కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్న సీఎం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సమర్ధంగా పర్యవేక్షించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పాఠశాలలు, ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఫోన్ నంబర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబరు 1 నాటికి రెండు వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు పత్రాలు ఇవ్వాలని, అనంతరం ప్రతి నెలా వెయ్యి గ్రామాల చొప్పున భూహక్కు పత్రాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పేదల ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం కావాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.3,111.92 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో మహిళల మొబైల్‌లో దిశ యాప్ ఉండేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ...
నాడు – నేడు పనులపై స్పెషల్ ఫోకస్
ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మొదటి విడతలో 15, 715 స్కూళ్లను బాగు చేశాం. రెండో విడత కింద 22,279 స్కూళ్లలో నాడు – నేడు కింద పనులు చేపట్టాం. పనులు నాణ్యంగా ఉండేలా కలెక్టర్లు నిశిత పరిశీలన చేయాలి. అక్కడక్కడా మిగిలిపోయిన చోట్ల కూడా నెలాఖరు నాటికి అన్ని స్కూళ్లలో పనులు ప్రారంభం కావాలి. నాడు – నేడుకు సకాలంలో నిధులు అందచేస్తూ ప్రభుత్వం ఎంతో శ్రద్ధ చూపుతోంది. ప్రతి వారం జరుగుతున్న పనుల వివరాలు తెప్పించుకుని ఎక్కడైనా సమస్యలుంటే పరిష్కరించాలి. స్కూళ్ల నిర్వహణ, మరమ్మతులు (ఎస్‌ఎంఎఫ్), టాయిలెట్ల శుభ్రత కోసం అందుబాటులో ఉంచిన నిధులు వినియోగించుకోవాలి.
ఫిర్యాదులకు ప్రత్యేక ఫోన్ నంబర్లు
స్కూళ్ల నిర్వహణపై ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నంబర్‌ను పాఠశాలల్లో ప్రదర్శించాలి. ఈ నంబర్‌కు అందే ఫిర్యాదులను స్వీకరించి వెంటనే మరమ్మతులు చేపట్టాలి. ప్రతి ఆస్పత్రి, స్కూల్‌లో నిర్వహణకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణకు ఈ నంబర్ ఉండాలి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు.. ఇలా ప్రతి చోటా ఈ ప్రత్యేక నంబర్‌ను ప్రదర్శించాలి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నాం. దీనికి సంబంధించి సంబంధిత జిల్లా కలెక్టర్, ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను కలెక్టర్లు పరిశీలించాలి. వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.
నాలుగు కీలక దశలు..
అత్యంత కీలకమైన జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష కార్యక్రమం చరిత్రలో ఓ అధ్యాయాన్ని సృష్టిస్తుంది. సర్వేకు సంబంధించి ఓఆర్‌ఐ జనరేషన్, గ్రౌండ్ సర్వే, నోటిఫికేషన్ జారీ, జగనన్న భూహక్కు పత్రాల పంపిణీ అనే నాలుగు కీలక దశలున్నాయి. ప్రతి అంశం ఫలానా తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనిపై కలెక్టర్ల సమగ్ర పర్యవేక్షణ ఉండాలి. అంతిమంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే లక్ష్యం.
వేగంగా గృహ నిర్మాణాలు..
పేదల ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం కావాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.3,111.92 కోట్లు ఖర్చు చేశాం. గృహ నిర్మాణాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. రెండో విడత కింద మంజూరైన ఇళ్ల నిర్మాణంపైనా దృష్టి సారించాలి. విశాఖలో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. లేఅవుట్లలో లెవలింగ్ పనులతోపాటు కరెంట్, నీరు లాంటి కనీస వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
ఆప్షన్ –3 ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్లు శ్రద్ధ తీసుకుని పనులను వేగవంతం చేయాలి. పది వేలకుపైగా ఇళ్లు నిర్మిస్తున్న విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, కాకినాడ, మచిలీపట్నం, విజయనగరంతోపాటు పెద్ద సంఖ్యలో నిర్మించాల్సిన ఏలూరు లేఅవుట్లపై సంబంధిత కలెక్టర్లు దృష్టి పెట్టాలి. కాలనీలు పూర్తయ్యే సమయానికి కరెంట్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను కల్పించాలి.
ఇంటి పట్టాలపై పరిశీలన
ఇప్పటివరకూ ఇచ్చిన ఇంటి పట్టాలపై ఒక్కసారి పరిశీలన చేయాలి. లబ్ధిదారులకు పట్టాలు అందాయా? లేవా? వారి పొజిషన్‌కు అప్పగించామా? లేదా? అన్నది అధికారులు పరిశీలించాలి. ఎక్కడైనా అలా జరగకపోతే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. స్థలంలో లబ్ధిదారుడు పట్టాతో ఉన్న ఫొటో తీసుకోవాలి. ఈ నెలాఖరు నాటికి ఈ ఆడిట్ పూర్తి చేయాలి. 90 రోజుల్లోగా ఇంటిపట్టాలు అందించే కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిశీలన చేయాలి.
అర్హులుగా గుర్తించిన వారికి ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో ఖాళీగా ఉన్న చోట్ల వెంటనే కేటాయించాలి. అవసరమనుకుంటే వెంటనే భూ సేకరణ చేసి వారికి పట్టాలు ఇవ్వండి. స్వాపింగ్ విధానాన్ని వినియోగించుకోండి. కుదరని చోట భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వండి.
ప్రతి మహిళ మొబైల్‌లో దిశ యాప్
ప్రతి ఇంట్లో మహిళల మొబైల్‌లో దిశ యాప్ ఉండాలి. వలంటీర్, మహిళా పోలీసుల సహకారంతో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాలి. 15 రోజులకు ఒకసారి దిశ యాప్ పనితీరును కూడా పర్యవేక్షించాలి. ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేయడం, ఫోన్‌ను షేక్ చేయడం ద్వారా దిశ యాప్‌ను యాక్టివేట్ చేస్తూ పోలీసుల ప్రతిస్పందనను గమనించాలి. తద్వారా ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఎస్పీ, కలెక్టర్, జేసీ స్ధాయిలో ఈ తరహా మాక్‌ట్రైల్ నిర్వహించాలి. ఇది చాలా పెద్ద కార్యక్రమం.
ఆగస్టు, సెప్టెంబరులో ఇవీ కార్యక్రమాలు
ఈ నెల 25న నేతన్న నేస్తం అమలు
వచ్చేనెల 22న వైఎస్సార్ చేయూత కార్యక్రమం అమలు
ఎస్‌ఈబీ నంబర్‌తో బోర్డులు
డ్రగ్స్, నార్కోటిక్స్, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టాలి. అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలపైనా దృష్టి పెట్టాలి. విద్యాసంస్థల్లో ప్రతి చోటా ఈ తరహా అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించేందుకు వీలుగా ఒక నంబర్‌ను డిస్‌ప్లే చేయాలి. ఈ నంబర్ అందరికీ కనిపించేలా ప్రతి కాలేజీ, యూనివర్సిటీ ముందు హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి.
అక్రమ మద్యం, జూదం, నార్కోటిక్స్‌కి సంబంధించిన ఫిర్యాదుల కోసం ఎస్‌ఈబీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలి. వీటిపై కఠినంగా వ్యవహరించాలి. జిల్లా కలెక్టర్, ఎస్పీ కనీసం వారానికి ఒకసారి సమావేశమై ఈ తరహా కార్యకలాపాలపై చర్చించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. వచ్చే సమావేశం నాటికి ప్రతి కాలేజీ, యూనివర్సిటీలో ఈ నంబర్‌తో హోర్డింగ్‌లు ఏర్పాటు కావాలి.
Comments
Please login to add a commentAdd a comment