Jagananna Vidya Kanuka Kits Scheme 2022: CM YS Jagan On Jagananna Vidya Kanuka Kits Distribution Program - Sakshi
Sakshi News home page

CM YS Jagan: పేదరికానికి విద్యతోనే వైద్యం

Published Wed, Jul 6 2022 3:41 AM | Last Updated on Wed, Jul 6 2022 10:52 AM

CM YS Jagan On Jagananna Vidya Kanuka Kits Distribution Program - Sakshi

విద్యార్థినులతో కలిసి స్కూల్‌ బ్యాగును ధరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో ప్రతి విద్యార్థీ ఇంగ్లిష్‌ మీడియంలో చదివి ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదిగినప్పుడే ఆ కుటుంబం పేదరికం నుంచి బయట పడుతుందని, ఇందుకోసమే 9 రకాల కార్యక్రమాలను అమలు చేస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మన బడి నాడు–నేడు, విద్యాకానుక, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, అమ్మ ఒడి, ఇంగ్లిష్‌ మీడియం, విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేయడంతోపాటు 9వ పథకంగా బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.

పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించాలనే తాపత్రయంతో అడుగులు ముందుకేస్తున్నామని, అందుకోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా ఆదోనిలో వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యాకానుక ద్వారా పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు ఉచితంగా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది 47 లక్షల మందికిపైగా విద్యార్థులకు ఒక్కొక్కటి రూ.1,964 విలువ చేసే కిట్‌ను దాదాపు రూ.931 కోట్లు వెచ్చించి ప్రభుత్వం అందచేస్తోంది.

ఈ సందర్భంగా ఆదోనిలో ‘నాడు–నేడు’ ద్వారా రూపురేఖలు మారిన నెహ్రూ మెమోరియల్‌ పాఠశాలను సీఎం జగన్‌ వీక్షించారు. తరగతి గదులలో విద్యార్థులతో పాటు బల్లపై కూర్చుని ఆప్యాయంగా ముచ్చటించారు. నేరుగా వెళ్లి పిల్లల కోసం ఏర్పాటు చేసిన తాగునీటిని స్వయంగా తాగి చూశారు. పుస్తకాలు, యూనిఫాంతో పాటు విద్యాకానుక కిట్లను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో విద్యార్థులు, తల్లిదండ్రులనుద్దేశించి మాట్లాడారు. ఆ వివరాలివీ..
ఆదోనిలో జరిగిన ‘జగనన్న విద్యా కానుక’ కిట్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, ప్రజలు  

రేపటి తరం భవిష్యత్‌ కోసం..
పిల్లలను బడికి పంపే తల్లులకు మూడేళ్లుగా జగనన్న అమ్మఒడి అమలు చేస్తున్నాం. ఉద్యమంలా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. బడికి వెళుతున్న పిల్లలకు కనీసం పౌష్టికాహారం అందించాలని కూడా గత పాలకులు ఆలోచించలేదు. ఎదిగే చిన్నారులకు అది ఎంత అవసరమో ఆలోచించి ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో రుచికరంగా రోజుకో మెనూ తీసుకొచ్చాం.

ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందిస్తున్నాం. మంచి చదువుల కోసం ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చాం. పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా ద్విభాషా పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టాం. శ్రీమంతుల పిల్లలు రూ.24 వేలు చెల్లించే బైజూస్‌ను మన పిల్లల కోసం తీసుకొచ్చాం. రేపటి తరం భవిష్యత్‌పై దృష్టి సారించిన ఏకైక ప్రభుత్వం మనది. రాబోయే 10–15 ఏళ్లలో ఎలాంటి పోటీ ఉంటుంది? అని ఆలోచించి పోటీ ప్రపంచంలో నెగ్గేలా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నాం.

తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే..
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన పేదలందరికీ నవరత్నాల ద్వారా మంచి చేస్తున్నాం. రేపటి తరం పేదరికం నుంచి బయటపడేలా పిల్లలు బాగా చదువుకునే వాతావరణం కల్పిస్తున్నాం. నాణ్యమైన విద్యా బోధనతో తలరాతలు మార్చేలా అడుగులు వేస్తున్నాం. ఇందులో భాగంగానే జగనన్న విద్యాకానుకకు శ్రీకారం చుట్టాం. వరుసగా మూడో ఏడాది పిల్లలు బడిలోకి అడుగుపెట్టే రోజే ‘విద్యాకానుక’ చేతిలో పెడుతున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని 1–10 తరగతుల పిల్లలకు జగనన్న విద్యాకానుక కిట్లు అందిస్తున్నాం.

ఇంటి నుంచి బడికి వెళ్లేందుకు, అక్కడ బాగా చదువుకునేందుకు కావాల్సిన వస్తువులన్నీ సమకూరుస్తున్నాం. విద్యాకానుక కిట్‌లో ప్రతి విద్యార్థికి కుట్టుకూలీతో సహా 3 జతల యూనిఫాం, నాణ్యమైన స్కూల్‌ బ్యాగు, ద్విభాషా పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌ బుక్స్, రెండు జతల సాక్స్‌లు, బూట్ల ఇస్తున్నాం. వీటితో పాటు గతేడాది ఇచ్చిన డిక్షనరీలు పోగొట్టుకున్నవారికి, కొత్తగా చేరేవారికి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ అందచేస్తున్నాం. పిల్లల చదువుల కోసం డబ్బులు ఖర్చు చేయలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు.
విద్యార్థులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్

మంచి ఫలితాలు సాధించాలని..
ఏటా విద్యార్థుల సంఖ్యతో పాటు విద్యాకానుకపై పెట్టే ఖర్చు కూడా పెరుగుతోంది. అయినా సరే ఎక్కడా కూడా మీ జగన్‌.. మీ మేనమామ వెనుకడుగు వేయలేదు. విద్యాకానుక తొలిఏడాది 2020–21లో ఒక్కో కిట్‌ సగటున రూ.1,531 చొప్పున 42,34,322 మంది పిల్లలకు ఇచ్చేందుకు రూ.650 కోట్లు ఖర్చు చేశాం. 2021–22లో ఒక్కో కిట్‌కు రూ.1,726 చొప్పున ఖర్చు చేసి 45,71,051 మంది పిల్లలకు రూ.790 కోట్ల వ్యయంతో అందించాం. ఈ ఏడాది ఒక్కో కిట్‌ రూ.1,964 చొప్పున 47 లక్షల మంది పిల్లలకు ఇచ్చేందుకు రూ.931 కోట్లు వెచ్చించాం.

గతేడాది కంటే ఎక్కువ మంది పిల్లలు బడుల్లో చేరతారని మరిన్ని కిట్లను అందుబాటులోకి తెచ్చాం. ఇదే కాదు.. పిల్లల జీవితాలను మెరుగుపరిచేందుకు మరో అడుగు ముందుకేశాం. 8 తరగతిలోకి అడుగు పెట్టే 4.70 లక్షల మంది విద్యార్థులకు సెప్టెంబర్‌లో ట్యాబ్‌లను అందించబోతున్నాం.

ఒక్కో ట్యాబ్‌ విలువ రూ.12 వేలు ఉంటుంది. పిల్లల చక్కటి భవిష్యత్‌ కోసం ట్యాబ్‌లు ఇచ్చేందుకు రూ.500 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. బైజూస్‌ ద్వారా విద్యా బోధన సులభంగా జరిగేలా ట్యాబ్‌లతో అనుసంధానిస్తాం. 2025 మార్చిలో సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నాం. 

మూడేళ్లలో పెను మార్పులతో.. 
చంద్రబాబునాయుడు హయాంలో 2018–19లో ప్రభుత్వ పాఠశాలల్లో 1–10 తరగతి వరకు చదివే విద్యార్థులు 37,010 లక్షల మంది ఉండగా 2021–22లో ఏకంగా 44.30 లక్షలకు పెరిగారు. అంటే అదనంగా 7.20 లక్షల మంది పెరిగారు. వీరంతా ప్రైవేట్‌ స్కూళ్లు మానేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులే దీనికి కారణం. 44 లక్షల మంది తల్లులకు, తద్వారా 80 లక్షల మంది పిల్లలకు మేలు చేసేలా రూ.19,617 కోట్లు ఒక్క అమ్మఒడి పథకానికే ఖర్చు చేశాం.

పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పెద్ద చదువులు ప్రతీ పిల్లాడికి అందాలని 21,55,298 మందికి మేలు చేస్తూ రూ.7,700 కోట్లు ఇచ్చాం. చదువులతో పాటు భోజనాలు, హాస్టల్‌ కోసం  ఇబ్బంది పడకూడదని ఇంజనీరింగ్, మెడిసిన్‌ చదివేవారికి రూ.20 వేలు, పాలిటెక్నిక్‌ వారికి రూ.15 వేలు, ఐటీఐ చదివేవారికి రూ.10 వేలు చొప్పున ‘వసతి దీవెన’ ద్వారా రూ.3,329 కోట్లు అందచేశాం. గోరుముద్ద ద్వారా ఏటా రూ.1,850 కోట్లు ఖర్చు చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో మధ్యాహ్న భోజన పథకానికి రూ.500 కోట్లు కూడా సరిగా ఖర్చు చేయలేదు.

8–9 నెలల పాటు సరుకులు ఇవ్వకుండా, ఆయాలకు బకాయిలు పెట్టారు. అంగన్‌వాడీలలో గర్భిణిలు, బాలింతలు, ఆరేళ్ల పిల్లలకు పోషకాహారం కోసం చంద్రబాబు హయాంలో ఏడాదికి రూ.500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా రూ.1,950 కోట్లు వ్యయం చేస్తున్నాం. ఇక ఈ ఏడాది బైజూస్‌తో ఒప్పందం చేసుకుని ట్యాబ్‌ల కోసం అదనంగా రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పాఠశాలల్లో టాయిలెట్లపై ప్రత్యేకంగా ధ్యాసపెట్టడమే కాకుండా చిట్టి చెల్లెమ్మలకు ఇబ్బంది రాకూడదని నెలకు 10 న్యాప్‌కిన్స్‌ ‘స్వేచ్ఛ’ పథకం ద్వారా ఉచితంగా అందచేస్తున్నాం.
పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మంత్రులు, అధికారులు 

ఆదోనిపై వరాల జల్లు
ఆదోని అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్‌ పలు వరాలు ప్రకటించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరుతోపాటు ఆటోనగర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగనన్న కాలనీలకు  బీటీ రోడ్లు మంజూరు చేశారు. ఆదోని పట్టణంలో రోడ్ల  విస్తరణకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. బుడగ జంగాలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నియమించిన ఏకసభ్య కమిషన్‌ నివేదికను ఎస్సీ కమిషన్‌కు పంపామని, కేంద్ర ప్రభుత్వానికి కూడా అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

బోయల రిజర్వేషన్లకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. తాగునీటి కోసం గ్రామాల్లో సర్వే చేయించి నీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ, కార్మికశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరాం, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ ఎమ్మెల్యేలు సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, శ్రీదేవి, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

బ్యాగు ధరించి..
ఆదోనిలో జగనన్న విద్యాకానుక పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ కొద్దిసేపు స్కూలు విద్యార్థి అయ్యారు. కిట్లు పంపిణీ సమయంలో తాను కూడా స్కూలు బ్యాగు భుజాన ధరించి విద్యార్థులతో సరదాగా గడిపారు. అనంతరం విద్యార్థుల భుజాలకు స్వయంగా బ్యాగులు అమర్చి అభినందించారు. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. 

మీ మేనమామ సంకల్పం
‘‘విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రూపురేఖలు సమూలంగా మారుస్తున్నాం. మన రాష్ట్రంలో బడి మానేసే పిల్లలు తగ్గాలి. చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరగాలి. పిల్లలను బడికి పంపించి పెద్ద చదువులు చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలి. ఈతరం, రాబోయే తరం పేదరికం సంకెళ్లను తెంచుకోవాలి.

సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గాలి. మంచి చదువులు, పెద్ద చదువులు, ఇంగ్లిషు మీడియం చదువులు పేదింటి పిల్లలకు అందాలి. అప్పుడే ప్రతి ఇంట్లో ఆనందాన్ని, అభివృద్ధిని చూస్తాం. ఇంగ్లిషు మీడియం చదువుతోనే పేదరికాన్ని జయిస్తాం. పిల్లలు, వారి చదువులు, భవిష్యత్తు బాగుండాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నా. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి చదువే. ఇది నా సంకల్పం. మీ మేనమామ సంకల్పం’’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement