CM YS Jagan Review Meeting On Women And Child Development - Sakshi
Sakshi News home page

CM YS Jagan: అంగన్‌వాడీలపై సమీక్ష.. అధికారులకు సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published Wed, Oct 19 2022 12:02 PM | Last Updated on Wed, Oct 19 2022 4:16 PM

CM YS Jagan Review Meeting On Women And Child Development - Sakshi

సాక్షి, తాడేపల్లి: మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో అంగన్‌వాడీలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారించడానికి  రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా నిర్దేశించుకున్న ప్రమాణాలతో అంగన్‌వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. దీన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక యాప్‌లు రూపకల్పన చేయాలని, తద్వారా సుస్థిర ప్రగతి లక్ష్యాలను సాధించవచ్చని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అంగన్‌వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారంలో క్వాలిటీ, కచ్చితమైన క్వాంటిటీ ఉండాలన్నారు. ప్రతిరోజూ నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. దీనికోసమే దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సూపర్‌వైజర్ల నియామకాలను ప్రారంభించామని, దురదృష్టవశాత్తూ కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారని ప్రస్తావించారు. వీలైనంత త్వరగా ఈ పోస్టుల భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. అక్టోబరులో నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం నూటికి నూరుపాళ్లు క్వాలిటీ, క్వాంటిటీ ఆహారం పిల్లలకు అందాలని పేర్కొన్నారు.
చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల

అంగన్‌వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. సొంత భవనాల్లోనే కాకుండా అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీల్లో కూడా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈమేరకు కార్యాచరణ సిద్ధంచేసుకోవాలన్న సీఎం..అంగన్‌వాడీల్లో నాడు – నేడు ద్వారా సమగ్రాభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖతో కలిసి ఈమేరకు కార్యాచరణ చేసుకోవాలన్నారు. 

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
►అంగన్‌వాడీల రూపురేఖలను సంపూర్ణంగా మార్చాలి
►అంగన్‌వాడీల్లో ప్రస్తుత పరిస్థితులు ఏంటి? ఎలాంటి సదుపాయాలు కల్పించుకోవాలి? ఏ రకంగా వాటిని తీర్చిదిద్దాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళిక తయారు చేసుకోవాలి.
►విడతల వారీగా ఆ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాలి.
►పిల్లలకు ఇచ్చే ఆహారం పాడవకుండా చూసేందుకు ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై కూడా దృష్టిపెట్టాలి.
►పిల్లలు రోజూ తీసుకునే పాలు, గుడ్లులాంటివి పాడవకుండా నిల్వచేసే విధానాలపైనా కూడా దృష్టిపెట్టాలి.

►అంగన్‌వాడీల్లో ప్రతిచోటా ఫ్రిడ్జ్‌  ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలి.
►స్కూళ్లకు, అంగన్‌వాడీలకు సరఫరాచేసే ఆహారంపై నాణ్యత, పర్యవేక్షణకు మరిన్ని చర్యలు.
►డిసెంబర్‌1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను చేపట్టనున్న మార్క్‌ఫెడ్‌.ప్రత్యేక యాప్‌ ద్వారా దీని పర్యవేక్షణ.
►నవంబరు నుంచి నుంచి గుడ్ల పంపిణీపై కూడా యాప్‌ ద్వారా పర్యవేక్షణ.
►ఈ ఆహార నాణ్యత బాగుందా? లేదా? అన్నదానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్‌ పార్టీ పర్యవేక్షణ.
►ఈలోగా పంపిణీ అవుతున్న ఆహారం క్వాలిటీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం. 

►క్వాలిటీ, క్వాంటిటీపై యాప్‌ల ద్వారా సమగ్ర పర్యవేక్షణ ఉండాలి.
►అంగన్‌వాడీల పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజి క్లినిక్స్‌ ద్వారా,  ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలి:
►సచివాలయంలోని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి:
►శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సహాయమే కాకుండా, ఆ పిల్లలకు పౌష్టికాహారం మరింత పెంచేలా తగిన ఆలోచనలు చేయాలి.
►దీనివల్ల రక్తహీనత, శారీరక బలహీనతలను మొదటి దశలోనే నివారించే అవకాశం ఉంటుంది.
►అంగన్‌వాడీలపై సూపర్‌వైజర్ల పర్యవేక్షణ జియోట్యాగింగ్‌ చేయాలలి.

►అంగన్‌వాడీలకు, సూపర్‌వైజర్లకు మొత్తంగా దాదాపు 57వేలమందికి సెల్‌ఫోన్ల్‌ పంపిణీ కార్యక్రమాన్నిసీఎం ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే పౌష్టిహారం, ఇతర సేవలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు, సమగ్రపర్యవేక్షణ కోసం అంగన్‌వాడీ సెంటర్లకు, వర్కింగ్‌ సూపర్‌ వైజర్లకు ఈ సెల్‌ఫోన్స్‌ ప్రభుత్వం అందిస్తుంది.

సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవాలి.
►గతంలో పిల్లల భోజనానికి నెలకు సుమారురూ.500 కోట్లు ఉండేది, ఈరోజు నెలకు సుమారుగా రూ.1900 కోట్లు ఖర్చుచేస్తున్నాం.
►విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమాలకోసం చాలా పెద్ద ఎఫర్ట్‌ పెడుతున్నాం.
►ఇంగ్లిషు మీడియంను చిన్ననాటినుంచే అలవాటు చేయడానికి ఫౌండేషన్‌ స్కూల్స్, శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌ తీసుకువచ్చాం.
►నాడు – నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలు మారుస్తున్నాం.
►ఇన్నివేల కోట్లు ఖర్చుచేసి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాం.
►ఇన్ని కార్యక్రమాలు చేసినా..సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదు.
►అందుకే కచ్చితమైన పర్యవేక్షణ అవసరం.
►అధికారులు కూడా సరైన సమయంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.
►దేశంలో నంబర్‌వన్‌ కావడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం

ఈ సమీక్షా సమావేశంలో మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీచరణ్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ ఎ బాబు, మార్క్‌ఫెడ్‌ ఎండీ పి ఎస్‌ ప్రద్యుమ్న, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్‌‌ ఎ సిరి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement