AP CM YS Jagan Review Meeting On Education Department Updates Oct 2022 - Sakshi
Sakshi News home page

ఇలాంటి వక్రీకరణల వెనుక ఉద్దేశం ఏంటి?: సీఎం జగన్‌

Published Thu, Oct 13 2022 12:17 PM | Last Updated on Thu, Oct 13 2022 5:10 PM

CM YS Jagan Review Meeting Education Department Updates Oct 2022 - Sakshi

సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని విద్యాశాఖ అధికారులు వివరించారు. నాడు-నేడు కింద పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో  ఇప్పటివరకూ రూ.1120  కోట్లు విడుదలయ్యాయి. 

2023-24 విద్యా సంవత్సరంలో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుకను అందించేలా కచ్చితమైన  ప్రణాళిక వేసుకున్నామని, ఇప్పటికే టెండర్లు ప్రక్రియ ప్రారంభించామని అధికారులు తెలిపారు. స్కూళ్ల నిర్వహణ అంశాలపై క్రమం తప్పకుండా సచివాలయ ఉద్యోగుల నుంచి నివేదికలు తెప్పించుకోవాలన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తున్నామని, క్రమం తప్పకుండా నివేదికలు వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.
చదవండి: అనంత వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష.. 2వేల తక్షణ సాయం

ఈ నివేదికలను అనుసరించి ఎలాంటి అలసత్వం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే స్కీంకు సంబంధించి ట్యాబ్‌లు రావడం మొదలయ్యిందని అధికారులు తెలిపారు. లక్షన్నరకు పైగా ట్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి కూడా త్వరలోనే వస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

ట్యాబ్‌లు వచ్చాక దాంట్లోకి కంటెంట్‌ను లోడ్‌ చేసే  పనులు కూడా వెంటనే మొదలు కావాలని సీఎం అన్నారు.  8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి మొత్తంగా 5,18,740 ట్యాబ్‌లు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ముందుగా టీచర్లకు పంపిణీ చేసి, అందులో కంటెంట్‌పై వారికి అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు. అంతేకాక బైజూస్‌ ఇ–కంటెంటును 4 వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ అందిస్తామన్నారు. ట్యాబ్‌లు పొందిన వారు కాకుండా ఈ తరగతులకు చెందిన మిగిలిన విద్యార్థులు కూడా అందుబాటులోకి తీసుకు రావడానికి విద్యార్థులు తమ ఇంట్లో ఉన్న సొంత ఫోన్లలో ఈ కంటెంటును డౌన్‌లోడ్‌ చేసే అవకాశం కల్పిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు పాఠ్యపుస్తకాల్లో కూడా ఈ కంటెంట్‌ పొందుపరచాలని అధికారులకు సీఎం ఆదేశించారు. డిజిటల్‌ పద్ధతుల్లోనే కాకుండా హార్డ్‌ కాపీల  రూపంలో కూడా ఈ కంటెంట్‌ అందుబాటులో ఉంటుందన్న సీఎం.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.

మార్కెట్లో బయట వేల రూపాయల ఖర్చయ్యే కంటెంట్‌ను ఉచితంగా వారి వారి సెల్‌ఫోన్‌లో  డౌన్‌లోడ్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తూ దీన్నికూడా వక్రీకరించి కొన్ని మీడియ సంస్థలు కథనాలు రాస్తున్న విషయంపై సమావేశంలో ప్రస్తావన కొచ్చింది. విద్యా సంబంధిత కార్యక్రమాలు, వారికి మంచి చేసే నిర్ణయాలను కూడా రాజకీయాల్లోకి లాగడం అత్యంత దురదృష్టకరమన్న సీఎం అన్నారు. స్కూలు పిల్లలనుకూడా రాజకీయాలను నుంచి మినహాయించడంలేదని, వారిని కూడా అందులోకి లాగుతున్నారని సీఎం అన్నారు. 

నాడు-నేడు రెండో విడత పనుల పరిస్థితిని సీఎంకు వివరించిన అధికారులు
స్కూళ్లలో నాడు-నేడు కింద కల్పించిన సౌకర్యాలు, వాటి నిర్వహణపై ఆడిట్‌ చేయించామన్న అధికారులు
ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకునే విధానాన్ని అమలు చేస్తున్నామన్న అధికారులు
తరగతి గదులను డిజిటలైజేషన్‌ చేస్తున్నందున ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నెట్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలన్న సీఎం
జనవరి– ఫిబ్రవరి నాటికి ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నెట్‌ సౌకర్యం ఏర్పాటు అవుతుందన్న అధికారులు
ఆడిట్‌లో గుర్తించిన అంశాలన్నింటిపై కూడా దృష్టిపెట్టాలన్న సీఎం
మరింత పకడ్బందీగా విద్యాకానుక అందించడానికి చర్యలు తీసుకుంటున్న అధికారులు
వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్న అధికారులు
ఏప్రిల్‌ నాటికే విద్యాకానుక కిట్లను సిద్ధంచేస్తున్నామన్న అధికారులు
పిల్లలకు ఇచ్చే యూనిఫారం క్లాత్‌ సైజును పెంచేందుకు సీఎం అంగీకారం

అలాగే స్టిచ్చింగ్‌ ధరలు కూడా పెంచేందుకు సీఎం అంగీకారం
ప్రస్తుతం జతకు రూ.40 ఇస్తుండగా, ఇకపై రూ. 50 ఇవ్వనున్న ప్రభుత్వం
అలాగే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకూ మీడియం సైజు స్కూలు బ్యాగు, 6 నుంచి 10వ తరగతి వరకూ పెద్ద బ్యాగు ఇస్తున్నామన్న అధికారులు
నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థను థర్డ్‌ పార్టీగా పెడుతున్నట్టు తెలిపిన అధికారులు
షూ సైజులు కూడా ఇప్పుడే తీసుకుని ఆ మేరకు షూలను నిర్ణీత సమయంలోగా తెప్పిస్తామన్న అధికారులు
అంగన్వాడీ పిల్లలు పీపీ–1,2 పూర్తిచేసుకోగానే వారు స్కూళ్లలో తప్పకుండా చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు
ప్రభుత్వ పాఠశాలలపై వక్రీకరణలు ఒక స్థాయికి మించి చేస్తున్నారు: సీఎం
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను చదవలేక మానేస్తున్నారన్నట్టుగా వక్రీకరణలు చేస్తున్నారు: సీఎం
ఇలాంటి వక్రీకరణలు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి?
మంచి మాటలు చెప్పి.. పిల్లల భవిష్యత్తుకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వాల్సిన వాళ్లు ఇలాంటి వక్రీకరణలు చేస్తున్నారు: సీఎం
స్కూళ్లు మరింత మెరుగైన నిర్వహణ కోసం, మండల విద్యాశాఖ అధికారితో పాటు మరో అధికారిని పెడుతున్నామన్న అధికారులు
సెర్ఫ్‌లో పనిచేస్తున్న (ఏపీఎం) అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లను నాన్‌ అకడమిక్ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నియమిస్తున్నామన్న అధికారులు
అక్టోబరు17 నుంచి కూడా ఈ విధానం అమల్లోకి వస్తుందన్న అధికారులు

జగనన్న గోరుముద్ద పథకంపైనా సీఎం సమీక్ష
నేరుగా స్కూళ్లకే సార్టెక్స్‌ బియ్యం పంపిణీ
కోడిగుడ్లు పాడవకుండా ఉండేందుకు అనుసరించదగ్గ విధానాలపైనా చర్చ
మధ్యాహ్న భోజనం నాణ్యతను కచ్చితంగా పాటించాలన్న సీఎం

విద్య, వైద్య, వ్యసాయం రంగంలో విప్లవాత్మక మార్పు
విద్యా, వ్యవసాయం, ఆరోగ్యం రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం: సీఎం
ఈ మూడేళ్లలో ఈ మూడు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం
ఎన్నడూలేని రీతిలో డబ్బు ఈ మూడురంగాలపై ఖర్చుచేశాం
ప్రభుత్వం తలెత్తుకుని గర్వంగా చెప్పుకునేట్టుగా ఈ మూడు రంగాల్లో పనులు చేశాం
ఇంత చేస్తున్నా.. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో రాజకీయాలు చాలా అన్యాయంగా నడుస్తున్నాయి
ఓ వర్గ మీడియా నిరంతరం దుష్ప్రచారం చేస్తోంది
ఇలాంటి వాటిని ఎదుర్కొంటూ లక్ష్యాలవైపు అడుగులు వేయాలి: అధికారులకు సీఎం నిర్దేశం

ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎం వి శేషగిరిబాబు, స్టేట్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఎస్‌ఎస్‌ఏ) బి శ్రీనివాసులు, విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ, నాడు నేడు కార్యక్రమం డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ మనోహరరెడ్డి,  పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌(ఎస్‌సీఈఆర్‌టి) బి ప్రతాప్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement