సాక్షి, అమరావతి: విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు–నేడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై సమీక్షించిన సీఎం.. నూతన విద్యా విధానం అమలు కోసం కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, దీని కోసం అయ్యే ఖర్చుతో వివరాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు.
నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు జరుగుతుందని.. ఇప్పటివారికే కాదు, తర్వాత తరాలకు విశేష ప్రయోజనం కలుగుతుందని సీఎం అన్నారు. ఉపాధ్యాయుల్లో, ఇతర భాగస్వాముల్లో అవగాహన, చైతన్యం కలిగించాలని సీఎం సూచించారు. నూతన విద్యా విధానంవల్ల జరిగే మేలును వారికి వివరించాలన్నారు. మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్ కాలేజీలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు-నేడు కింద భూమి కొనుగోలు, వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్ దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే..
►స్కూళ్లు,అంగన్వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదు.
►ఒక్క సెంటర్‌ను కూడా మూసివేయడం లేదు.
►ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకునే మనం మార్పులు చేస్తున్నాం.
►రెండు రకాల స్కూళ్లు ఉండాలన్నది మన లక్ష్యం.
►పీపీ1, పీపీ2, ప్రీపరేటరీ క్లాస్, ఒకటి, రెండు తరగతులు ఒకటిగానూ ఉంటారు.
►వీరందరికీ కిలోమీటరు పరిధిలోపు వీరికి స్కూలు ఉంటుంది.
►మిగిలిన తరగతులు అంటే.. 3 నుంచి10 వ తరగతి వరకూ సమీపంలోనే ఉన్న హైస్కూల్‌పరిధిలోకి తీసుకురావాలి. ఆ స్కూలు కూడా కేవలం 3 కి.మీ పరిధిలో ఉండాలి.
►ఉపాధ్యాయుడు, విద్యార్ధి నిష్పత్తి హేతుబద్ధంగా ఉండడం అన్నది ఈ విధానంలో ప్రధాన ఉద్దేశం.
►నలుగురు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయుడు లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్న పిల్లలకు ఒకరే ఉపాధ్యాయుడు ఉండడం సరికాదు.
►ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టులు బోధించే విధానం సరికాదు.
►పౌండేషన్ కోర్సులో ఇది చాలా అవసరం
►ఎందుకంటే 8 సంవత్సరాలలోపు పిల్లల మానసిక వికాసం చాలా అవసరం
►8 సంవత్సరాలలోపు పిల్లల్లో నూరుశాతం మెదడు అభివృద్ధి చెందుతుంది.
►ఆ వయస్సులో వారిలో నైపుణ్యాలను మెరుగుపర్చాలి
►ఈ వయస్సులో ఉన్న పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులు ఉండాలి
►3 కిలోమీటర్ల లోపు హైస్కూల్ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం
ఎవరూ వేలెత్తి చూపేదిగా ఉండకూడదు
►అలాగే ఒకేచోట ఎక్కువ క్లాస్ రూంలు పెట్టడం సరికాదు
►ఎన్‌ఈపీ(నేషనల్ ఎడ్యుకేషన్ ప్లాన్) ప్రకారం.. నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పన మన లక్ష్యం.
►ఆ మేరకు పిల్లలకు విద్య అందించేదిగా మన విద్యా విధానం ఉండాలి.
►మనం చేస్తున్న పనులన్నీ కూడా తలెత్తుకుని చేస్తున్న పనులు. తలదించుకుని చేస్తున్న పనులు కావు.
►ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉపాధ్యాయులుకు మంచి జరుగుతుందని చెప్పండి
►పిల్లలకు కూడా మంచి జరుగుతుందని వివరించండి.
►నూతన విద్యావిధానంలో ఒక స్కూల్ మూతపడ్డం లేదు
►ఒక్క ఉపాధ్యాయుడ్ని కూడా తీసేయడం లేదు.
►అంతిమంగా అదే సందేశం పోవాలి
►ఇంగ్లీషు మీడియంలో చెప్పాలని ఆరాటపడుతున్నాం
►పిల్లలకు మంచి విద్య అందించాలని తపన పడుతున్నాం.. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
►పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తున్నాం
►ముందు తరాలకు మేలు జరిగేలా విద్యా వ్యవస్ధను తీర్చిదిద్దుతున్నాం. ఇదే విషయాన్ని చెప్పండి.
►ప్రస్తుతం విద్యావ్యవస్ధను అభివృద్ధి చేస్తున్నాం, గొప్ప కార్యక్రమం చేపడుతున్నాం, సానుకూల దృక్పథంతో పనిచేయండి.
►నూతన విద్యావిధానంపై అందరిలో అవగాహన, చైతన్యం కలిగించండి.
►ఎవరైనా సందేహాలు వ్యక్తంచేస్తే అధికారులు వారికి తగిన సమయం కేటాయించి వారి సందేహాలు తీర్చండి
►ఉన్నతాధికారులు చిరునవ్వు, ఓపికతో వారికి కొత్త విద్యావిధానం లక్ష్యాలను, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించండి.
►భాగ స్వాములైన టీచర్లను, ప్రజాప్రతినిధులను అందరినీ పరిగణలోకి తీసుకుని వారికి వివరాలు తెలియజేసి వారిలో అవగాహన కలిగించండి.
►వచ్చే సమావేశానికల్లా ఈ నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, అయ్యే ఖర్చుపై కార్యాచరణప్రణాళిక తయారుచేయాలి.
►రెండేళ్లలో ఈకార్యక్రమాలన్నీ పూర్తికావాలి
అంగన్వాడీల్లో నాడు–నేడు
►అంగన్వాడీలు కూడా నాడు–నేడులో భాగం. దీనికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించండి
►2 సంవత్సరాలలోపు అనుకున్న కాన్సెప్ట్ పూర్తి కావాలి
►వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సమూల మార్పు తీసుకొస్తున్నాం
►ఐదేళ్లలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మూడు రంగాల్లో మనం చేసిన ప్రగతి కనిపించాలి
►సాచ్యురేషన్ పద్ధతిలో అంగన్వాడీలు
►55 వేల అంగన్వాడీల్లో మనం ఎక్కడా తగ్గించడం లేదు
►పౌండేషన్ స్కూల్ కాన్సెఫ్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది
►అందరూ ఇదే ఫాలో అవ్వాలి
►5వ తరగతి వరకు 18 సబ్జెక్టులు ఒక ఎస్‌జీటీ టీచర్ డీల్ చేయలేడు
►ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ అవసరం
►ఆట స్థలంలేని స్కూళ్లకు నాడు– నేడు కింద భూమిని కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం.
►వచ్చే ఏడాది ప్రస్తుతం విద్యాకానుకలో ఇస్తున్న దానికంటే అదనంగా స్పోర్ట్స్ డ్రస్, షూలు ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. దీనికోసం ప్రణాళిక వేసుకోవాలి.
►అలాగే పాఠశాలల్లో ప్రయోగశాలలు, లైబ్రరీలు బలోపేతం చేసుకోవాలన్న సీఎం.
►పాఠశాల లైబ్రరీల్లో మంచి ఇంటర్నెట్ సదుపాయం అందించాలన్న సీఎం.
జులై 1 నుంచి రెండో విడత నాడు– నేడు ప్రారంభం
►స్కూళ్లలో నాడు – నేడుపై తెలంగాణ అధికారులు సంప్రదించారన్న విద్యాశాఖ అధికారులు.
►తెలుగువారు ఎక్కడున్నా వారికి మంచి జరగాలన్న సీఎం.
►విద్యాకానుకలో భాగంగా ఇవ్వనున్న డిక్షనరీని చూపించిన అధికారులు
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభయాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, ఆర్ధికశాఖ కార్యదర్శి గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
చదవండి: తగ్గిందని అలసత్వం వద్దు
బాబు అను‘కుల’ మీడియా చౌకబారు కుతంత్రాలు
Comments
Please login to add a commentAdd a comment