రైతన్నకు రక్షణగా 'పోలీస్'‌ వ్యవస్థ | CM YS Jagan Says That Police System To Protect The Farmers | Sakshi
Sakshi News home page

రైతన్నకు రక్షణగా 'పోలీస్'‌ వ్యవస్థ

Published Wed, Feb 3 2021 3:28 AM | Last Updated on Wed, Feb 3 2021 3:59 PM

CM YS Jagan Says That Police System To Protect The Farmers - Sakshi

తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి చాలా మంది రైతులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ వారికి ఏవైనా ఇబ్బందులు వస్తే, మోసానికి గురైతే.. చట్టపరంగా, ఇతరత్రా రక్షణగా ఈ కొత్త వ్యవస్థ వారికి అండగా నిలవాలి. ఎంత త్వరగా స్పందించి, వారికి అండగా నిలబడుతున్నామన్నదే ప్రధాన లక్ష్యం. ఇందుకు రైతు భరోసా కేంద్రాలు, పోలీసులు పరస్పర అవగాహన, అనుసంధానంతో పని చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ 2 గంటల పాటు కచ్చితంగా స్పందన కార్యక్రమం నిర్వహించాలి. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి ప్రత్యేకంగా యూనిఫామ్స్‌ నిర్దేశించాలి. 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇబ్బందులు, మోసాలకు గురికాకుండా రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని, ఇందు కోసం జిల్లాకు ఒక రైతు భరోసా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం తదితర వ్యవహారాల్లో మోసాలు జరిగితే వారికి అండగా నిలిచి, వారికి న్యాయం చేసేలా ఈ వ్యవస్థ ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. బయటి ప్రాంతాల్లో వ్యాపారుల నుంచి మోసాలకు గురి కాకుండా వారికి భద్రత కల్పించడమే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు. దిశ చట్టం అమలు, సైబర్‌ కియోస్క్ లు, జిల్లాకొక రైతు భరోసా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు, సచివాలయ సిబ్బందికి యూనిఫాం, స్పందన నిర్వహణ అంశాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో దిశ హెల్ప్‌ డెస్క్‌ మాదిరిగా రైతుల కోసం ఒక డెస్క్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఈ డెస్‌్కలు అన్నీ జిల్లా స్థాయి పోలీస్‌ స్టేషన్‌ కింద ఉండాలన్నది ప్రాథమిక ఆలోచనని తెలిపారు. ఈ నూతన వ్యవస్థ ఎలా ఉండాలనే దానిపై మేధోమథనం చేసి, పూర్తి స్థాయిలో ఆలోచించి.. కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో హోంమంత్రి సుచరిత తదితరులు 

మహిళలు, బాలలపై నేరాల్లో 7 రోజుల్లో చార్జిషీటు
మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించి 7 రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేసే దిశగా అడుగులు ముందుకు వేయాలి. దర్యాప్తునకు అనుసరించే ప్రక్రియలో మౌలిక సదుపాయాల పరంగా సమస్యలు ఏమైనా ఉంటే దానిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా దృష్టి పెట్టడంతో పాటు అన్ని పోలీస్‌ స్టేషన్లలో మహిళా హెల్ప్‌ డెస్‌్కలు ఏర్పాటు చేయాలి.  
– మొబైల్‌ ఫోన్ల సెక్యూరిటీ కోసం ప్రారంభించిన సైబర్‌ కియోస్క్‌ మంచి ఫలితాలను ఇస్తున్నందున, దాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై పలు సూచనలు కియోస్క్‌ వద్ద పెట్టాలి. రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్ల వద్దే కాకుండా విద్యా సంస్థల వద్ద కూడా సైబర్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేయాలి. వీటికి ‘దిశ కియోస్క్’ అని పేరు పెట్టాలి. తిరుపతి, విశాఖపట్నంలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. 
 
దిశ యాప్‌పై విస్తృత ప్రచారం  
– దిశ పోలీస్‌ స్టేషన్ల వద్ద, కాలేజీల వద్ద దిశ కార్యక్రమం కింద అందే సేవలు, రక్షణ, భద్రత అంశాలను పొందుపరుస్తూ హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులతో అనుసంధానం కావాలి. 
– గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులకు దిశ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించాలి. గ్రామాల్లో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, ఏఎన్‌ఎంలకు కూడా దిశ యాప్‌పై అవగాహన కల్పించాలి. గ్రామ సచివాలయాల్లో దిశ యాప్‌ సహా.. దాని కింద చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి పోస్టర్లు, హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలి. 
– దిశ ఎస్‌ఓఎస్‌ నుంచి కాల్‌ వచ్చిన వెంటనే నిర్దేశిత సమయంలోగా పోలీసులు అక్కడ ఉంటున్నారా? లేదా? (సగటున 6 నిమిషాల్లోగా చేరుకుంటున్నామని, కొన్ని ఘటనల విషయంలో కౌన్సిలింగ్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు) ఇలాంటి ఘటనల్లో ఫిర్యాదులు చేసిన మహిళలకు క్రమం తప్పకుండా కాల్స్‌ వెళ్లాలి. వారి సమస్య తీరిందా? లేదా? అన్న దానిపై వారి నుంచి తప్పనిసరిగా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. ఈ ఫాలో అప్‌ క్రమం తప్పకుండా చేయాలి. 
 
మహిళలపై 7.5 శాతం తగ్గిన నేరాలు  
– ‘దిశ’ అమలు, మహిళల భద్రత, రక్షణపై ప్రత్యేక దృష్టి కారణంగా 2019తో పోలిస్తే 2020లో మహిళలపై 7.5 శాతం నేరాలు తగ్గాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 471 కేసులకు సంబంధించి 7 రోజుల్లో, 1,080 కేసుల్లో 15 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేశామని, 103 కేసుల్లో శిక్షలు ఖరారు అయ్యాయని చెప్పారు. 
– సైబర్‌ బుల్లీయింగ్‌పై 1,531 కేసులు, లైంగిక వేధింపులకు సంబంధించి 823 కేసులు పెట్టామన్నారు. గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ 1,40,415 మంది డేటాను క్రోడీకరించామని, సైబర్‌ మిత్ర ద్వారా 2,750 పిటిషన్లు స్వీకరించామని, 374 ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్‌ చేశామని తెలిపారు. 
– ఇప్పటి వరకు 12 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారని, యాప్‌ను ఉపయోగించి రిపోర్టు చేసిన 799 ఘటనల్లో చర్యలు తీసుకున్నామని, ఇందుకు సంబంధించి 154 ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్‌ చేశామని అధికారులు వెల్లడించారు. 
– మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు దిశ తరహా కార్యక్రమాలను చేపట్టాయని, దిశ దర్యాప్తు (పెట్రోలింగ్‌) వాహనంపై ప్రధాని నుంచి ప్రశంసలు లభించాయని తెలిపారు.  
– ఈ సమీక్షలో హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, దిశ స్పెషల్‌ ఆఫీసర్లు కృతికా శుక్లా, దీపికా పాటిల్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement