అమరావతి : నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో చెప్పిన ప్రతీ మాటను అక్షరాలా చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనేక సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలుచేస్తూ తనదైన పాలన అందిస్తున్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసిన ఆయన.. ముఖ్యమంత్రి అవగానే వాటిని పరిష్కరిస్తూ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు. నాడు పాదయాత్రలో ప్రజాపంపిణీ వ్యవస్ధలో కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్దులు, రోగులు పడుతున్న కష్టాలను గమనించి సమూలంగా మార్పులు తీసుకువస్తానని హమీ ఇచ్చిన వైఎస్ జగన్ ఇప్పుడు ఆ హమీని కూడా నెరవేరుస్తున్నారు. ఇంటివద్దకే రేషన్ సరుకులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా మెరుగుపరిచిన నాణ్యమైన స్వర్ణ రకం బియ్యాన్ని కార్డు దారుని ఇంటి వద్దే మొబైల్ వాహనం ద్వారా పంపిణీ చేయడమే లక్ష్యంగా సంవత్సరానికి రూ. 830 కోట్లు అదనంగా వెచ్చించి ఈ పధకం రూపొందించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వేదికగా గురువారం నాడు (21.01.2021) కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 డోర్ డెలివరీ వాహనాలను వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
నాణ్యమైన బియ్యం..
ఇప్పటివరకూ ప్రజా పంపిణీ వ్యవస్ధలో కార్డుదారులకు పంపిణీ చేయబడుతున్న బియ్యంలో నూకల శాతం, రంగుమారిన శాతం అధికంగా ఉండడం వల్ల కార్డుదారులు తినని బియ్యం రకాలు ఉండడం వల్ల ఎక్కువశాతం మంది వినియోగించడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా కార్డుదారులు ఇష్టంగా తినగలిగే మెరుగపరిచిన నాణ్యమైన స్వర్ణ రకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా నాణ్యతపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తిని తొలగించి ఎక్కువ శాతం ప్రజలు ఇష్టంగా తినే స్వర్ణ రకం బియ్యాన్ని పంపిణీ చేయుటకు పౌరసరఫరాల శాఖ మొట్టమొదటి సారిగా బియ్యం సేకరణ సమయంలోనే సమూలమైన మార్పులు చేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసే సమయంలోనే స్వర్ణ రకం బియ్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాటిని మిల్లింగ్ సమయంలోనే నూకలు 15 శాతం, దెబ్బతిన్న బియ్యం 1.5 శాతంకు తగ్గించి మెరుగుపరిచిన స్వర్ణ మధ్యస్ధ రకం సార్టెక్స్ బియ్యాన్ని సేకరించి కార్డుదారులకు అందించడం జరుగుతుంది.
నాణ్యత వివరాలు...
సార్టెక్స్ బియ్యం – గతంలో ఇవ్వలేదు – ఇప్పుడు 100 శాతం
నూకలు – గతం 25 శాతం – ఇప్పుడు 15 శాతం
ఇసుక, మట్టి, రాళ్ళు – గతం 0.5 శాతం – ఇప్పుడు 0 శాతం
చెడిపోయిన బియ్యం గింజలు – గతం 3 శాతం, ఇప్పుడు 0.75 శాతం
రంగుమారిన బియ్యం గింజలు – గతం 3 శాతం, ఇప్పుడు 0.75 శాతం
పరిపక్వం కాని బియ్యం గింజలు – గతం 5 శాతం, ఇప్పుడు 1 శాతం
పట్టు తక్కువ బియ్యం – గతం 13 శాతం, ఇప్పుడు 10 శాతం
ఇంటి వద్దనే రేషన్ డెలివరీ...
ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్ధలో చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడంలో కొంతమంది దుకాణదారులు సరైన సమయపాలన చేయకపోవడం, సరుకులను సక్రమంగా పంపిణీ చేయకపోవడం, సరుకులను నల్లబజారుకు తరలించడం వంటి వాటి వల్ల కార్డుదారులకు కలుగుతున్న ఇబ్బందుల దృష్ట్యా వారి సౌకర్యం కోసం ముఖ్యంగా వృద్దులు, రోగులు, వేతనాలు కోల్సోతున్న రోజువారీ కూలీల కోసం ప్రభుత్వం నిత్యావసర సరుకులను మొబైల్ వాహనం ద్వారా ఇంటివద్దకే అందించే విధానం ప్రవేశపెట్టడం జరుగుతుంది.పాత విధానంలో నిత్యావసర సరుకులు పొందాలంటే గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండడం వల్ల రోజువారీ కూలీలు వేతనాలు కోల్పోయేవారు. కానీ కొత్త విధానంలో కార్డుదారులకు ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ జరగడం వల్ల కూలీ పనులకు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో చౌకదుకాణం ద్వారా పంపిణీ చేయడం వల్ల సరుకుల పరిణామంలో తగ్గుదలపై అనేక ఫిర్యాదులు వచ్చేవి. కానీ కొత్త విధానం ద్వారా కార్డుదారుల సమక్షంలోనే సంచులు తెరిచి, ఖశ్చితమైన తూకంతో సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది
వలంటీర్ వ్యవస్ధను ఉపయోగించి కార్డుదారుల ఇంటి వద్దనే ప్రజల సమక్షంలో కార్డుదారుల వేలిముద్రల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని, ఖశ్చితమైన తూకంతో తిరిగి ఉపయోగించగలిగే సంచుల ద్వారా పంపిణీ చేయనున్నారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇవ్వనున్నారు. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతీ బియ్యం బస్తాకూ సీల్ వేయబడి ఉంటుంది, ప్రతీ సంచికీ కూడా యూనిక్ కోడ్ ఉండడం వల్ల ఆన్‌లైన్ ట్రాకింగ్ చేయబడుతుంది. అన్ని మొబైల్ వాహనాలకూ జిపిఎస్ అమర్చడం వల్ల కార్డుదారులు మొబైల్‌యాప్ ద్వారా పంపిణీ వివరాలు రియల్‌టైంలో తెలుసుకోవచ్చు. అంతేకాదు మొబైల్ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారుల సౌకర్యార్ధం సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతీ రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీనిపై నిరంతరం సోషల్ ఆడిట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ తూకం ద్వారా ఖశ్చితమైన తూకంతో సరుకుల పంపిణీ చేయనున్నారు.
మొబైల్ వాహనం...
బియ్యం, నిత్యావసర సరుకులు కార్డుదారులకు ఇంటివద్దే అందించేందుకు 9,260 మొబైల్ వాహనాలను రూ. 539 కోట్లతో కొనుగోలు చేయడం జరిగింది. ఈ వాహనాలను నిరుద్యోగ యువకులకు ఉపాధిహమీ కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా అర్హులైన లబ్దిదారులకు సంబంధిత సంస్ధల నుంచి 60 శాతం సబ్సిడీ ధరకు ప్రభుత్వం అందించింది. ఒక్కో వాహనం విలువ రూ. 5,81,000, ఇందులో 60 శాతం అనగా ప్రతీ వాహనం మీద రూ. 3,48, 600 సబ్సిడీగా వివిధ వెల్ఫేర్ కార్పొరేషన్ల నుంచి అందించడం జరిగింది. ఈ వాహనాలకు పౌరసరఫరాల సంస్ధ ప్రతీ నెలా అద్దె చెల్లిస్తూ ఆరు సంవత్సరాల పాటు వినియోగించుకోనున్నది.
ఎస్టీ కార్పొరేషన్ – 700
ఎస్సీ కార్పొరేషన్ – 2,300
బీసీ కార్పొరేషన్ – 3,800
మైనారిటీస్ కార్పొరేషన్ – 660
ఈడబ్యూ, ఈబీ కార్పొరేషన్ – 1,800
మొత్తం మొబైల్ వాహనాలు – 9,260
బియ్యం కార్డులు...
ఇప్పటివరకూ ప్రజలకు రేషన్ కార్డులు పొందడానికి సరైన విధానం అందుబాటులో లేక కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం సంక్షేమ పధకాలు పొందడానికి ప్రధానమైన బియ్యం కార్డును అర్హులైన ప్రజలకు అందించేందుకు సీఎం శ్రీ వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాల్లో 5 రకాల బియ్యం కార్డు సంబంధిత సేవలను అందిస్తూ కేవలం 10 రోజుల లోపు బియ్యం కార్డును అందించడం జరుగుతుంది.
5 రకాల బియ్యం కార్డు సంబంధిత సేవలు...
1. కొత్త రైస్ కార్డు
2. రైస్ కార్డు విభజన
3. రైస్ కార్డులో సభ్యుల చేరిక
4. రైస్ కార్డులో సభ్యుల తొలగింపు
5. రైస్ కార్డు అప్పగించుట
జూన్, 2020 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన రేషన్ కార్డ్‌ల వివరాలు
కొత్త బియ్యం కార్డ్‌లు – 4,93, 422
కొత్త బియ్యం కార్డ్‌లలో సభ్యులను చేర్చుట – 17,07,928
కొత్త బియ్యం కార్డ్‌ను విభజించుట – 4,38,013
మొత్తం – 26,39,363
Comments
Please login to add a commentAdd a comment