ఇప్పుడున్న కాలేజీలను ప్రైవేటు వర్సిటీలుగా మార్చాలంటే వాటికి అత్యుత్తమ ప్రమాణాలను అర్హతగా నిర్దేశించాలి. వాటికి ప్రపంచంలోని 200 అత్యుత్తమ విద్యా సంస్థలతో జాయింట్ సర్టిఫికేషన్ ఉండాలి. ఐదేళ్ల కాలం పాటు ఇది కొనసాగాలి. ఈ ప్రమాణాలను అందుకుంటేనే ప్రైవేటు యూనివర్సిటీగా అనుమతి ఇవ్వడానికి తగిన అర్హత ఉన్నట్లు పరిగణించాలి.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లోని 35 శాతం సీట్లు ప్రభుత్వ కోటాలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ దిశగా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులకు కూడా ఆ నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం–2006కు సవరణలు చేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు.
ఏపీ ప్రయివేటు యూనివర్సిటీల చట్టం–2006 సవరణకు రూపొందించాల్సిన అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ప్రయివేటు యూనివర్సిటీల్లోని 35 శాతం సీట్లు ప్రభుత్వ కోటా కింద భర్తీ చేసే ప్రతిపాదనలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రయివేటు యూనివర్సిటీలు స్థాపించే వారికి అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కోవిడ్–19 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆన్‌లాక్ ఉత్తర్వుల మేరకు దశల వారీగా కాలేజీల పునః ప్రారంభం, క్లాసుల నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఎయిడెడ్ కాలేజీల నిర్వహణ పూర్తిగా ఇటు ప్రభుత్వ యాజమాన్యంలో, లేక అటు ప్రయివేటు యాజమాన్యాల చేతిలో ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఎయిడెడ్ కాలేజీలను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుందని, లేని పక్షంలో ప్రైవేటు యాజమాన్యాలే నడుపుకొనేలా చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ఉన్నత విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఆంగ్ల మాధ్యమం వల్ల ఇబ్బందులు రాకుండా చర్యలు
– ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో మాదిరిగానే రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలి. వెంటనే ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
– ఆంగ్ల మాధ్యమానికి విద్యార్థులు సంసిద్ధులయ్యేలా ఆయా కోర్సులలో తగిన మార్పులు, చేర్పులు చేపట్టాలి. డిగ్రీ మొదటి ఏడాదిలోనే ఆయా కోర్సులలో ఇందుకు సంబంధించిన అంశాలను ప్రవేశపెట్టాలి.
– 11, 12 తరగతులలో (జూనియర్ కాలేజీల్లో) కూడా ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశ పెట్టాలి. ఒకేసారి ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడం వల్ల ఇబ్బందులు రాకుండా పాఠ్య పుస్తకాలను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ముద్రించాలి.
ప్రతి గ్రామానికీ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్
– ప్రతి గ్రామానికీ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్‌ను తీసుకు వస్తున్నామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. దీనివల్ల పట్టణ ప్రాంత విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులందరికీ ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు.
– అమ్మ ఒడి, వసతి దీవెన పథకాల లబ్ధిదారులకు ఇచ్చే నగదుకు ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌లను సరసమైన ధరకు ఇచ్చేలా చూస్తున్నామని తెలిపారు. ఈ చర్యలు విద్యా రంగంలో, నైపుణ్య రంగంలో పెనుమార్పులను తీసుకు వస్తాయని పేర్కొన్నారు.
– వర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
యూనివర్సిటీలలో నిర్వహించే ఉద్యోగ నియామకాల్లో సిఫార్సులకు చోటు ఉండరాదన్నారు. నియామకాలన్నీ పారదర్శకంగా జరగాలని చెప్పారు. యూనివర్శిటీల్లో అత్యున్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలున్న బోధనా సిబ్బంది ఉండాలని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం ఇంటర్నెట్‌లేని వైఫై ప్రోటోకాల్
రాష్ట్రంలోని ఉన్నత విద్యలో ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం ఇంటర్నెట్‌లేని వైఫై ప్రోటోకాల్ ప్రాజెక్టును ఏర్పాటుచేసేందుకు ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. రిమోట్ డివైజ్ ద్వారా ఒకేసారి 500 మంది యూజర్లు కనెక్ట్ అయ్యేందుకు ఇందులో అవకాశముంటుంది. ఒక్కో రిమోట్ డివైజ్ పరిధి 100 మీటర్లు కాగా ల్యాప్ టాప్, ట్యాబ్, టీవీలతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. క్షణాల్లో డేటాను ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతుందని అధికారులు వివరించారు.
ఇంటర్నెట్ సౌకర్యం వచ్చిన తర్వాతకూడా ఆ సదుపాయాన్ని వాడుకునేలా డివైజ్‌ల రూపకల్పన ఉందని సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టుకు సీఎం అంగీకారం తెలిపారు. కాగా సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment