ప్రీప్రైమరీ చిన్నారుల కోసం రూపొందించిన పుస్తకాలను, ఉపకరణాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల సంక్షేమం, భద్రత దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ ఇప్పటికే విప్లవాత్మక చట్టం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి సంబంధించి గురువారం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన క్యాంపు కార్యాలయంలో హోం, మహిళా సంక్షేమం, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, మెప్మా తదితర శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా ముందు రోజు.. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని, దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్‌తో 2,000 స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దిశ యాప్ కోసం ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో ఆ రోజు (8వ తేదీ) మొబైల్ ఫోన్ల కొనుగోలుపై మహిళలకు 10 శాతం రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా భద్రత, సాధికారతపై షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించాలని, ప్రతి వింగ్ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలని నిర్ణయించారు. పోలీసు శాఖలో పని చేస్తున్న మహిళలందరికీ ఆ రోజు స్పెషల్ డే ఆఫ్‌గా ప్రకటించనున్నారు.
క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
సీఎం నిర్ణయాలు, ఆదేశాలు ఇంకా ఇలా..
– అంగన్‌వాడీ ఉద్యోగులందరికీ ఏటా హెల్త్ చెకప్ చేయించాలి.
– నాన్ గెజిటెడ్ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు.
– చేయూత కిరాణా దుకాణాల్లో అందుబాటులో శానిటరీ పాడ్స్ ఉంచాలి. ఇందు కోసం సెర్ప్, మెప్మా, హెచ్‌ఎల్‌ఎల్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవాలి.
– ప్లస్–1, ప్లస్–2లో విద్యార్థినులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
– జూనియర్ కాలేజీల నుంచి పైస్థాయి కాలేజీల వరకు ‘దిశ’పై ప్రచారం నిర్వహిస్తూ హోర్డింగులు ఏర్పాటు చేయాలి. ఇందులో దిశ యాప్ సహా అన్ని వివరాలు ఉండేలా చూడాలి. దిశ కింద తీసుకుంటున్న చర్యలు, దీనిపై అవగాహన కల్పించేలా విస్తృతంగా ప్రచారం కొనసాగాలి.
– ఈ సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ఏ రవిశంకర్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్, డీఐజీ (టెక్నికల్ సర్సీసెస్) జి పాలరాజు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment