విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ మూడేళ్లలో ఈ మూడు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. ఇంత చేస్తున్నా.. ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై నిరంతరం పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోంది. ఇదంతా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం లేకుండా చేసి, ఇదివరకట్లా పేదలకు మంచి విద్య అందకుండా దూరం చేయాలనే కదా! ఇంతటి దుర్మార్గపు రాజకీయాలు చేస్తుండటం దురదృష్టకరం. ఇలాంటి వాటిని ఎదుర్కొంటూనే మనం లక్ష్యాల వైపు అడుగులు వేయాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రాజకీయాలు చాలా అన్యాయంగా నడుస్తున్నాయి. ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై నిరంతరం దుష్ప్రచారం చేస్తోంది. చివరకు వారి స్వార్థం కోసం స్కూలు పిల్లలనూ రాజకీయాల్లోకి లాగుతున్నారు. విద్యార్థులని కూడా చూడకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై కొన్ని పత్రికలు తప్పుడు వార్తలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వీటిపై సీఎం స్పందిస్తూ ‘విద్యా సంబంధిత కార్యక్రమాలపై రాజకీయాలు దురదృష్టకరం. ముఖ్యంగా లక్షలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు ఆసరాగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు ఇలాంటి దుష్ప్రచారం సాగిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై వక్రీకరణలు ఒక స్థాయికి మించి చేస్తున్నారు’ అని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదవలేక మానేస్తున్నారన్నట్టుగా వక్రీకరణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వక్రీకరణల వెనుక వారి ఉద్దేశం ఏమిటో ప్రజలందరికీ తెలుసని.. మంచి మాటలు చెప్పి, పిల్లల భవిష్యత్తుకు నైతిక స్థైర్యాన్ని అందివ్వాల్సిన వాళ్లే ఇలాంటి వక్రీకరణలు చేస్తుండటం దారుణం అన్నారు.
స్కూళ్ల నిర్వహణపై నివేదికలు
స్కూళ్ల నిర్వహణ అంశాలపై క్రమం తప్పకుండా అధికారులతో పాటు సచివాలయ ఉద్యోగుల నుంచి కూడా నివేదికలు తెప్పించుకోవాలని, ఈ నివేదికలను అనుసరించి ఎలాంటి అలసత్వం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. 8వ తరగతి పిల్లలకు ఇవ్వాల్సిన ట్యాబ్‌లు ప్రస్తుతం లక్షన్నరకు పైగా అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. అవసరమైనన్ని రాగానే, వాటిలో బైజూస్ కంటెంట్‌ను లోడ్ చేయాలని సీఎం చెప్పారు.
8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి మొత్తం 5,18,740 ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నామని, ముందుగా టీచర్లకు పంపిణీ చేసి.. అందులోని కంటెంట్‌పై వారికి అవగాహన కల్పించడం మంచిదని సూచించారు. బైజూస్ కంటెంట్‌ను ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అందిస్తామని.. అందువల్ల ట్యాబ్‌లు పొందిన 8వ తరగతి విద్యార్థులే కాకుండా మిగతా తరగతుల్లోని విద్యార్థులందరికీ ఈ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అధికారులు వివరించారు.
ఆ విద్యార్థులు తమ ఇంట్లో ఉన్న సొంత ఫోన్లలో ఈ కంటెంట్‌ను డౌన్లోడ్ చేసుకొనేలా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ‘బైజూస్ కంటెంట్‌లోని అంశాలను పాఠ్య పుస్తకాల్లో కూడా పొందు పరచాలి. డిజిటల్ పద్ధతుల్లోనే కాకుండా హార్డ్ కాపీల రూపంలో కూడా ఈ కంటెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. మార్కెట్లో వేల రూపాయలు ఖర్చయ్యే కంటెంట్‌ను విద్యార్థులకు ఉచితంగా అందిసున్నాం. దీన్ని డౌన్లోడ్ చేసుకొని అధ్యయనం చేయడం ద్వారా పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది’ అని సీఎం అన్నారు.
‘విద్యాకానుక’లో ఏ లోటూ ఉండకూడదు
‘నాడు – నేడుకు సంబంధించి ఆడిట్‌లో గుర్తించిన అంశాలన్నింపై కూడా దృష్టి పెట్టాలి. ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకునే విధానాన్ని అమలు చేయాలి. నాడు–నేడు కింద తొలి దశలో పనులు పూర్తి అయిన చోట్ల తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నందున ప్రతి స్కూల్లో కూడా జనవరి, ఫిబ్రవరి నాటికి ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. జగనన్న విద్యా కానుకకు సంబంధించి మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.
పిల్లలకు ఇచ్చే యూనిఫారం క్లాత్ సైజును అవసరమైన మేరకు పెంచండి. ప్రస్తుతం జతకు ఇస్తున్న కుట్టు కూలి రూ.40ని ఇకపై రూ.50కి పెంచుతున్నాం. స్కూలు బ్యాగు విషయంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి. వచ్చే ఏడాది నుంచి 1–6 తరగతుల వరకు మీడియం సైజు, 6–10 తరగతుల వారికి పెద్ద బ్యాగు ఇవ్వాలి. షూ సైజులు ఇప్పుడే తీసుకుని, ఆ మేరకు వాటిని నిర్ణీత సమయంలోగా తెప్పించాలి. ఎట్టిపరిస్థితిలో స్కూళ్లు తెరిచే నాటికే విద్యాకానుకను అందించాలి. పీపీ–1, 2 పూర్తి చేసుకున్న అంగన్‌వాడీ పిల్లలను తప్పకుండా స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలి’ అని సీఎం అధికారులకు సూచించారు.
నాణ్యత పరిశీలనకు థర్డ్ పార్టీగా కేంద్ర ప్రభుత్వ సంస్థ
స్కూళ్ల నిర్వహణ మరింత మెరుగవ్వడం కోసం మండల విద్యా శాఖ అధికారితో పాటు మరో అధికారిని పెడుతున్నామని, దీని వల్ల పర్యవేక్షణ మెరుగై మంచి ఫలితాలు వస్తాయని సీఎం తెలిపారు. సెర్ఫ్‌లో పనిచేస్తున్న (ఏపీఎం) అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లను నాన్ అకడమిక్ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నియమిస్తున్నామని అధికారులు వివరించారు. అక్టోబర్ 17 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. ‘జగనన్న గోరుముద్దకు సంబంధించి నేరుగా స్కూళ్లకే సార్టెక్స్ బియ్యం పంపిణీ చేయాలి.
కోడిగుడ్లు పాడవకుండా ఉండేందుకు అనుసరించదగ్గ విధానాలపై దృష్టి పెట్టాలి. మధ్యాహ్న భోజనం నాణ్యతను కచ్చితంగా పాటించాలి. ఇందుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాల్సిన నంబర్ 14417 నంబర్‌ను అన్ని స్కూళ్లలో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి’ అని సీఎం ఆదేశించారు. నాడు–నేడు పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ.1,120 కోట్లు విడుదల అయ్యాయని, పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాకానుక టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వివరించారు. ఏప్రిల్ నాటికే కిట్లను సిద్ధం చేయనున్నామని, నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థను థర్డ్ పార్టీగా పెడుతున్నట్టు సీఎంకు నివేదించారు.
ఈ సమీక్షలో సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వి శేషగిరిబాబు, స్టేట్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్‌ఎస్‌ఏ) బి శ్రీనివాసులు, విద్యా శాఖ సలహాదారు ఏ మురళి, నాడు–నేడు కార్యక్రమం డైరెక్టర్ డాక్టర్ ఆర్ మనోహరరెడ్డి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ (ఎస్‌సీఈఆర్‌టి) బి ప్రతాప్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment