సీహెచ్‌సీల్లోనూ ఆక్సిజన్‌ బెడ్లు | CM YS Jagan Comments In Review On Covid Prevention Measures | Sakshi
Sakshi News home page

సీహెచ్‌సీల్లోనూ ఆక్సిజన్‌ బెడ్లు

Published Sat, Aug 8 2020 3:52 AM | Last Updated on Sat, Aug 8 2020 7:52 AM

CM YS Jagan Comments In Review On Covid Prevention Measures - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 మరణాలు తగ్గించడంలో భాగంగా సామాజిక ఆసుపత్రుల్లో కూడా (సీహెచ్‌సీ) ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. జ్వరం, శ్వాసకోస సమస్యలతో బాధపడే వారి కోసం సీహెచ్‌సీ స్థాయిలోనే 5–10 బెడ్లు ఏర్పాటుచేయాలన్నారు. ఒకస్థాయి కేసులకు సీహెచ్‌సీలోనే వైద్యం అందించాలని, పరిస్థితి విషమిస్తే కోవిడ్‌ ఆస్పత్రులకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కోవిడ్‌–19 నివారణ చర్యలపై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో అందుతున్న సేవలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని ఆయన సూచించారు.
కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ఆస్పత్రులు, కోవిడ్‌ సెంటర్లలో భోజనం, పారిశుధ్యంపై ఆరా
► వైద్యం, మందులు, పారిశుధ్యం, భోజనం.. తదితర అంశాల్లో సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి.
► డాక్టర్‌ వైఎస్సార్‌ టెలీమెడిసిన్‌ ద్వారా మందులు పొందిన వారికి ఫోన్‌చేసి సేవల గురించి అడిగి తెలుసుకోవాలి.
► వ్యవస్థలు స్థిరంగా పనిచేస్తున్నాయా? లేదా అనే దానిపై అధికారులు పర్యవేక్షించాలి. లోపాలను సరిదిద్దుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలం. అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలి.
► అధికారులు స్పందిస్తూ.. మెనూ కచ్చితంగా అమలుచేసేలా చూస్తున్నామని.. దీనివల్ల నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తోందని వివరించారు. ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌పై కూడా శ్రద్ధపెట్టామని చెప్పారు.
► అలాగే, సీఎం ఆదేశాల మేరకు 110 కోవిడ్‌ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లు పెట్టామన్న అధికారులు, మిగిలిన చోట్ల కూడా త్వరలో ఏర్పాటుచేస్తామని చెప్పారు.

రాష్ట్రంలో కోవిడ్‌ పరీక్షలు బాగా చేస్తున్నాం
► క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లో 85–90 శాతం పరీక్షలు కొనసాగుతున్నాయి.
► 104, 14410 తదితర కాల్‌ సెంటర్ల పనితీరు సమర్థవంతంగా ఉండాలి.
► ప్రజలు ఏ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌చేసినా వెంటనే స్పందించే వ్యవస్థ ఉండాలి.
► అధికారులు అప్పుడప్పుడూ ఈ కాల్‌ సెంటర్లకు ఫోన్‌చేసి అవి సమర్థవంతంగా ఉన్నాయా? లేదా అన్నది పరిశీలించాలి.
► కాల్‌ సెంటర్‌ సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తంచేయాలి.

కోవిడ్‌ చికిత్సపై విస్తృత ప్రచారం
► కోవిడ్‌ సోకిందని అనిపిస్తే ఏం చేయాలన్న దానిపై అన్ని ప్రభుత్వాస్పత్రుల వద్ద హోర్డింగ్స్, పోస్టర్లు పెట్టించాలి.
► కోవిడ్‌ నివారణా చర్యల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యం తీసుకోండి. 
► ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను చేపట్టాలి.
► ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్న ఆస్పత్రులు, ఇతర వివరాలు అందుబాటులో ఉంచాలి.
► గ్రామాల్లో ఉన్న ఏఎన్‌ఎంలు ఆరోగ్యమిత్రలుగా.. ఆరోగ్యశ్రీకి రిఫరెల్‌ పాయింట్‌గా ఉండాలి. దీంట్లో వలంటీర్‌ భాగస్వామ్యం కూడా ఉండాలి.
► స్కూళ్లు తెరిచే సమయానికి పిల్లలకు విద్యాకానుకతోపాటు మాస్కులు కూడా ఇవ్వాలి.
► ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రకారం ప్లాస్మా ఇచ్చేవారికి రూ.5 వేలు ఇస్తున్నామని అధికారులు వెల్లడించారు.

మరణాల రేటు తగ్గించడంపై ప్రత్యేక శ్రద్ధ
మరణాల రేటు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. దీనికి సంబంధించిన వైద్యం క్షేత్రస్థాయికి చేరాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ..
► తీవ్ర లక్షణాలు ఉన్న వారిపై, మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.
► జ్వరం వచ్చి, శ్వాసకోస సమస్యలతో బాధపడితే, ఆక్సిజన్‌ లెవల్‌ పడిపోతే.. వెంటనే ఆస్పత్రిలో చేర్పిస్తున్నాం.
► అలాంటి లక్షణాలు ఉన్న వారిపై వెంటనే స్థానికంగా ఉండే ఏఎన్‌ఎంకు, వైద్యులకు సమాచారం ఇవ్వమని ప్రచారం చేస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement