సాక్షి, అమరావతి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం వద్ద లైబ్రరీ, మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటితో పాటు ఆయన జీవిత విశేషాలను, ఆయన ప్రవచించిన సూక్తులను అక్కడ ప్రదర్శించాలని నిర్దేశించారు. అదే విధంగా పార్కు వద్ద రహదారిని విస్తరించి, ఫుట్‌పాత్‌ను కూడా అభివృద్ధి చేసి, రెండింటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు – పార్క్ అభివృద్ది మాస్టర్ ప్లాన్‌పై సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా.. భారీ అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనానికి సంబంధించి రెండు రకాల ప్లాన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో భాగంగా నాగపూర్‌లో ఉన్న అంబేడ్కర్ దీక్ష భూమి, ముంబైలో ఉన్న చైత్య భూమి, లక్నోలోని అంబేడ్కర్ మెమోరియల్, నోయిడాలోని ప్రేరణాస్థల్‌ను ఉదాహరణగా చూపారు. అదే విధంగా గ్యాలరీ, ఆడిటోరియమ్ ఎలా ఉంటుందన్న అంశంపైనా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పనులు ప్రారంభమైన 14 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. (చదవండి: శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు)
ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్మృతివనంలో ఏర్పాటు చేసే విగ్రహం ఏమాత్రం కళ తగ్గకుండా, దీర్ఘకాలం నాణ్యంగా ఉండేలా రూపొందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ల్యాండ్‌స్కేప్‌లో పచ్చదనంతో నిండి ఉండాలని పేర్కొన్నారు. కాగా ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
భూసేకరణపై దృష్టి సారించండి
రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ అంశంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు..అవసరమైన భూసేకరణపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా, కడప ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం అవసరమైన భూమి సేకరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐటీ మంత్రి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment