వైఎస్‌ జగన్‌: ‘జగనన్న విద్యాకానుక’ ప్రారంభం | YS Jagan Launches 'Jagananna Vidya Kanuka' Scheme from Krishna District, Kankipadu - Sakshi
Sakshi News home page

‘జగనన్న విద్యాకానుక’ ప్రారంభం

Published Thu, Oct 8 2020 11:35 AM | Last Updated on Thu, Oct 8 2020 2:39 PM

CM YS Jagan Launch Jagananna Vidya Kanuka - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్టాత్మక పథకానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. తొలుత పునాదిపాడు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో నాడు-నేడు పనులను పరిశీలించిన సీఎం.. విద్యార్థులను ప్రేమగా, ఆప్యాయంగా పలకరించి కాసేపు వారితో మాట్లాడారు. తరగతి గదుల్లో బల్లలపై కూర్చుని విద్యార్థుల అభిప్రాయాలను సీఎం జగన్‌ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్‌ కిట్‌లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. (చదవండి: ఒకవైపు ఆంగ్లం.. మరోవైపు తెలుగు)

పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు,  మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను ఈ కిట్ల రూపంలో అందించనున్నారు. పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఇబ్బంది పడే పేదింటి అక్కచెల్లెమ్మలకు విముక్తి కలిగించడంతో పాటు, పాఠశాలల్లో “డ్రాప్‌ అవుట్‌లను గణనీయంగా తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకుక బాటలు వేయడమే లక్ష్యంగా “జగనన్న విద్యా కానుక’ను ప్రభుత్వం అమలు చేస్తోంది. (చదవండి: ‘ఎవరైనా లంచం అడిగితే ఆ నంబర్‌ ఇవ్వాలి’)

రాష్ట్ర వ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థిని, విద్యార్థులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్కూల్‌ కిట్లు పంపిణీ చేస్తున్నారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలు యూనిఫామ్‌లు కుట్టించుకునే విధంగా వారికి ముందుగానే ఈ కిట్లు అందజేస్తున్నారు. ప్రతి విద్యార్థికి స్కూల్‌ కిట్‌తో పాటు మూడు మాస్కులు అందించనున్నారు. 3.13 కోట్లకు పైగా పాఠ్య పుస్తకాలు, 2.19 కోట్లకు పైగా నోట్‌ పుస్తకాలు, 1.27 కోట్ల యూనిఫారాలు (క్లాత్‌), బూట్లు, సాక్సులు, బెల్టు, బాల బాలికలకు వేర్వేరు రంగుల బ్యాగులు ఆయా తరగతులకు తగ్గట్టుగా అందించనున్నారు. యూనిఫామ్‌ కుట్టు కూలీ మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా జమ చేస్తారు. స్కూల్‌ కిట్‌కు సంబంధించిన వస్తువుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. అత్యంత పారదర్శకంగా రివర్స్‌ టెండరింగ్, ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో సేకరించారు.

చదువుకు పేదరికం అడ్డుకాకూడదు: మంత్రి సురేష్‌
విద్యా ప్రమాణాలు పెంచడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. పేద విద్యార్థులకు బంగారు బాట వేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నాడు - నేడు కింద ప్రతి పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దామని, నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని సీఎం జగన్ భావించారని, 'జగనన్న విద్యాకానుక'తో విద్యార్థులకు సీఎం జగన్ అండగా ఉన్నారని మంత్రి సురేష్‌ తెలిపారు.

ఎన్నో సంక్షేమ పథకాలు: పార్థసారధి
వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. ఎక్కడాలేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయికి సీఎం జగన్ తెచ్చారని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. కుల,మతాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పార్థసారధి పేర్కొన్నారు.

జగన్‌ మావయ్య అంటే ఎంతో ఇష్టం..
సభ వేదికపై సీఎం వైఎస్‌ జగన్‌ని విద్యార్థులు మావయ్య అంటూ సంబోధిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారు మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. జగన్‌ మామాయ్య సీఎం అయిన తర్వాత చాలా పథకాలు ప్రవేశ పెట్టారని, 'జగనన్న విద్యాకానుక'ను ప్రారంభిస్తున్నారని తెలిపారు. ‘‘నేను భవిష్యత్‌లో కలెక్టర్ కావాలని అనుకుంటున్నా. నేను కలెక్టర్ అయ్యేంతవరకు సీఎంగా జగనే ఉండాలని కోరుకుంటున్నా. జగన్ మావయ్య అంటే నాకు ఎంతో ఇష్టం’’ అంటూ హైస్కూల్‌ విద్యార్థిని అభిమానాన్ని చాటుకుంది.

మరో విద్యార్థిని లీలాలహరి మాట్లాడుతూ 3వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్‌లో చదివానని, కానీ ఇప్పుడు గవర్న్‌మెంట్ స్కూల్‌లో చేరానని తెలిపింది. ‘జగనన్న విద్యాకానుక’ ఇవ్వడం పట్ల చాలా ఆనందంగా ఉందని పేర్కొంది. ఈ స్కూల్‌లో చదవడం తనకు చాలా గర్వంగా ఉందని, అన్ని వసతులు ఉన్నాయని విద్యార్థిని తెలిపింది.

విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ జగనన్న విద్యాకానుక ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రారంభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తల్లిదండ్రులు తెలిపారు.


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement