అసలు వ్యవసాయమే దండగ అని.. ఎంత మందిని వీలైతే అంత మంది రైతులను ఈ రంగం నుంచి బయటకు రప్పించడమే లక్ష్యం అని విజన్–2020 ద్వారా చాటిన పెద్దమనిషి చంద్రబాబు. గతంలో వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామంటే.. తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన ఘనుడూ ఈయనే. అలాంటి చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తానని కబుర్లు చెబుతున్నారు.
ఇదివరకెన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలతో అన్నదాతలకు చేస్తున్న మేలుపై నిస్సిగ్గుగా దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ఎవరు నవ్వి పోయినా పర్వాలేదనుకునే, ఎవరేమన్నా తుడుచుకుని వెళ్లే రకమైన ఈ బాబు దింపుడుకళ్లం ఆశగా నోటికొచ్చిన హామీలిస్తున్నారు. – సాక్షి, అమరావతి
ఆరుగాలం కాయకష్టం చేసి అందరికీ అన్నంపెట్టే అన్నదాతకు ఒకప్పుడు కంటి మీద కునుకు ఉండేది కాదు. పంట చేలకు నీరు పెట్టడానికి బోర్ల దగ్గర రేయింబవళ్లు కాపలా కాయాల్సివచ్చేది. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులుండేవి. రాత్రిళ్లు పొలాల్లో ఉండటం వల్ల రైతులు పాము కాట్లకు, కరెంటు షాకులకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేది.
విత్తనాల కోసం, విత్తుకున్న తర్వాత ఎరువుల కోసం ఎండనక, వాననక, పగలనకా, రేయనకా నిద్రాహారాలు మాని సొసైటీల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంతో ప్రభుత్వం పగటిపూటే తొమ్మిది గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది.
విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలను చేయిపట్టుకుని నడిపిస్తోంది. దీనిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. తాను అధికారంలో ఉండగా రైతుల యోగ క్షేమాలను గాలికొదిలేసిన ఆయన ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ రైతులకు మంచి చేస్తున్న సీఎం జగన్‌పై దుష్ప్రచారానికి ఒడిగట్టడం దుర్మార్గం.
కౌలు రైతులకు బాసట
గత ప్రభుత్వాలు ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం–2019ని తీసుకురావడమే కాకుండా పంట సాగు హక్కు పత్రాలు (సీసీఆర్సీ) ఆధారంగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఈ– క్రాప్ నమోదుతో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి రాయితీ, ఉచిత పంటల బీమా వంటి సంక్షేమ ఫలాలతో కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
నాలుగేళ్లలో 30 వేల మంది కౌలు రైతులకు రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీ ఇచ్చింది. 2.14 లక్షల మందికి రూ.224.27 కోట్ల పంట నష్టపరిహారం (ఇన్‌పుట్ సబ్సిడీ), 1.73 లక్షల మందికి రూ.487 కోట్ల పంటల బీమా పరిహారం ఇచ్చింది. కౌలు రైతులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం అందిస్తోంది. నాలుగేళ్లలో 25.38 లక్షల మందికి సీసీఆర్సీ పత్రాలు జారీ చేయగా, ఇందులో 17.71 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. మిగతా 8 లక్షల మంది రైతులు ఓసీల్లోని పేదలేనని చంద్రబాబుకు ఎవరైనా చెప్పండి.
ఆక్వాకూ భరోసా
గత ప్రభుత్వం 2014 నుంచి 2016 వరకు ఆక్వా సాగుకు స్లాట్ల ఆధారంగా విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ.4.63 నుంచి రూ.7, 2016 నుంచి 2018 మే వరకూ యూనిట్ రూ.3.86 చొప్పున వసూలు చేసింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు యూనిట్‌కు రూ.2 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించింది. కానీ ఇవ్వాల్సిన సబ్సిడీ భారం రూ.312.05 కోట్లను డిస్కంలకు చెల్లించకుండా బాకీ పెట్టింది.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఈ భారాన్ని భరించాల్సి వచ్చింది. అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు చెబుతున్నట్లు ఆక్వా రైతులకు రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా జరగనేలేదని స్పష్టమవుతోంది. ప్రస్తుత ప్రభుత్వం 63,754 ఆక్వా కనెక్షన్లలో అర్హత ఉన్న 46,445 కనెక్షన్లకు యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తోంది.
ఆది నుంచి రైతులకే అగ్రస్థానం
వైఎస్ జగన్.. అధికారం చేపట్టిన నాటి నుంచి వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. డిస్కంల ద్వారా దాదాపు 19.85 లక్షల వ్యవసాయ సర్వీసులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ.5.500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది.
30 ఏళ్ల పాటు వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని కొనసాగించడం కోసం సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (సెకీ)తో ఒప్పందం చేసుకుంది. సెకీ నుంచి యూనిట్ కేవలం రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది.
ఆర్బీకేల వద్దకు వెళ్తే చాలు..
నేను 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఏ అవసరం ఉన్నా ఆర్బీకేల వద్దకు వెళితే చాలు. వ్యవసాయ సిబ్బంది అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. – వాసిరెడ్డి సత్తిరాజు, ఏడిద, మండపేట మండలం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
రైతులకు మద్దతు ధర
నేను ఐదు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాను. ప్రభుత్వ చర్యలతో ధాన్యానికి మద్దతు ధర లభిస్తోంది. గతంలో వ్యాపారులు చెప్పిన ధరకు అమ్మాల్సి వచ్చేది. తడిసిన ధాన్యానికి కూడా మంచి ధర ఇస్తున్నారు. వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది దగ్గరుండి ధాన్యం కొనుగోళ్లు చేయిస్తున్నారు. ధాన్యం సొమ్ము కూడా సకాలంలో అందించారు. – కోశెట్టి లోవరాజు, ఏడిద, మండపేట మండలం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఎగతాళి చేసిన చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు
ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతోంది. గత ప్రభుత్వంలో వారికి కావాల్సిన కొద్ది మందికే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేవారు. గతంలో వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎగతాళి చేసిన చంద్రబాబుకు ఇప్పుడు వ్యవసాయం గురించి, అందునా ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే అర్హతే లేదు.
– రామిశెట్టి సుబ్బరాజు, ఏడిద, మండపేట మండలం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment