‘ప్రైవేట్‌’కు వ్యాక్సిన్‌పై పునరాలోచించండి | CM YS Jagan letter to PM Narendra Modi On Covid Vaccine | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌’కు వ్యాక్సిన్‌పై పునరాలోచించండి

Published Sun, May 23 2021 3:01 AM | Last Updated on Sun, May 23 2021 5:58 PM

CM YS Jagan letter to PM Narendra Modi On Covid Vaccine - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణకు ప్రస్తుతం వ్యాక్సినేషనే శరణ్యమని, ఇలాంటి పరిస్థితిలో ప్రైవేట్‌ ఆస్పత్రుల వారు నేరుగా వ్యాక్సిన్‌ కోనుగోలు చేసుకోవడానికి కేంద్రం అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. దేశంలో వ్యాక్సిన్‌ సరఫరా తగినంత లేని ఈ సమయంలో ఈ నిర్ణయం ప్రజల్లో తప్పుడు సంకేతాలకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజల భయాలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలుగా దోపిడీ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోవిడ్‌ నియంత్రణకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలుపుతూ.. వ్యాక్సిన్‌ సరఫరా విషయమై వాస్తవ పరిస్థితి వివరిస్తూ పలు సూచనలు చేశారు. ప్రధానంగా వ్యాక్సిన్‌ సరఫరాను కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే పరిమితం చేయాలని కోరారు. ఈ లేఖలోని వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. 

ప్రజలపై భారం పడుతుంది..
► రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించాము. అయితే తగిన సంఖ్యలో టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల తొలుత 45 ఏళ్లు దాటిన వారందరికీ రెండు డోస్‌ల టీకాలు పూర్తి చేసే ప్రక్రియలో ముందుకు వెళ్తున్నాము.
► మరోవైపు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కోవిడ్‌ వ్యాక్సిన్లు కొనుగోలు చేయవచ్చన్న కేంద్ర నిర్ణయం ప్రజల్లో తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తోంది. వాక్సిన్ల ధరల్లో తేడాలు, ఏ రేటుకు వాక్సిన్‌ వేయాలన్న దానిపై ఆయా ఆస్పత్రులకు వెసులుబాటు ఉండడంతో, కొన్ని ఆస్పత్రులు ఒక్కో డోస్‌కు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇది ప్రజలపై భారం వేయడమే కాకుండా, విమర్శలకు దారి తీస్తోంది. 
► నిజానికి కోవిడ్‌ వాక్సిన్లు ప్రజలకు ఉచితంగా అందించాల్సి ఉంది. అలా వీలు కాకపోతే నామమాత్రపు ధరలో టీకా వేయాలి. 45 ఏళ్లు దాటిన వారికే రెండు డోస్‌ల వాక్సిన్‌ వేయడానికి సరిపడా సరఫరా ఇప్పుడు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి టీకాలు వేయడం వచ్చే కొన్ని నెలల్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 

అదే జరిగితే బ్లాక్‌ మార్కెట్‌కు బాటలు
► ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కోవిడ్‌ వాక్సిన్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడం సరి కాదు. వాక్సిన్లు సేకరించే ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారం ధరలకు టీకాలు వేసే అవకాశం ఉంది. ఇది పేద ప్రజలను వాక్సిన్‌కు దూరం చేయడమే కాకుండా, డిమాండ్‌ పెరగడంతో వాక్సిన్ల బ్లాక్‌ మార్కెట్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. దీన్ని నియంత్రించడం కూడా కష్టమవుతుంది. రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్ల విషయంలో ఏం జరిగిందో చూశాం. 
► ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వాక్సిన్‌ వేసుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించడం అన్నది మంచి ఆలోచనే అయినా, అవసరానికి మించి వాక్సిన్‌ అందుబాటులో ఉన్నప్పుడే అది సబబు అవుతుంది. 
► వాక్సిన్‌ విరివిగా అందుబాటులో ఉన్నప్పుడు ఖర్చు చేయగలిగిన స్థోమత ఉన్న వారు తమకు ఇష్టం ఉన్న ఆస్పత్రికి వెళ్లి వాక్సిన్‌ వేయించుకుంటారు. కానీ డిమాండ్‌ కంటే చాలా తక్కువగా ఇప్పుడు వాక్సిన్‌ ఉత్పత్తి అవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి వాక్సిన్‌ కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. దీంతో వారు ప్రజల నుంచి ఇష్టానుసారం చార్జీ వసూలు చేసే అవకాశం ఏర్పడింది.
► ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నాను. దేశంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండాలి. అప్పుడే ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా వాక్సిన్‌ డోస్‌లు వేసే వీలుంటుంది. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుని, వాక్సిన్‌ బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోకుండా నిరోధిస్తారని ఆశిస్తున్నాను.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement