అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం జిల్లా రాయదుర్గంలో బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలు విజయయాత్ర చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాదిగా పాల్గొని వైఎస్ జగన్ అండతో తాము ఎంత ఉన్నతంగా బతుకుతున్నదీ వెల్లడించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలతో రాయదుర్గం కళకళలాడింది.
వీధివీధిలో సామాజిక న్యాయం వెల్లివిరిసింది. యువత బైక్ ర్యాలీతో సందడి చేశారు. ముందుగా శాంతినగర్‌లోని వైఎస్ విగ్రహానికి మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషశ్రీచరణ్, విప్ కాపు రామచంద్రారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి వేలాది మందితో ప్రారంభమైన బస్సు యాత్ర తేరుబజారులో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంది.
అప్పటికే వేలాది మందితో సభా ప్రాంగణం నిండిపోయింది. వారికి యాత్రలో వచ్చిన ప్రజలు కలిసి ఆ ప్రాంతమంతా జనసంద్రంలా కనిపించింది. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయగా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని విధాలా పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించారని వక్తలు చెప్పడంతో సభికుల నుంచి పెద్దఎత్తున హర్షం వ్యక్తమైంది. మనకు సాధికారత కల్పించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మరోమారు అధికారం కట్టబెడదామని మంత్రులు, నేతలు పిలుపునివ్వడంతో ప్రజలు ఈలలు, కేకలతో మద్దతు ప్రకటించారు.
పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమం: మంత్రి ఉషశ్రీచరణ్
బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు అండగా నిలిచి, అనేక కార్యక్రమాలతో వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న దేశంలో ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులు సిఫారసు చేస్తేనే పేదలకు పథకాలు అందేవని, సీఎంగా వైఎస్ జగన్ వచ్చాక పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్నారని తెలిపారు.
బడుగు, బలహీన వర్గాలు సీఎం వైఎస్ జగన్‌కు అండగా ఉండి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగనన్న స్కీమ్‌ల ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు స్కామ్‌ల సీఎం అని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో సీఎం జగనన్నపై ఎల్లో మీడియా దుష్ప్రచారం మరీ ఎక్కువవుతుందని, ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుడూ సైనికుడిలా దానిని తిప్పికొట్టాలని అన్నారు.
తలరాతలు మార్చిన బ్రహ్మ సీఎం జగన్: మంత్రి గుమ్మనూరు జయరాం
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల తలరాతలు మార్చిన బ్రహ్మ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఐదు కోట్ల ప్రజలకు మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి. అట్టడుగు వర్గాలను నవరత్నాల పథకాలతో ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. ఏకంగా రూ.2.50 లక్షల కోట్లు వారికి పంచిపెట్టారని అన్నారు.
2019లో ఒక ఓటు వేసినందుకే ఇన్ని కోట్లు పేదలకు పంచిపెట్టారని, 2024లో మళ్లీ సీఎం అయితే మన జీవితాలు మరింత బాగుపడతాయని వివరించారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏరోజైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు. తెలంగాణలో పోటీ చేసిన ఎనిమిది చోట్లా డిపాజిట్లు కూడా రాని పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏమి ఉద్దరిస్తారని నిలదీశారు. ముగ్గురు భార్యలకు గ్యారంటీ ఇవ్వలేని పవన్ ఇక ప్రజలకు ఏమి గ్యారంటీ ఇస్తారని అన్నారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు బీసీ కాదని, కే బ్రాండ్ బీసీ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment