారినా, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కష్టాలతో పోలిస్తే రైతులు, అక్కచెల్లెమ్మలు, పేదల కష్టాలే ఎక్కువ అని భావించి ఎక్కడా రాజీ డకుండా పని చేశాం.  
► ఈ రోజు గ్రామాల రూపురేఖలను మార్చేశాం. రైతుల కోసం ఇంతగా మనసు పెట్టి ఆలోచన చేసిన సందర్భం ఎప్పుడూ, ఎక్కడా లేదు. 3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో రైతన్నల కష్టాలు చూశాను.. విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ మాట ఇచ్చాను. ఆ మేరకు ఈ రెండేళ్లలో చేసి చూపించగలిగాను. ఎన్నికల ప్రణాళికలో చెప్పినవన్నీ చేస్తూ వస్తున్నాం.  

 
 రైతు విప్లవానికి నాంది పలికిన నేత వైఎస్సార్‌  
► దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవించినంత కాలం రైతుల గురించి ఆలోచించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా, వాచ, కర్మణా కోరుకున్నారు. ఈ రోజు ఆయన జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది.  
► ఆ రోజుల్లో ఆయన ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని అంటే, నాన్నగారికి ముందున్న పాలకులు కరెంటు తీగలు చూపించి బట్టలు ఆరేసుకోవడానికి ఉపయోగపడతాయని అపహాస్యం చేశారు. అయితే వైఎస్సార్‌ ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్తు ఫైలుపై సంతకం చేసి రాష్ట్రంలో రైతు విప్లవానికి నాంది పలికారు.  
► ఇన్‌పుట్‌ సబ్సిడీ పెంపు, విత్తనాల ధరల తగ్గింపు, ఒక సంతకంతో కరెంటు బకాయిలు రద్దు.. ఇలా రైతుల కోసం ఎన్నో చేశారు. జలయజ్ఞంతో రాష్ట్రం రూపురేఖలు మార్చారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా రూపురేఖలను పూర్తిగా మార్చేసిన నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని చెబుతున్నాను.  
 
అదే స్ఫూర్తితో ముందుకు అడుగులు 
► దివంగత మహానేతను స్ఫూర్తిగా తీసుకుని ఈ రెండేళ్లూ మన పరిపాలన కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగా సాగిందని సగర్వంగా పేర్కొంటున్నాను. అందుకే ఈ రెండేళ్లలో రైతుల కోసం రూ.83 వేల కోట్లు ఖర్చు చేశాం. ఈ ఒక్కరోజే రైతన్నల కోసం ఏకంగా రూ.1,570 కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. 
► ఎన్నికల ప్రణాళికలో రైతుల బాగోగుల కోసం పని చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగా అన్నీ చేసుకుంటూ వచ్చాం. పంట వేసే సమయంలో రైతన్నకు పెట్టుబడి ఖర్చుల వల్ల, పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల నేపథ్యంలో కష్టాలు వస్తాయి. 
► పంట వేసిన తర్వాత, కరువు వల్లో, వర్షాల వల్లో పంట దెబ్బతిన్నప్పుడు రైతు తల్లిడిల్లుపోతున్న పరిస్థితి నా కళ్లారా చూశాను. వారి కష్టాలు తీర్చడంలో భాగంగా పెట్టుబడి సహాయంగా ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా రైతు భరోసా పథకం కింద రూ.13,500 చొప్పున మూడు విడతలుగా అందజేస్తున్నాం. దీనివల్ల దాదాపు 70 శాతం మంది రైతులకు పెట్టుబడి ఖర్చు ఇచ్చినట్లవుతుంది. ఈ రెండేళ్లలో 52.38 లక్షల మంది రైతన్నలకు రూ.17,029 కోట్లు ఇచ్చాం.  
 
ప్రతి అడుగులోనూ తోడుగా ఆర్బీకేలు 
► రైతుల కోసం ఆలోచించాం కాబట్టి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. విత్తనం నుంచి అమ్మకం వరకూ ప్రతి సందర్భంలోనూ రైతును చేయి పట్టుకుని సహాయ సహకారాలు అందిస్తూ ఈ కేంద్రాలు తోడుగా ఉంటున్నాయి.  
► ఆర్‌బీకేల ద్వారా రైతులకు ఎంతో మంచి జరుగుతోంది. ఇక్కడ నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను 48 గంటల్లో అందించే పరిస్థితి ఉంది. ఇదే అనంతపురం జిల్లాలో 2.33 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం ఎవరికీ కష్టం లేకుండా సులభంగా పంపిణీ చేయగలిగాం.  
► వేరుశనగ విత్తనాల కోసం గతంలో పడిగాపులు పడే పరిస్థితి. మండల కేంద్రాల్లో రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశాం. ఇదే ఆర్బీకేల ద్వారా ఈ–క్రాపింగ్‌ చేయిస్తున్నాం. ప్రతి పంట, విస్తీర్ణం సహా ఆర్బీకేల్లో నమోదు అవుతుంది. ఈ ఏడాది నుంచి ఫిజికల్‌గా రసీదులు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టాం. ఈ–క్రాపింగ్‌ జరిగిన వెంటనే పంటల బీమా, వడ్డీలేని రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, చివరకు పంటల కొనుగోలు కూడా ఆర్బీకేల ద్వారా జరుగుతోంది.  
► ప్రతి ఊళ్లో క్రాప్‌ ఇన్సూరెన్స్‌ చేస్తున్నాం. ఖరీఫ్‌లో నష్టం జరిగితే.. తర్వాత ఖరీఫ్‌కల్లా పరిహారం అందుతుంది. ఏ సీజన్‌లో నష్టం వస్తుందో, ఆ సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే. గతంలో యూనిట్‌ రూ.3.84 ఉన్న కరెంటు రేటును రూ.1.50కే ఇచ్చి ఆక్వా రైతులకు కూడా అండగా నిలిచాం.  
► ఆర్బీకేల పరిధిలో ఆ గ్రామానికి సంబంధించిన రైతులతో కూడిన వ్యవసాయ బోర్డు, మండల స్థాయిలో మరో బోర్డు, జిల్లా స్థాయిలో ఇంకో బోర్డు, రాష్ట్ర స్థాయిలో మరో బోర్డు సమావేశాలు జరుపుతున్నాయి. పంటల ప్రణాళికపై సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. ఏ సమయంలో ఏ పంట వేస్తే లాభాలు వస్తాయని  క్రాప్‌ ప్లానింగ్‌ చేస్తున్నాయి. 
► ఆర్బీకే స్థాయిలోనే రైతన్నలకు తక్కువ అద్దెకే కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల ద్వారా పనిముట్లను అందజేస్తున్నాం. రైతన్నలు తమ పంటలను అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్బీకేలను సంప్రదించవచ్చు. లేదంటే సీఎం యాప్‌ ద్వారా సమాచారం పంపినా ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధర  ధర ప్రకారం ఆ పంటను కొనుగోలు చేస్తారు. ఈ రెండేళ్లలో రూ.6,600 కోట్లకుపైగా (ధాన్యం, పత్తి కొనుగోళ్లు కాకుండా) ఖర్చు పెట్టాం. కంది, బొప్పాయి, చీనీ, వేరుశనగ, చివరకు పొగాకు కూడా కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలిచాం.  
 
పాల విప్లవానికి నాంది 

► కేవలం వ్యవసాయం మీదే ఆధారపడితే రైతుల ఆదాయాలు పెరగవని, అదనపు ఆదాయాలు కలిగినప్పుడే రైతులు బాగుపడతారని ఈ ప్రభుత్వం ఆలోచించింది. ఇందులో భాగంగా చేయూత, ఆసరా పథకాలు తీసుకు వచ్చాం. పాడిపశువుల కొనుగోలును ప్రోత్సహించాం.  
► అమూల్‌ను తీసుకు వచ్చాం. రేటు పెంచి కొనుగోలు చేసేలా కార్యాచరణ చేశాం. ప్రస్తుతం 2 వేల చోట్ల ఈ కార్యక్రమం జరుగుతోంది. త్వరలో రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం ద్వారా పాల విప్లవానికి నాంది పలకబోతున్నాం. 

 ఇదంతా అభివృద్ధి కాదా?  
అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని నేను అంటే గిట్టనివాళ్లు అంటున్నారు. బటన్‌ నొక్కి డబ్బులు మాత్రం ఇస్తున్నాడని అంటున్నారు. గ్రామాలకు వెళ్లి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో కనిపిస్తుంది. శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను నాడు–నేడు ద్వారా పూర్తిగా మార్చేశాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ సిలబస్‌తో బోధిస్తున్నాం. ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేశాం. అందులో అదే గ్రామం పిల్లలు 10–12 మంది పని చేస్తున్నారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌.. ఏ సేవ అయినా నేరుగా ఇంటి వద్దకే చేరుస్తున్నారు. అదే గ్రామంలో రెండడుగులు వేస్తే ఆర్బీకేలు రైతులకు అన్ని విధాలా తోడుగా ఉన్నాయి. విలేజ్‌ క్లినిక్స్‌ కనిపిస్తున్నాయి. 91 రకాల మందులు అందులో ఉంటాయి. 24 గంటలూ పని చేస్తాయి. సిబ్బందీ అక్కడే కాపురం ఉంటారు. మరో నాలుగు అడుగులు వేస్తే.. అంగన్‌వాడీ కేంద్రాలు ప్రీప్రైమరీగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకో నాలుగు అడుగులు వేస్తే.. ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్‌ తీసుకువచ్చి డిజిటల్‌ లైబ్రరీ కూడా అక్కడే కనిపించే పరిస్థితి. ఇదంతా అభివృద్ధి కాదా? 
 
శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను, ఆస్పత్రులను మార్చడం అభివృద్ధి అంటారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్న రైతులను చేయి పట్టుకుని నడిపిస్తూ.. కష్టాల నుంచి బయట వేసేందుకు పని చేస్తున్న ఆర్బీకేలను అభివృద్ధి అంటారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు రావడాన్ని లభివృద్ధి అంటారు. వివక్ష, అవినీతి లేకుండా.. నాకు ఓటు వేయని వారికి కూడా ఇవాళ మంచి జరుగుతోంది. నేనంటే గిట్టని వారందరికీ ఇదే చెబుతున్నా.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement