సాక్షి, అమరావతి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం తయారీకి వెంటనే ఆర్డర్ ఇవ్వాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నవంబరు 1న పనులు ప్రారంభించి 13 నెలల్లోగా పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు – పార్క్ అభివృద్ది మాస్టర్ ప్లాన్‌పై సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులు పలు నమూనాలు ప్రదర్శించారు. విగ్రహంతో పాటు, పార్కు నిర్మాణానికి సంబంధించిన విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.(చదవండి: నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష)
ఇందుకు స్పందించిన సీఎం జగన్.. అంబేద్కర్ విగ్రహం విజిబిలిటీ ముఖ్యమని, ఎక్కడి నుంచి చూసినా విగ్రహం స్పష్టంగా కనిపించాలని సూచించారు. అదే విధంగా అక్కడ నిర్మించే పార్కు సైతం పూర్తి ఆహ్లాదకర వాతావరణం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే గ్రాండ్‌లుక్ వస్తుందోనన్న అంశంపై దృష్టి పెట్టాలని, అందుకు అనువైన స్థలం ఎక్కడ ఉందో గమనించి త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నవంబరులో పనులు మొదలుపెట్టి 13 నెలల్లోగా పూర్తయ్యేలా చూడాలని, ఈలోపు ఆ స్ధలంలో ఉన్న ఇరిగేషన్ ఆఫీస్‌లు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ వెంటనే తరలించాలని అధికారులను ఆదేశించారు.
అంతేగాకుండా ఎంజీ రోడ్ నుంచి పార్క్ కనెక్టివిటీ కూడా అందంగా తీర్చిదిద్దాలని.. మొత్తం మీద అక్కడంతా ఆహ్లాదకర వాతావరణమే కనిపించేలా ప్రణాళిక రచించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పార్కులో ఒక కన్వెన్షన్ హాల్ కూడా ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న ముఖ్యమంత్రి.. కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్టు మాత్రమే కమర్షియల్‌గా ఉండాలని, వీటిపై వచ్చే ఆదాయం పార్క్ నిర్వహణకు ఉపయోగపడుతుందని సూచించారు. వీలైనంత వరకు కాంక్రీట్ నిర్మాణాలు తగ్గించాలని, మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment