CM YS Jagan Solved Dotted Lands Problems Relief to Farmers - Sakshi
Sakshi News home page

ఏపీ: చుక్కల భూముల చిక్కులకు జగనన్న సర్కార్‌ శాశ్వత పరిష్కారం ఇలా..

Published Thu, May 11 2023 8:07 PM | Last Updated on Thu, May 11 2023 8:29 PM

CM YS Jagan Solved Dotted Lands Problems Relief To Farmers - Sakshi

సాక్షి,  అమరావతి: దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడుతూ.. చుక్కల భూముల చిక్కులకు జగనన్న ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించింది. ఇంకేం.. రైతన్నలకు ఇక నిశ్చింత.. సర్వ హక్కులూ వారికే..!. రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ  2,06,171 ఎకరాల చుక్కల భూములకు.. సంపూర్ణహక్కును అందించే కార్యక్రమాన్ని శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు కావలిలో రేపు (శుక్రవారం) లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.  

చుక్కల భూముల నేపథ్యం.. బ్రిటీష్‌ వారి కాలంలో సుమారు వంద సంవత్సరాల క్రితం భూసర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ భూమి‘ లేదా ‘ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయని కారణంగా రెవెన్యూ రికార్డులలో (రీ సెటిల్మెంట్‌ రిజిస్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌) పట్టాదారు గడిలో ‘చుక్కలు‘ పెట్టి వదిలేశారు. సదరు భూములే ‘చుక్కల భూములు‘. వీటి వల్ల సంపూర్ణ హక్కులు లేక దశాబ్దాలుగా రైతులు ఆ భూములు అనుభవిస్తున్నా వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక, సర్వ హక్కులు లేక ఇబ్బంది పడుతున్న దుస్థితి..

అదనంగా రైతులకు మరింత ఇబ్బంది కలిగేలా 2016లో అప్పటి ప్రభుత్వం వీరికి పూర్తిగా అన్యాయం చేసిన పరిస్థితి. గత ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల ఈ భూములన్నీ ఒక్క కలం పోటుతో నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ పరిస్థితిని సమూలంగా మారుస్తూ ప్రతి రైతన్న కుటుంబానికి మేలు జరగాలని, వారి ఆస్థిపై పూర్తి హక్కులు వారికే చెందాలని రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతన్నలు తిరిగే అవసరం లేకుండా, వారికి ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా దశాబ్దాల కాలం నాటి ఈ చుక్కల భూముల సమస్యలకు పరిస్కారం చూపిన వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం.

జగనన్న ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు లక్ష మంది రైతన్నల కుటుంబాలకు రూ.20,000 కోట్ల లబ్ది
సంవత్సరాల తరబడి తమ స్వాధీనంలో ఉండి కూడా ఏ అవసరాలకు (క్రయవిక్రయాలు, రుణం, తనఖా, వారసత్వం, బహుమతి మొదలగు) వాడుకోలేని దుస్థితి నుంచి వారి వారి భూములకు వారిని పూర్తి హక్కుదారులను చేసి నేడు సుమారు 97,471 కుటుంబాలకు దాదాపు రూ. 20,000 కోట్ల మేర లబ్ది చేకూర్చింది సీఎం జగన్‌ నేతృత్వంలోని సర్కార్‌. ఈ ప్రభుత్వ నిర్ణయంతో సర్వ హక్కులు కూడా లభించేలా నిషేధిత భూముల జాబితా నుండి తొలగించబడింది సుమారు 2,06,171 ఎకరాల భూమి.

పేదలకు మేలు చేస్తూ జగన్‌ ప్రభుత్వం రెవెన్యూ విభాగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు
జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే సుమారు 22,000 మంది పేద రైతన్నలకు మేలు జరిగేలా నిషేధిత భూముల జాబితా నుండి సుమారు 35,000 ఎకరాల ‘‘షరతులు గల పట్టా భూముల‘ తొలగించింది. 

దేశంలోనే మొదటి సారిగా అనేక రకాల భూ సమస్యలకు శాశ్వతపరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో వందేళ్ల తర్వాత చేపట్టిన ‘‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష‘ ద్వారా ఇప్పటివరకు 2000 గ్రామాల్లో 7,92,238 కి పైగా భూహక్కు పత్రాలు రైతులకు అందజేసింది. భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కరించాలనే దృక్పథంతో డిసెంబర్‌ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలో ఉన్న మొత్తం 17,584 గ్రామాలు, పట్టణాల్లో భూముల రీసర్వే పూర్తి అయ్యి.. శాశ్వత భూహక్కుపత్రాల జారీ చేసింది.

ఇప్పటికే దాదాపు 1,27,313 మంది గిరిజనులకు సుమారు 2.83 లక్షల ఎకరాల అటవీ హక్కుపత్రాల పంపిణీ జరిగింది. పేద గిరిజనులందరికీ కనీసం రెండు ఎకరాల భూమి కేటాయింపుతో పాటు కుటుంబంలోని అక్కాచెల్లెమ్మల పేరున పత్రాలు జారీ అయ్యాయి. ఇప్పటికే దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇళ్లు కూడా నిర్మిస్తోంది జగనన్న ప్రభుత్వం.

గత ప్రభుత్వంలో..
చిన్న మెమో ద్వారా రైతుల ఆధీనంలో ఉన్న చుక్కల భూములన్నింటిని 2016లో ఏకపక్షంగా నిషేధిత భూముల జాబితా క్రింద సెక్షన్‌ 22ఏ(1)(ఈ)పరిధిలోకి తీసుకురావడంతో.. దశాబ్దాలుగా తమ సాగుబడిలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు లేదా మరే ఇతర లావాదేవీలు చేసుకోలేని దయనీయ పరిస్థితి. అప్పటి నుంచి పిల్లల చదువుల కోసమో, బిడ్డల పెళ్లి కోసమో, జబ్బు చేసినప్పుడు వైద్యం కోసమో విక్రయించాలన్నా వీలు కాని దుస్థితి ఏర్పడింది. పైగా రెవెన్యూ ఆఫీసులు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు.. వ్యయప్రయాసలు, వృధా ఖర్చులతో ఇబ్బందుల పాలయ్యారు రైతన్నలు. అయితే..

మరి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో..
రైతన్నలకు హక్కు భద్రత కల్పించాలనే లక్ష్యంతో చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా అడుగులేసింది సీఎం జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం.  కలెక్టర్ల ద్వారా చుక్కల భూమి గుర్తింపుతో పాటు రైతులకు సంబంధించిన ప్రైవేట్‌ భూములను చుక్కల భూముల స్టేటస్‌ నుండి తొలగించి పట్టా భూములుగా మారుస్తూ 22ఏ(1)(ఈ) నుండి డీ నోటిఫికేషన్‌ చేసింది. తద్వారా 97, 471 కుటుంబాలకు మేలు చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.

జగనన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల.. ఈ భూములను సర్వ హక్కులతో క్రయ విక్రయాలకు, రుణాలు పొందడానికి, తనఖా పెట్టుకోవడానికి, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి వెసులుబాటు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 97,471 కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల భూములకు పూర్తి హక్కుల కల్పన అందించింది. 

రైతన్నలు రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఒక్క పైసా కూడా చెల్లించే పని లేకుండా చుక్కల భూముల సమస్యలకు స్వస్తి పలికింది సీఎం జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం. 

రెవెన్యూ సమస్యలు, సలహాల కోసం సంప్రదించాల్సిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 1902
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement