విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న సీఎం జగన్
విజయవాడలో రిటైనింగ్‌వాల్, రివర్ ఫ్రంట్ పార్కును ప్రారంభించిన సీఎం జగన్
రూ.500 కోట్లతో నిర్మించిన కృష్ణా రిటైనింగ్ వాల్‌తో వరదల నుంచి నిశ్చింత
రూ.239 కోట్లతో మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు శంకుస్థాపన
31,866 మంది పేదలకు సంపూర్ణ హక్కులతో పట్టాలు జారీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కళ్లెదుటే ఇంత అభివృద్ధి కనిపిస్తున్నా రాష్ట్రంలో కొంతమంది మాత్రం ఒప్పుకోవట్లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. విజయవాడను గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.వందల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ఏకంగా రూ.400 కోట్లతో అంబేడ్కర్ పార్కును మీ కళ్లెదుటే ప్రారంభించి పూర్తి చేశామని గుర్తు చేశారు. గత సర్కారు హయాంలో బెజవాడలో ఓ ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని దుస్థితి నెలకొనగా మనందరి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లైఓవర్‌లు నిర్మించామని చెప్పారు.
మంగళవారం విజయవాడలో పర్యటించిన సీఎం జగన్ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, కృష్ణా రివర్ ఫ్రంట్ పార్కు (కృష్ణ జలవిహార్)లను ప్రారంభించారు. రూ.239 కోట్లతో నగరంలో ఐదు చోట్ల నిర్మించే మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. õవిజయవాడ పురపాలక సంస్థ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్ధలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలు అందజేశారు. కొందరు లబ్ధిదారులకు సీఎం జగన్ స్వయంగా వీటిని అందించారు. తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే..
లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పత్రాలను అందజేస్తున్న సీఎం జగన్, వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి
31,866 పట్టాల రెగ్యులరైజ్...
ఈరోజు విజయవాడలో వివిధ కేటగిరీలకు సంబంధించి 31,866 పట్టాలను రెగ్యులరైజ్ చేసి ఆయా కుటుంబాలకు సంపూర్ణ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 22 ఏ కింద చేర్చడంతో హక్కులు లేక, రిజిస్ట్రేషన్ జరగక ఇబ్బంది పడుతున్న దాదాపు 21 వేల మంది వీరిలో ఉన్నారు. ఈ దుస్థితిని తొలగిస్తూ విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్‌లో 16 కాలనీల వాసులకు మంచి చేస్తున్నాం. భ్రమరాంబపురంలో ఇళ్లు కట్టుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న నిరుపేద కుటుంబాలు రెగ్యులరైజ్ కాకపోవడంతో అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బంది పడుతున్నట్లు అవినాష్ నా దృష్టికి తెచ్చాడు. వీటన్నింటికీ పరిష్కారం చూపుతూ రెగ్యులరైజ్ జరుగుతోంది. ఎలాంటి వివాదాలు లేని 9,125 పట్టాలను కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం.
రూ.400 కోట్లతో అంబేడ్కర్ పార్కు
విజయవాడలో మీ బిడ్డ ప్రభుత్వం రూ.400 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి అంబేడ్కర్ పార్కుకు అందరి కళ్లెదుటే పునాది రాయి వేయడంతోపాటు ప్రారంభించటాన్ని కూడా చూశారు. గతంలో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలంటే ఒక్క ఫ్లై ఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి 58 నెలల వ్యవధిలో పెండింగ్ ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లై ఓవర్లు అదే రోడ్డులో నిర్మించాం. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ కూడా కలిపితే ఇంకో ఫ్లై ఓవర్ కూడా సాకారమైంది. ఇవన్నీ మన కళ్ల ఎదుటే యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి.
బెజవాడ ట్రాఫిక్ కష్టాలకు విముక్తి
గుంటూరు నుంచి ట్రాఫిక్ విజయవాడ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా ట్రాఫిక్ కష్టాలకు విముక్తి కల్పిస్తూ కాజ నుంచి చిన్న అవుటపల్లి వైపు వెళ్లేలా చేపట్టిన ఔటర్ పనుల ప్రాజెక్టు పూర్తి కావచ్చింది. మరో రెండు నెలల్లో దీన్ని ప్రారంభించేలా పనులు జరుగుతున్నాయి. 58 నెలలుగా మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ మంచి చేస్తూ ప్రతి అడుగూ అభివృద్ధి దిశగా వేస్తున్నాం. మనందరి ప్రభుత్వంలో స్కూళ్లు, హాస్పటళ్లు బాగుపడ్డాయి. గ్రామీణ స్థాయిలో వ్యవసాయం బాగుపడింది. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థల ద్వారా ఎప్పుడూ చూడని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క రూపాయి లంచం లేకుండా వివక్షకు తావులేకుండా అర్హులందరికీ పారదర్శకంగా మేలు చేస్తున్నాం.
కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, కల్పలతారెడ్డి, మొండితోక అరుణకుమార్, రుహూల్లా ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆసిఫ్, డీసీఎంఎస్ చైర్మన్ పడమట స్నిగ్థ, నీటి పారుదల, మున్సిపల్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శశిభూషణ్, శ్రీలక్ష్మి, సీసీఎల్‌ఏ సాయిప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్‌కుమార్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్‌డీవో భవాని శంకర్, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.
రూ.500 కోట్లతో కరకట్ట గోడలు..
కృష్ణా నదికి వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా దాదాపు రూ.500 కోట్లతో కరకట్ట గోడలు నిర్మించాం. గతంలో వరద వస్తే కృష్ణలంక ప్రాంతం నీట మునిగేది. గత పాలకులు మాటలకే పరిమితమయ్యారు. ఇలా గోడ కట్టాలని ఆలోచన చేసిన పాపాన పోలేదు. కృష్ణలంక ప్రాంతంలో అక్కచెల్లెమ్మలు, పిల్లలు, అవ్వలు, తాతలు సాయంత్రం పూట ఆహ్లాదకరంగా గడిపేందుకు పార్కు సుందరీకరణ పనులు చేపట్టాం.
చిత్తశుద్ధితో నిర్మించారు
వరద వచ్చినప్పుడల్లా మా ప్రాంతంలోని ఇళ్లు ముంపునకు గురయ్యేవి. దీన్ని పరిష్కరించేందుకు ఎంతో మంది నాయకులు హామీ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం రిటైనింగ్ వాల్ నిర్మించారు. వారధి దిగువనే కాకుండా, ఎగువన కూడా నిర్మించారు. ఎగువ ప్రాంతంలో పార్కు అభివృద్ధి చేస్తాననడం సంతోషంగా ఉంది. – కసగోని జ్యోతి, రణదివెనగర్
శాశ్వత పరిష్కారం లభించింది
రాణిగారితోట తారకరామనగర్ కరకట్ట దిగువన కూలీ పనులు చేసుకుంటూ కుటుంబంతో జీవిస్తున్నాం. తుపానులు వచ్చినప్పుడల్లా తట్టాబుట్టా సర్దుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లం. వరద ముంపునకు గురైన మా ప్రాంతాన్ని సీఎం జగన్ కళ్లారా చూసి చలించిపోయి గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గోడ నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభించింది. – ఏలూరి వినయ్, తారకరామనగర్
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం
మేం 45 ఏళ్లుగా విజయవాడ నందమూరినగర్‌లో ఉంటున్నాం. కూలి పనులు చేసుకుంటూ అక్కడే ఒక బీ–ఫారం పట్టా ఉన్న ఇల్లు కొనుక్కున్నాను. అయితే ఎప్పుడు ఎవరొచ్చి ఖాళీ చేయమంటారోనని నిత్యం భయంతో కాలం వెళ్లదీశాను. కంటి నిండా నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి తిండి ఉండేది కాదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి... పోయాయి. ఎప్పటి నుంచో అధికారులు, నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. కానీ ఫలితం లేకుండా పోయింది. బీ–ఫారం పట్టాకు సంపూర్ణ భూ హక్కు పత్రాలను ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. – చోడవరపు దుర్గ, నందమూరినగర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment